కుంకుమార్చన ప్రత్యక్షమా? పరోక్షమా?
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:48 AM
దసరా ఉత్సవాల్లో కుంకుమార్చనలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలా? లేదా పరోక్ష విధానంలోనా? అనే అంశంపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్ కసరత్తు చేస్తున్నారు.
ఈ దసరా ఉత్సవాల్లో నిర్వహణపై మల్లగుల్లాలు
కుంకుమార్చనలు రద్దు చేయాలని పోలీసుల ప్రతిపాదన
రద్దు వద్దు.. కొనసాగించాలని సూచించిన ప్రభుత్వం
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే యోచన
12న జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాల్లో కుంకుమార్చనలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలా? లేదా పరోక్ష విధానంలోనా? అనే అంశంపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్ కసరత్తు చేస్తున్నారు. కుంకుమార్చనలను రద్దు చేయాలని పోలీసు అధికారుల నుంచి ప్రతిపాదనలు వస్తుండగా, దుర్గగుడి అర్చకులు మాత్రం ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో కుంకుమార్చనలు నిలుపుదల చేయటం ఎందుకని, కొనసాగించమని సూచించినట్టు తెలుస్తోంది.
ఈనెల 12న ఖరారు చేసే అవకాశం
దసరా ఉత్సవాల్లో కుంకుమార్చనలు నిర్వహించటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్ల వేలసంఖ్యలో వస్తున్న సామాన్య భక్తులు అవస్థలు పడుతున్నారు. అయితే, కుంకుమార్చన లను ప్రభుత్వం కొనసాగించమన్న నేపథ్యంలో పరోక్ష విధానంలో అయినా నిర్వహించాలని దేవదాయ శాఖ కమిషనర్, ఈవో భావిస్తున్నారు. టికెట్ తీసుకున్న వారికి పూజల లైవ్ లింక్ పంపుతారు. ఇందులోనే పూజా కార్యక్రమాన్ని వీక్షించాల్సి ఉంటుంది. పూజ పూర్తయ్యాక అమ్మవారి కుంకుమ, రాగి డాలర్, శేషవస్త్రం, చీర, ప్రసాదాలు వంటివి నేరుగా టికెట్ కొన్నవారి ఇంటికే పంపుతారు. పరోక్ష విధానాన్ని అమలు చేయాలని దాదాపు నిర్ణయించినా ఇంకా ఖరారు చేయలేదు. ఈనెల 12న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది.
అంతరాలయ దర్శనమే సమస్య
దసరా ఉత్సవాల్లో రెండు షిఫ్టుల విధానంలో కుంకుమార్చన నిర్వహిస్తారు. ఒక్కో షిఫ్టులో 125 మంది పాల్గొంటారు. రోజుకు 250 మంది ఉభయదాతలు ఈ పూజలో కూర్చుంటారు. వీరిలో 50 మంది మినహా మిగిలిన 200 మంది బయటి వారికే అవకాశం కల్పిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ కుంకుమార్చనలు చేసేవారి వెంట వారి కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసినవారు వస్తున్నారు. వీరికి దర్శనం చేయించాల్సి ఉంటుంది. ఈ దర్శనాల సందర్భంలో ఉభయదాతలు, టికెట్ బుక్ చేసుకున్న ఇతరులు కూడా తమ వెంట వచ్చినవారిని దర్శనం కోసం తీసుకెళ్తున్నారు. వీరందరికీ అనధికారికంగా అంతరాలయ దర్శనం కల్పిస్తున్నారు. దీంతో అంతరాలయం రద్దీగా మారుతోంది. వీఐపీ క్యూ అంతా కిక్కిరిసిపోతోంది. రూ.500 లైన్‌లో వెళ్లేవారంతా ముఖద్వారం వరకూ వస్తారు. అప్పటికే ఆ ప్రాంతమంతా కిటకిటలాడిపోతుండటంతో రూ.500 టికెట్ క్యూలైన్ ముందుకు కదలట్లేదు. దీంతో ఏటా దసరా ఉత్సవాల్లో సమస్యలు తప్పట్లేదు.