సిబ్బంది లేక ఇబ్బంది
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:57 AM
ఉమ్మడి కృష్ణాజిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రూటే సెపరేటుగా ఉంది. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా హాస్టల్ వర్కర్లను అధికారుల ఇళ్లలో ఊడిగం చేయిస్తూ వివాదాస్పదమయ్యారు.
ఉమ్మడి కృష్ణా బీసీ సంక్షేమ శాఖాధికారి నిర్వాకం
హాస్టల్ వర్కర్లు అధికారుల ఇళ్లలో పనులకు కేటాయింపు
సిబ్బంది లేక ఇంకా తెరుచుకోలేని హాస్టళ్లు ఎన్నో..
కొన్ని మూతపడే పరిస్థితికి వచ్చినా మారని తీరు
ఇళ్లకు వెళ్లిపోతున్న చాలామంది విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగుల సాధారణ బదిలీల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అడ్డగోలుగా చేపట్టిన బదిలీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఆయన వెనక్కి తగ్గలేదు. తాజాగా హాస్టళ్లలో పనిచేయాల్సిన అవుట్‌సోర్సింగ్ వర్కర్ల విషయంలో ఈ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి హాస్టల్‌కు ముగ్గురు వర్కర్లు ఉండాలి. కానీ, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లోని ఏ ఒక్క హాస్టల్‌లో కూడా ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి కృష్ణాలో అంతర్భాగంగా ఉన్న ఒకప్పటి నూజివీడు సహా అన్ని డివిజన్లలోనూ ఇలాగే ఉంది. ప్రొటోకాల్ పేరుతో హాస్టల్ వర్కర్లను ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేయించడమే ఇందుకు కారణం. చాలామంది హాస్టల్ వర్కర్లు అధికారుల ఇళ్లలో వంట మనుషులుగా, కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా అధికారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
హాస్టళ్లలో ముగ్గురు వర్కర్లు ఉండాల్సిందే..
నిబంధనల ప్రకారం ప్రతి వసతి గృహానికి ముగ్గురు వర్కర్లు ఉండాలి. ఒకరు వంట చేయటానికి, మరొకరు విద్యార్థులను పర్యవేక్షించటానికి, మూడోవారు హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచడం, వంటకు అవసరమైన కూరగాయలు కట్ చేయటానికి. కానీ, పిల్లలున్న హాస్టళ్లలో ఒకరు లేదా ఇద్దరు వర్కర్లే ఉంటున్నారు. వంట బాగా వచ్చిన వారిని అఽధికారుల ఇళ్లలో వంట పనులు చేసేందుకు పంపుతున్నారు. పనిచేయలేనివారు, దివ్యాంగులుగా ఉన్నవారు హాస్టళ్లలో ఉంటున్నారు.
విద్యార్థుల పాట్లు
అధికారుల నిర్లక్ష్యం కారణంగా వసతి గృహాల్లోని విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. నిర్వహణలో కీలకమైన సిబ్బంది లేకపోవడంతో అసలు హాస్టళ్లే ప్రారంభించవద్దని ఉన్నతాధికారులే మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాసంస్థలు తెరుచుకుని వారం అవుతున్నా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ వసతి గృహాలు ప్రారంభం కాలేదు. తెరుచుకున్నవి కూడా వర్కర్ల సమస్య కారణంగా క్లాసులకు సన్నద్ధం కాలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి తాము బాధ్యులం కాదంటూ అధికారులు, ఉన్నతాధికారులు ఏకంగా హాస్టళ్లను మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చారు. దీంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెనమలూరు, అవనిగడ్డ, బందరు, గుడివాడ, నూజివీడు, విజయవాడ, గన్నవరం, నందిగామ డివిజన్ల పరిధిలోని పలు హాస్టళ్లు సిబ్బంది కొరత కారణంగానే ఇప్పటికీ తెరుచుకోలేదు.