Share News

తప్పు ఎవరిది?

ABN , Publish Date - Dec 28 , 2025 | 01:08 AM

ఇంద్రకీలాద్రిపై విద్యుత సరఫరా నిలిపివేత విషయంలో తప్పు ఎవరిది? దేవస్థానానికి చెందిన పాతపాడు సోలార్‌ ప్లాంట్‌ విషయంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, విద్యుత శాఖకు మధ్య జరిగిన వివాదమే బిల్లుల పెండింగ్‌కు కారణమా? రాష్ట్రంలోనే రెండో దేవాలయంగా ఖ్యాతి గడించిన ఆలయంపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న ఆ విద్యుత అధికారి ఎవరు? అనే ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి.

తప్పు ఎవరిది?

దుర్గగుడి అధికారులదా? విద్యుత శాఖదా?

ఇంద్రకీలాద్రిపై విద్యుత సరఫరా నిలిపివేతపై విమర్శలు

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహారాలు

పాతపాడు సోలార్‌ ప్లాంట్‌ నుంచి మొదలైన వివాదం

మిగులు విద్యుత లెక్కలు తేల్చాలంటున్న దేవస్థానం

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్న విద్యుత శాఖ

వివాదాస్పదంగా ఓ విద్యుత అధికారి వ్యవహారం

ఆయన ఆధ్వర్యంలోనే విద్యుత సరఫరా నిలిపివేత

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత సరఫరా నిలిపివేతపై అటు భక్తులు, ఇటు ఉద్యోగులు, ప్రభుత్వ పెద్దలు, న్యాయాధిపతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైనా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై ప్రముఖులు సైతం మండిపడుతున్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆలయమైన దుర్గగుడిలో విద్యుత బకాయిలు చెల్లించలేనంత ఆర్థిక ఇబ్బందులు లేవు. ఇందులో దేవస్థానం తప్పిదం ఎంతవరకు ఉందనే అంశం చర్చకు దారితీసింది.

అసలు కథ ఇదీ..

2016లో పాతపాడులో 1 మెగావాట్‌ సోలార్‌ ప్లాంట్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. 2021 నుంచి ఇది వినియోగంలోకి వచ్చింది. ఈ సోలార్‌ ప్లాంట్‌కు నెట్‌ మీటరింగ్‌ ఏర్పాటు చేయటంలో విద్యుత శాఖ ఆధ్వర్యంలో అంతులేని తాత్సారం నడుస్తోంది. ఈ ప్లాంట్‌ ద్వారా 1.20 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. దేవస్థానం మాత్రం లక్ష యూనిట్లనే వినియోగిస్తోంది. మిగులు విద్యుత లెక్కలు తేల్చాలని చాలాకాలంగా దేవస్థానం అధికారులు విద్యుత శాఖను కోరుతున్నారు. లెక ్కలు తేల్చటం లేదన్న కారణంతోనే దే వస్థాన అధికారులు బిల్లులు చెల్లించలేదు. నాలుగేళ్లుగా అడుగుతూ ఉన్నా సమాచారం రాకపోవటం, నెట్‌ మీటర్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ సమస్య ఎదురైంది.

పుణ్యక్షేత్రమని మరిచారా?

విద్యుత శాఖ అధికారులు దుర్గగుడి విషయంలో ఆధ్యాత్మిక స్పృహ లేకుండా వ్యవహరించారని తెలుస్తోంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం విషయంలో హుందాగా వ్యవహరించాల్సిన విద్యుతశాఖ ఆ విధంగా నడుచుకోలేదు.

కాళేశ్వరరావు మార్కెట్‌ డీఈఈ చుట్టూ వివాదం

ఈ మొత్తం వివాదానికి కాళేశ్వరరావు మార్కెట్‌ ఎలక్ర్టికల్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) కారణమని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రిపై విద్యుత నిలిపివేయమని చెప్పింది ఈయనే. ఆయన ఉన్నతాధికారుల అనుమతితో నిర్ణయం తీసుకున్నాడా? లేక స్వతంత్రంగా వ్యవహరించాడా? అనేది తేలాల్సి ఉంది. ఈ డీఈఈపై దసరా ఉత్సవాల్లోనూ వివాదం నడిచింది. రాజీవ్‌గాంధీ పార్క్‌ సబ్‌స్టేషన్‌ వద్ద, పూలమార్కెట్‌ దగ్గర ఉన్న స్థలాన్ని భక్తుల హోల్డింగ్‌ పాయింట్‌గా చేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ నిర్ణయించారు. అప్పుడు డీఈఈ స్పందించలేదు. దీంతో కలెక్టర్‌.. డీఈఈని అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేయటంతో చివరికి దారికొచ్చి హోల్డింగ్‌ పాయింట్‌ ఏర్పాటుకు సహకరించినట్టు తెలుస్తోంది.

ప్రముఖుల ఆరా

దుర్గగుడిలో విద్యుత సరఫరా నిలిపివేయటంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు స్పందించారు. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు దేవస్థానం అధికారులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన పరిణామాలను దేవస్థాన అధికారులు వారికి వివరించారు. రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. గవర్నర్‌ పేషీ నుంచి దేవదాయ శాఖ అధికారులకు ఫోన్‌ వచ్చింది. దేవస్థానం పరువు తీయటంతో పాటు వేలాది మంది భక్తులకు అసౌకర్యం కల్పించడంపై పబ్లిక్‌ లిటిగేషన్‌ పిల్స్‌ వేయిస్తామని పలువురు ఆలయ ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

70 వేల మంది భక్తులు ఉన్న వేళ

ఇంద్రకీలాద్రికి శనివారం మొత్తం 70 వేల మంది భక్తులు వచ్చారు. దేవస్థానం అధికారుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 10.30 మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత సరఫరాను నిలిపివేశారు. ఆ సమయంలో వేలమంది భక్తులు ఆలయ ఆవరణలోనే ఉన్నారు. హఠాత్తుగా విద్యుత నిలిపివేయటంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. మహామండపం లిఫ్ట్‌ మార్గంలో రాకపోకలు సాగించేవారు అవస్థలకు గురయ్యారు.

Updated Date - Dec 28 , 2025 | 01:08 AM