కనకమహాలక్ష్మి బ్యాంకులో నగలు తారుమారు
ABN , Publish Date - May 04 , 2025 | 12:52 AM
మచిలీపట్నంలోని కనకమహాలక్ష్మి బ్యాంకులో బంగారు నగల స్థానంలో రోల్డుగోల్డు నగలు పెట్టిన అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారు నగలు కుదువ పెట్టి రుణం తీసుకున్న తరువాత అప్రైజర్ బ్రహ్మం బ్యాంకులోని బంగారు నగలను మాయంచేసి, వాటి స్థానే రోల్డుగోల్డు నగలు ఉంచిన వైనం రెండు రోజుల కిందట ఆడిట్ సమయంలో బయటపడింది.
ఖాతాదారుల నగల స్థానంలో రోల్డుగోల్డు నగలు
చేతివాటాన్ని ప్రదర్శించిన అప్రైజర్ బ్రహ్మం
ఆడిటింగ్‌లో బయటపడిన నిజాలు
చర్యలకు ఉపేక్షించిన మేనేజర్
బాధితుల నిలదీతతో పోలీసులకు ఫిర్యాదు
మచిలీపట్నం టౌన్, మే 3 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నంలోని కనకమహాలక్ష్మి బ్యాంకులో బంగారు నగల స్థానంలో రోల్డుగోల్డు నగలు పెట్టిన అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారు నగలు కుదువ పెట్టి రుణం తీసుకున్న తరువాత అప్రైజర్ బ్రహ్మం బ్యాంకులోని బంగారు నగలను మాయంచేసి, వాటి స్థానే రోల్డుగోల్డు నగలు ఉంచిన వైనం రెండు రోజుల కిందట ఆడిట్ సమయంలో బయటపడింది. ఈ బ్యాంకులో ఎనిమిది మంది ఖాతాదారులు బంగారం కుదువ పెట్టి మొత్తం 15 రుణాల ద్వారా రూ.12 లక్షలు తీసుకున్నారు. పైగా గుడిసేవ సునీత అనే మహిళ కుదువ పెట్టిన బంగారం నిజమైనది కాదని, నకిలీదని, బ్యాంకుకు వెంటనే బాకీని చెల్లించాలని ఆమె ఇంటికి వెళ్లి చెప్పారు. దీంతో బాధితురాలు బ్యాంకుకు వెళ్లి రోల్డుగోల్డు నగలు ఉండటమేమిటని మేనేజర్‌ను నిలదీసింది. తాను కుదువ పెట్టిన నాలుగు గాజులు స్వచ్ఛమైన బంగారమని గుర్తించే రుణమిచ్చారని తెలిపింది. అలాగే, నగలు విడిపించుకునేందుకు వెళ్లిన పలువురు మహిళలు తమ బంగారం కాదంటూ బ్యాంకు మేనేజర్ సమ్మెట నాగేశ్వరరావును నిలదీశారు. కాగా, ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా అప్రైజర్‌పై చర్యలు తీసుకునేందుకు మేనేజర్ వెనుకాడుతున్నారు. ఈ విషయం మీడియా దృష్టికి రావడంతో ఆయన కంగుతిన్నారు. రెండు రోజుల కిందటే ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, బాధితురాలు నిలదీయడంతో మేనేజర్ నాగేశ్వరరావు శనివారం ఇనగుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా అప్రైజర్ బ్రహ్మం బంగారు నగల స్థానంలో రోల్డుగోల్డు నగలు ఉంచినట్టు పోలీసులకు తెలిపారు. రుణాలు తీసుకున్న వారిలో కొందరివి మాత్రమే ఇలా తారుమారయ్యాయని చెప్పారు. ఇనకుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.