సాహో.. పారిశ్రామిక
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:58 AM
జిల్లాలో పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటు, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో బిజినెస్ మీట్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లాస్థాయిలో కూడా ఆ తరహాలో మీట్ జరగాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
ఎన్నారైలు సహా స్థానిక పారిశ్రామికవేత్తలకు..
జనవరిలో బిజినెస్ మీట్ ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలోని వనరులు, అవకాశాలపై అవగాహన
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యూనిట్ల ఏర్పాటు
పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దేందుకు చర్యలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటు, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో బిజినెస్ మీట్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లాస్థాయిలో కూడా ఆ తరహాలో మీట్ జరగాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కొత్త సంవత్సరంలో ఈ మీట్ జరిగే అవకాశం ఉంది.
ఎన్‌ఆర్‌ఐలతో సంప్రదింపులు
ఉమ్మడి కృష్ణాజిల్లా అంటేనే ఎన్‌ఆర్‌ఐలకు పెట్టింది పేరు. ఇక్కడివారు చాలామంది పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని సంప్రదించి మాతృభూమిలో కూడా పదిమందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగం అభ్యర్థించనుంది. తానా, ఆటా, నాట్స్ వంటి ప్రవాస భారతీయుల సంఘాల పెద్దలతో సంప్రదింపులు జరిపి బిజినెస్ మీట్‌కు ఆహ్వానించాలని చూస్తోంది. ఉభయ తెలుగు రాషా్ట్రల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటుచేసేలా ఒప్పించాలని యోచిస్తోంది.
పరిశ్రమలకు అనువైన ప్రాంతం
పశ్చిమ ఎన్టీఆర్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ సిమెంట్, స్టీల్, ఫార్మా కంపెనీలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. సున్నపురాయి నిక్షేపాలతో పాటు అనేక మినరల్స్ అందుబాటులో ఉన్నాయి. మినరల్స్ ఆధారిత పరిశ్రమలకు జిల్లాలో ఎంతో అవకాశం ఉంది. అలాగే, పర్యాటకంగా అభివృద్ధి చెందే మంచి ప్రాంతాలున్నాయి. విజయవాడ నగరం సర్వీసు రంగానికి పేరొందింది. తయారీ, సేవల రంగాల్లో ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు.జిల్లాలో భౌగోళికంగా ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చో తగిన సమాచారం ఇవ్వటానికి వీలుగా ప్రజెంటేషన్స్ తయారు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, స్థానికంగా ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించటానికి వీలుగా కూడా బిజినెస్ మీట్‌లో ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. వీటిపై స్థానిక ఔత్సాహికులకు మార్గదర్శకాలు సూచించనున్నారు.