Share News

న్యాయదేవతకు నిఘా కళ్లు

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:48 AM

న్యాయస్థానంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడితో ఆగకుండా ఇద్దరు కోర్టు హాల్‌ నుంచి బయటకొచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. దీనిపై ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఓ వ్యక్తి వాయిదా నిమిత్తం కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలో వాహనాలను నిలిపే ప్రదేశంలో బైక్‌ పెట్టుకున్నాడు. వాయిదా పూర్తయ్యాక వచ్చి చూసుకునే సరికి అక్కడ వాహనం కనిపించలేదు. ఇది నెలరోజుల క్రితం జరిగిన ఘటన. కొన్ని నెలలుగా నగరంలోని న్యాయస్థానాల సముదా యంలో జరుగుతున్న పరిణామాలివి. ఇలా వస్తున్న కేసులతో పోలీసులకు తలబొప్పి కడుతోంది. దీంతో న్యాయస్థానాల ప్రాంగణం చుట్టూ నిఘానేత్రాలను ఏర్పాటు చేశారు.

న్యాయదేవతకు నిఘా కళ్లు

న్యాయస్థానాల సముదాయంలో సీసీ కెమెరాల ఏర్పాటు

కొత్త భవనం చుట్టూ 20 కెమెరాలు అమర్చిన పోలీసులు

దొంగతనాలు, కొట్లాటలకు చెక్‌ పెట్టేందుకే..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా పోలీసులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిత్యం న్యాయవాదులు, కక్షిదారులతో రద్దీగా ఉండే న్యాయస్థానాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎనిమిది అంతస్థులతో నిర్మించిన న్యాయస్థానాల సముదాయం చుట్టూ 20 సీసీ కెమెరాలు అమర్చారు. సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన సిబ్బంది ఈ కెమెరాల బాధ్యతలను చూస్తున్నారు. ఇదికాకుండా న్యాయస్థానంలోకి ప్రవేశించడానికి వీలుగా ఉన్న మూడు మార్గాల్లో మరో ఐదు సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. కొత్త భవనం చుట్టూ మాత్రమే కాకుండా భవనంలోకి ప్రవేశించి లిఫ్టులు ఎక్కే మార్గంలోనూ నిఘానేత్రాలు అమరుస్తున్నారు.

చీమ చిటుక్కుమన్నా తెలిసేలా..

న్యాయస్థానాల సముదాయంలో ఏర్పాటుచేస్తున్న సీసీ కెమెరాలు నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి. వ్యక్తుల రాకపోకలను తెలుసుకునేలా, వారి సంభాషణలు సైతం వినే సాంకేతికత ఉన్న కెమెరాలను అమరుస్తున్నారు. దీనిలో ఆడియో, వీడియో స్పష్టంగా తెలుస్తుంది. ఈ కెమెరాలను ఎంజీ రోడ్డులోని ఆపరేషనల్‌కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీంతోపాటు కోర్టు ప్రాంగణంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పోలీస్‌ కమిషనర్‌, సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్‌ వీక్షించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి కెమెరాలో సిమ్‌కార్డును అమరుస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఫుటేజీని ఆ సిమ్‌కార్డు ద్వారా పోలీసులు తీసుకోవచ్చు.

వివాదాలకు చెక్‌ పెట్టేలా..

ఇప్పటివరకు కోర్టుకు వచ్చిన నలుగురు కక్షిదారుల వాహనాలు దొంగతనానికి గురయ్యాయి. న్యాయవాదుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి ఎనిమిది ఫిర్యాదులు సూర్యారావుపేట పోలీసులకు అందాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు ఏసీబీ కోర్టు విచారణలో ఉంది. ఈ కేసులో ఇంకా సిట్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని అరెస్టులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. మరోవైపు వైసీపీకి చెందిన నాయకులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఐఏఎస్‌ ధనంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి వంటి వారంతా జిల్లా జైల్లో ఉన్నారు. రిమాండ్‌ పొడిగింపు ఉన్న ప్రతిసారీ వారిని జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తున్నారు. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులే కాకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కోర్టు వద్దకు వస్తున్నారు. వ్యాన్‌ దిగిన దగ్గర నుంచి ఎస్కార్ట్‌ సిబ్బందిని తోసుకుంటూ వారిని కలవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - Jun 20 , 2025 | 12:48 AM