కొండపల్లి కోట టీడీపీదే..
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:26 AM
మూడున్నరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. 2021, నవంబరు 24నే తేలాల్సిన చైర్మన్ ఫలితం అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడిన తొండాటకు కోర్టు వరకూ వెళ్లగా, ఇప్పటికి టీడీపీకి న్యాయం జరిగింది.
మూడున్నరేళ్ల నిరీక్షణకు ముగింపు
నాడు వైసీపీ ఆడిన దొంగాటకు తెర
చైర్మన్‌గా టీడీపీ నేత చిట్టిబాబు ప్రకటన
వైస్ చైర్మన్లుగా విజయలక్ష్మి, శ్రీనివాసరావు
ప్రమాణస్వీకారం చేయించిన ఆర్డీవో
ఇబ్రహీంపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో 2021లో జరిగిన కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ హోరాహోరీగా పోరాడింది. 29 వార్డులకు 14 టీడీపీ, 14 వైసీపీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థికి దక్కాయి. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎక్స్‌అఫిషియస్ ఓటు వైసీపీకి వేయడంతో ఆ పార్టీ బలం 15 అయ్యింది. అలాగే, నాటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్‌అఫిషియస్ ఓటుతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దీంతో చైర్మన్ పీఠం టీడీపీదేనని అంతా భావించారు.
నాడు వైసీపీ తొండాట
ఈ నేపథ్యంలో నాటి ఎంపీ కేశినేని నాని ఓటు చెల్లదని వైసీపీ కోర్టును ఆశ్రయించింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైతే జరిపారు కానీ, ఫలితాన్ని తేల్చలేదు. మూడున్నరేళ్ల తర్వాత హైకోర్టు నుంచి వచ్చిన సీల్డ్ కవర్‌లోని ప్రొసీడింగ్స్‌ను ఎన్నికల అధికారి, విజయవాడ ఆర్డీవో కె.చైతన్య సోమవారం మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ, వైసీపీ సభ్యుల సమక్షంలో చదివి వినిపించారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు 16 ఓట్లు, వైసీపీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాసరావుకు 15 ఓట్లు వచ్చినందున చిట్టిబాబు విజయం సాధించినట్లు ప్రకటించారు. అలాగే, వైసీపీ అభ్యర్థుల కంటే ఒక ఓటు ఎక్కువగా రావడంతో టీడీపీ వైస్ చైర్మన్ అభ్యర్థులు కరిమికొండ విజయలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావులు కూడా విజయం సాధించారు. ఎంపీ ఓటు చెల్లదని, చెరి సమానంగా ఓట్లు ఉన్నాయని, టాస్ వేస్తే చైర్మన్ పదవి తనకు దక్కుతుందని ఆశ పెట్టుకున్న వైసీపీకి ఈ ఫలితం రుచించలేదు. చైర్మన్, వైస్ చైర్మన్లు ఎవరనేది ప్రకటించకుండా 24 గంటలు వాయిదా వేయాలని పట్టుబట్టారు. అయితే, ఇప్పటికే అనేక అభ్యంతరాల మధ్య పదవీకాలం నాలుగేళ్లు పూర్తయిందని, అభ్యంతరాలు ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని, ప్రస్తుతం హైకోర్టు నుంచి వచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఉన్నది చదివి చైర్మన్ ఎవరనేది ప్రకటించాలని, మళ్లీ ఎన్నిక జరిపే అవకాశం లేదని, 2021లో చేతులెత్తే విధానం ద్వారా ఎంపీ టీడీపీకి వేసిన ఓటు చెల్లుతుంది లేనిది ఇప్పుడు చెప్పలేమని ఆర్డీవో పేర్కొన్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు సమావేశపు హాల్ నుంచి వెళ్లిపోయారు.
టీడీపీ సంబరాలు
మూడున్నరేళ్ల నిరీక్షణ ఫలించి కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకుని కొత్త పాలకవర్గానికి అభినందనలు తెలిపి, భారీ ఊరేగింపు నిర్వహించారు.