జోగి రాసుకుంటే బూడిద రాలుతుందా?
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:21 AM
ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంపై మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నానా యాగీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా, వైసీపీలో మంత్రిగా ఉండగా ఆయన ఏనాడూ స్థానిక ట్రాన్స్‌పోర్టర్ల సమస్యపై స్పందించింది లేదు. బూడిద కాలుష్యంపై మాట్లాడిందీ లేదు. ఇప్పుడేమో తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బూడిద కాలుష్యంపై జోగి రమేశ్ హడావిడి.. విమర్శలు
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నలు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంపై మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నానా యాగీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా, వైసీపీలో మంత్రిగా ఉండగా ఆయన ఏనాడూ స్థానిక ట్రాన్స్‌పోర్టర్ల సమస్యపై స్పందించింది లేదు. బూడిద కాలుష్యంపై మాట్లాడిందీ లేదు. ఇప్పుడేమో తనకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్థానిక ట్రాన్స్‌పోర్టర్లపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటున్నారు.
నాడు ఏమయ్యావ్ జోగీ.. : కూటమి నేతల ప్రశ్న
ఎన్టీటీపీఎస్ బూడిద సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ సోమవారం ఆయన రోడ్డెక్కి నానా హడావిడి చేశారు. పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూడిద కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్నామని, వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టాలని జెన్‌కో, ఎన్టీటీపీఎస్ యాజమాన్యాన్ని కోరతానన్నారు. స్థానిక ట్రాన్స్‌పోర్టర్లకు బూడిదను పంచేందుకు తాను సిద్ధమని, అఖిలపక్ష పార్టీలు తనతో కలిసి రావాలని కోరారు. స్థానికంగా నిల్వ ఉన్న బూడిదను బుధవారం పంచేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. అయితే, ఆయన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ ఏమైపోయావ్.. జోగీ..’ అని ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం కపట ప్రేమ ఒలకబోస్తున్నారని డాక్టర్ ఎన్టీటీపీఎస్ టిప్పర్స్, లారీ ఓనర్స్ సొసైటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండగా, బూడిదను, ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్న మాజీమంత్రి జోగి రమేశ్‌ను ఎవరూ నమ్మరని, ఆయన పిలుపును ఎవరూ స్వీకరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.