జన వరద
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:48 AM
అటు కృష్ణానదీ ప్రవాహం.. ఇటు భక్తజన కోలాహలం.. రెండూ ఒకదానికి మించి ఒకటి పోటీపడ్డాయా.. అన్నట్టు సోమవారం ఇంద్రకీలాద్రికి భక్తజనసంద్రం క్యూకట్టింది. జనం.. జనం.. ఎటుచూసినా ఒకటే జనం.. మూలానక్షత్రం, సరస్వతీదేవి అలంకారంలో కొలువైన అమ్మను దర్శించుకునేందుకు పోటీపడింది. ఆదివారం రాత్రి నుంచే తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు సోమవారం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగారు. వినాయకుడి ఆలయం వద్ద క్యూలైన్లు దాటి అధికారులు ఏర్పాటుచేసిన దాదాపు 60 కంపార్టుమెంట్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల వెసులుబాటు దృష్ట్యా వీఐపీ దర్శనాలను రద్దు చేసిన అధికారులు.. సామాన్యులకు త్వరగా దర్శనమయ్యేలా చూశారు. ఒకదశలో దర్శనానికి 7 గంటల సమయం పట్టింది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువసా్త్రలు సమర్పించగా, ప్రముఖుల రాకపోకలు, కంకుమార్చనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నగరోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు మరింత శోభాయమానంగా వెలిగాయి.
భక్తజనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
మూలానక్షత్రం రోజు భారీగా భక్తుల రాక
ఆదివారం రాత్రి నుంచి మొదలైన రద్దీ
క్యూలైన్లు దాటి కంపార్టుమెంట్ల వరకు..
దాదాపు 60 కంపార్టుమెంట్లు కిటకిట
దర్శనానికి దాదాపు 7 గంటల సమయం
దుర్గమ్మకు పట్టువసా్త్రలు సమర్పించిన సీఎం
అర్ధరాత్రి 12.30 వరకు 2 లక్షల మంది దర్శనం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రి భక్తులతో నిండిపోయింది. స్నానఘాట్లు భవానీలతో ఎరుపెక్కాయి. ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో ఎటుచూసినా భక్తులే కనిపించారు. మూలానక్షత్రం, సరస్వతీదేవి అలంకారం కావడంతో ఆదివారం రాత్రి నుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి దర్శనానికి అనుమతించారు. తొలిదర్శనం ఈవో శీనానాయక్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన చేసుకున్నారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రూ.100, రూ.300 క్యూలను ఉచితంగా మార్చారు. వినాయకుడి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి వరకు క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులను హోల్డింగ్ పాయింట్లలో ఏర్పాటుచేసిన కంపార్టుమెంట్లలో కూర్చోబెట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా 30, వెనుక మరో 30 హోల్డింగ్ కంపార్టుమెంట్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లు ఖాళీ అయ్యాక ఒక్కో కంపార్టుమెంట్‌లోని భక్తులను వినాయకుడి గుడి వద్ద ఉన్న క్యూల్లోకి పంపారు. ఉదయం 8 గంటలకు 65,964 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. 9.30 గంటలకు 72,928 మంది, మధ్యాహ్నం ఒంటిగంటకు 1,02,685 మంది, రాత్రి 8 గంటలకు 1,44,185 మంది దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టువసా్త్రలు సమర్పించారు. సతీసమేతంగా విచ్చేసిన సీఎంకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చన చేసిన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆయన వెంట మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ లక్ష్మీశ, పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తదితరులు ఉన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా
మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రావడం సాధారణం. ఏయే ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు దర్శనానికి వస్తున్నారన్న వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. విజయవాడ రైల్వేస్టేషన, బస్టాండ్, సీతమ్మవారి పాదాలు, పోలీస్ కంట్రోల్ రూమ్, కుమ్మరిపాలెం జంక్షన్, తదితర 17 ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరవేశారు. అర్ధరాత్రి నుంచి రాత్రి వరకూ డ్రోన్లతో పర్యవేక్షించారు. రైళ్ల రాకపోకలను, టోల్‌గేట్లను మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లపై డ్రోన్లను ఉపయోగించి ప్రత్యక్ష ప్రసారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న వీడియో వాల్స్‌పై వీక్షించి భక్తుల రద్దీని అంచనా వేశారు. దాన్నిబట్టి హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉన్న అధికారులకు సమాచారాన్ని చేరవేశారు.
న్యాయశాఖ అధికారులతో ఇబ్బందులు
మూలానక్షత్రం రోజున సాధారణ భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని అధికారులు ముందే చెప్పారు. వీవీఐపీ కేటగిరీలో వచ్చే వారికి ప్రొటోకాల్ ఇవ్వలేమని ప్రకటించారు. అంతరాలయ దర్శనాలను రద్దు చేశామని సమాచారం ఇచ్చారు. దీన్ని కొంతమంది వీవీఐపీలు పరిగణనలోకి తీసుకుని దర్శనాలను వాయిదా వేసుకున్నారు. న్యాయశాఖకు చెందిన కొంతమంది అధికారులు మాత్రం తమకు నచ్చిన సమయాల్లో వచ్చి ప్రొటోకాల్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కొంతమంది తమకు అంతరాలయ దర్శనం జరగాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో దేవస్థాన అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అంతరాలయ దర్శనాలు చేయించాల్సి వచ్చింది. దీనివల్ల రూ.300, రూ.100 క్యూల్లో భక్తులు ఇబ్బంది పడ్డారు.