Share News

కొండవీడు వాగు ‘రివర్‌’్స ఫ్లో

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:56 AM

రాజధాని అమరావతి ప్రాంతంలోని వరద నీటిని కృష్ణానదిలోకి చేరవేసే కొండవీడు వాగు రెగ్యులేటర్‌ ప్రమాదస్థాయికి చేరింది. నదిలో పెరిగిన వరద నీరు దెబ్బతిన్న రెగ్యులేటర్‌ గేట్ల ద్వారా తిరిగి వాగులోకి చేరుతోంది.

కొండవీడు వాగు ‘రివర్‌’్స ఫ్లో
కొండవీడు వాగు వద్ద వరద ఉధృతి

రెగ్యులేటర్‌ దెబ్బతినడంతో వాగులోకి ఎదురెళ్తున్న వరద

పక్కనే లిఫ్ట్‌ ద్వారా నదిలోకి తోడుతున్న యంత్రాంగం

విజయవాడ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతి ప్రాంతంలోని వరద నీటిని కృష్ణానదిలోకి చేరవేసే కొండవీడు వాగు రెగ్యులేటర్‌ ప్రమాదస్థాయికి చేరింది. నదిలో పెరిగిన వరద నీరు దెబ్బతిన్న రెగ్యులేటర్‌ గేట్ల ద్వారా తిరిగి వాగులోకి చేరుతోంది. రాజధాని ప్రాంతంలోని లాం గ్రామం నుంచి కొండవీడు వాగు ప్రారంభమై పెదపరిమి, నీరుకొండ, కృష్ణాయపాలెం, పెనుమాక, తుళ్లూరు, వెలగపూడి మీదుగా కృష్ణానదిలోకి చేరుతుంది. 30 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వాగులోకి కొట్టెళ్ల వాగు, పాలవాగు, ఎర్రవాగులు సైతం కలుస్తాయి. ఆయా ప్రాంతాలు ముంపుబారిన పడకుండా ఈ వాగులే రక్షణగా ఉంటాయి. మొంథా తుఫాను ప్రభావానికి కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాల్లోని సాగు భూముల్లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిని అంతా కొండవీడు వాగు మాత్రమే కృష్ణానదిలోకి చేరవేయాల్సి ఉంటుంది. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉంటే కృష్ణానది వద్ద కట్టిన రెగ్యులేటర్‌ నుంచి ఈ నీరు గ్రావిటీ ద్వారా నదిలో కలుస్తుంది. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రెగ్యులేటర్‌ గేట్లను దించేసి, పక్కనే ఉన్న లిఫ్ట్‌ ద్వారా నదిలోకి తోడతారు.

నదిలో నీళ్లు నదిలోకే..

దాదాపు 30 ఏళ్ల కిందట కట్టిన రెగ్యులేటర్‌ గేట్లు అన్నీ దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా అమరావతి నుంచి వస్తున్న వరదతో కొండవీడు వాగు నిండుకుండలా మారింది. మరోవైపు కృష్ణానది సైతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిండిపోయింది. గురువారం నదిలో నీటిమట్టం ఊహించని రీతిలో 15 అడుగులకు చేరింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో నది నుంచి 5.66 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న నది ప్రవాహం దెబ్బతిన్న రెగ్యులేటర్‌ గేట్ల నుంచి తిరిగి కొండవీడు వాగులోకి చేరుతోంది. ఐదు గేట్లు పూర్తిగా దెబ్బతినగా, మిగిలినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటి నుంచి ప్రతి గంటకూ సుమారు 700 క్యూసెక్కుల నీరు కొండవీడు వాగులోకి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే నీటని లిఫ్ట్‌ మూడు పంపులు ద్వారా తిరిగి కృష్ణానదిలోకి తోడుతున్నారు. ప్రతి గంటకు 1,059 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ ద్వారా నదిలోకి చేరవేస్తున్నారు. దీనిలో అమరావతి గ్రామాల నుంచి వచ్చే నీరు సుమారు 350 క్యూసెక్కులు తోడుతుంటే, కృష్ణానది నుంచి వాగులోకి వచ్చే నీరు గంటకు 700 తోడాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇదే ప్రాంతం నుంచి వాగు నీటిని బకింగ్‌హామ్‌ కాల్వలోకి రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి వదులుతున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:56 AM