Share News

ఇంద్ర వైభవం

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:44 AM

ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా కనకదుర్గానగర్‌ రెండోదశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు అవసరమైన భూసేకరణ జరపటానికి ఆమోదముద్ర వేసింది. ఈ ప్రక్రియ సంప్రదింపుల మార్గంలో నడవాలని నిర్దేశించింది. భూములు తీసుకోవాల్సిన వారితో ముందుగా మాట్లాడి, పరిహారానికి సంబంధించి వారు ఎంత కోరుకుంటున్నారో తెలుసుకోవాలని దుర్గగుడి యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. బాధితులతో మాట్లాడాక సమగ్ర నివేదిక పంపాలని దేవస్థాన అధికారులకు నిర్దేశించింది.

ఇంద్ర వైభవం
కనకదుర్గానగర్‌లో విస్తరించాల్సిన ప్రాంతం

కనకదుర్గానగర్‌ రెండోదశ విస్తరణకు శ్రీకారం

గోశాల నుంచి మల్లేశ్వరాలయం దాటే వరకు..

దుర్గగుడి అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

సంప్రదింపులతో భూమి సేకరించాలని ఆదేశాలు

పరిహారంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచన

రెండు స్కూళ్లు, నాలుగు ఇళ్లు తొలగించే అవకాశం

మూడోదశ విస్తరణకూ ఒప్పుకొంటే కాటేజీలు నిర్మించే చాన్స్‌

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : ఇంద్రకీలాద్రి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తొలిదశ విస్తరణలో అర్జునవీధికి అభిముఖంగా మొత్తం 187 ఇళ్లను తొలగించారు. ఆ తర్వాత దేవస్థాన అధికారులు ప్రహరీ నిర్మించారు. ఈ భూసేకరణ వల్ల మహామండపం వద్ద ప్రాంతం విశాలంగా మారింది. అలాగే, అన్నదానసత్రం, లడ్డూపోటు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం మళ్లీ ఇరుగ్గా మారింది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. దీంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండోదశ విస్తరణకు శ్రీకారం చుట్టారు.

రెండో దశలో..

ప్రస్తుత మహామండపం నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దిగువన ఉన్న ప్రాంతం మొత్తాన్ని రెండో దశలో భాగంగా భూసేకరణ జరపాలని దేవస్థాన అధికారులు నిర్ణయించారు. దేవదాయ శాఖ ద్వారా ప్రాథమిక ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రెండో దశలో కేవలం నాలుగు ఇళ్లే భూ సేకరణలో ఉన్నాయి. గోసాల వద్ద రాజస్థాన్‌ స్కూల్‌తో పాటు అడపా రాములు మునిసిపల్‌ స్కూల్‌ ఉంది. ఇవి రెండూ అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ రెంటినీ తొలగించాల్సి ఉంటుంది. అడపా రాములు మునిసిపల్‌ స్కూల్‌లో పిల్లలు లేకపోవటంతో మూసివేసే పరిస్థితి ఉంది. దీంతో ఈ స్కూల్‌ తొలగింపు విషయంలో ఇబ్బంది తలెత్తదు. కార్పొరేషన్‌ అధికారులతో చర్చిస్తే సరిపోతుంది. కాగా, రాజస్థాన్‌ స్కూల్‌ నిర్వాహకులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. వీరికి ప్రత్యామ్నాయంగా మరోచోట స్కూల్‌ నిర్వహించుకోవటానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలి. నాలుగు ఇళ్లే కాబట్టి రెవెన్యూ శాఖ ద్వారా సంప్రదింపులు జరపటం కష్టమైన పనికాదు. ఈ రెండు స్కూళ్ల భూములను తీసుకోగలిగితే, కనకదుర్గానగర్‌ను విస్తరించే అవకాశం తేలికే.

మూడో దశలో..

మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఇంద్రకీలాద్రి సమగ్రాభివృద్ధికి మూడో దశ భూములు కూడా అవసరం. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన ఇంద్రకీలాద్రికి అశేషసంఖ్యలో భక్తులు వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుపతి తరహాలో ఇక్కడ కాటేజీలు అందుబాటులో లేవు. కనకదుర్గానగర్‌ దిగువన తగిన స్థలం ఉంటే ఇక్కడ మల్టీప్లెక్స్‌లతో కూడిన కాటేజీలను ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల విజయవాడ వచ్చినవారు రెండు, మూడు రోజులు ఇక్కడే గడిపే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే మూడోదశ విస్తరణకు కూడా ఇదే మంచి తరుణం.

Updated Date - Jun 29 , 2025 | 12:44 AM