Share News

మనోజ్‌.. మహాముదురు

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:41 AM

ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఆర్డర్లు రావడం సాధారణం. భారీగా సరుకు సరఫరా చేయాలని ఆర్డర్లు వచ్చినప్పుడు అంత మొత్తం ఎందుకో ఆరా తీస్తారు. ఇది వ్యాపారుల లక్షణం. వన్‌టౌన్‌లోని పులిపాక వారి వీధిలో ప్లాస్టిక్‌ సీసాల మూతలను విక్రయించే వ్యాపారి మాత్రం భారీగా ఆర్డర్‌ వచ్చిందనగానే ఎలాంటి ఆరా తీయకుండానే సరుకు సరఫరా చేశాడు. ఆయనే మనోజ్‌ కుమార్‌ జైన్‌. నకిలీ మద్యం తయారీ కేసులో ఏ20 నిందితుడు.

మనోజ్‌.. మహాముదురు
అరెస్టు సమయంలో అనారోగ్యం పాలైన మనోజ్‌

నకిలీ మద్యం తయారీ కేసులో కీలకం

‘అద్దేపల్లి’తో ఆది నుంచీ అనుబంధం

1.80 లక్షల ప్లాస్టిక్‌ సీసాలకు మూతలు సరఫరా

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ వచ్చిందని బుకాయింపు

అద్దేపల్లి బ్రదర్స్‌ నుంచి భారీగా ముడుపులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నకిలీ మద్యం తయారీ కేసులో వ్యాపారి మనోజ్‌కుమార్‌ జైన్‌ను సిట్‌ అధికారులు ఏ20గా చేర్చారు. ఆయనను రెండు రోజుల క్రితం అదుపులోకితీసుకోగానే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి 41ఏ నోటీసు ఇచ్చి సరిపెట్టారు. ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో మనోజ్‌కుమార్‌ జైన్‌ నకిలీ మద్యం తయారీకి ఎలా సహకరించాడన్న వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండా చీకట్లో జరిగే కార్యకలాపాలకు సహకరించడం మనోజ్‌కుమార్‌కు అలవాటని పోలీసులు గుర్తించారు.

ఆన్‌లైన్‌ ముసుగులో..

అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావులు నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి మనోజ్‌కుమార్‌ జైన్‌తో సంబంధాలు నడిపినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మనోజ్‌కుమార్‌ పులిపాక వారి వీధిలో ఉన్న కొఠారి కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్‌ మూతల వ్యాపారం చేస్తున్నాడు. జనార్దనరావు తయారు చేయించిన నకిలీ మద్యం పోసిన సీసాలపై అమర్చే మూతలను కొన్నేళ్లుగా మనోజ్‌కుమార్‌ సరఫరా చేస్తున్నాడు. అద్దేపల్లి అన్నదమ్ములు 2021 కొవిడ్‌ సమయంలో నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తొలుత హైదరాబాద్‌లోని నిజాంపేట నుంచి ఇక్కడికి ప్లాస్టిక్‌ టిన్నుల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను తీసుకొచ్చి వివిధ పరిమాణాల్లో ఉన్న ప్లాస్టిక్‌ సీసాల్లో నింపేవారు. అందులో కొన్ని రసాయనాలు కలిపేవారు. ఇలా మద్యం పోసిన సీసాలపై బిగించడానికి అవసరమైన మూతలను మనోజ్‌కుమార్‌ జైన్‌ సరఫరా చేశాడు. సీసాలను మాత్రం గన్నవరం మండలంలోని పారిశ్రామికవాడలో ఉన్న ఓ ప్లాసిక్ట్‌ తయారీ పరిశ్రమ నుంచి కొన్నట్టు తెలిసింది. ఆ పరిశ్రమ యజమాని డి.శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ సీసాలపై బిగించే మూతల సరఫరాలో మనోజ్‌కుమార్‌ జైన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్‌ పోలీసులు అతడిని ప్రశ్నించినప్పుడు తెలివిగా సమాధానం చెప్పాడని తెలిసింది. తనకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ వస్తే భారీ మొత్తంలో సరఫరా చేశానని చెప్పినట్టు సమాచారం. ఒక దఫాకు 80 వేల నుంచి లక్ష మూతలను సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

మూతలపై ముద్రణ

జనార్దనరావు సోదరులు సీసాలను ఒకచోట నుంచి కొంటే, వాటిపై బిగించి మూతలను మనోజ్‌కుమార్‌ జైన్‌ నుంచి కొన్నారు. మూతలను సరఫరా చేయడమే కాకుండా వాటిపై నకిలీ మద్యం బ్రాండ్ల పేర్లను ముద్రించినట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఇలా చేసినందుకు అద్దేపల్లి అన్నదమ్ముల నుంచి మనోజ్‌ భారీగానే ముడుపులు అందుకున్నాడు. అద్దేపల్లి సోదరులతో 2021వ సంవత్సరం నుంచి మనోజ్‌ తన బంధాన్ని కొనసాగిస్తున్నాడు. అద్దేపల్లి సోదరులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి. తెలంగాణాతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా రసాయనాలు తయారుచేస్తున్న ముఠాకు మనోజ్‌కుమార్‌ ఈవిధంగానే సహకరించాడు. భారీగా మూతలు సరఫరా చేయడంతో పాటు వాటిపై ముద్రణను విజయవాడలో చేయించాడు. ఈ కేసుల్లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అద్దేపల్లి అన్నదమ్ములతో ఉన్న ముద్రణ అనుబంధం బయటపడింది.

Updated Date - Nov 05 , 2025 | 12:41 AM