ఘనంగా తిరంగా..
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:29 AM
జాతీయ పతాకం రెపరెపలాడింది. జయహో నినాదాలు మిన్నంటాయి. దేశభక్తి ఎల్లడెలా ప్రజ్వరిల్లింది. ప్రతి ప్రాంతం త్రివర్ణమయమైంది. 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరగ్గా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రవ్యాప్త వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. సాయుధ దళాల కవాతు, శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు.
వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు
ఐజీఎంసీలో జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు
దళాల నుంచి గౌరవ వందనం స్వీకరణ
ఆకట్టుకున్న వివిధ శాఖల శకటాల ప్రదర్శన
దేశభక్తిని చాటిన సాయుధ దళాల కవాతు
బెజవాడలో కలియతిరిగిన శకటాలు
విజయవాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి భువనేశ్వరి, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కలెక్టర్ లక్ష్మీ, సీపీ రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రభుత్వ పనితీరును, అభివృద్ధిని వివరించాయి. మొత్తం 21 శాఖల శకటాలు పాల్గొనగా, పీ4, రవాణా శాఖ, రాజధాని అమరావతి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల అనంతరం అన్ని శకటాలు నగర రహదారులపై తిరిగాయి. బందరురోడ్డు, బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్డు, కంట్రోల్ రూమ్ మార్గాల్లో వెళ్లిన శకటాలను నగరవాసులు ఆసక్తిగా తిలకించారు.
‘అంగులూరు’కు అవార్డు
కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు మండలం అంగులూరు ప్రభుత్వ బాలిక పాఠశాలకు సీఎం చంద్రబాబు అవార్డు అందజేశారు. రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలలకు ఈ అవార్డు దక్కగా, కృష్ణాజిల్లా నుంచి అంగులూరు ప్రభుత్వ బాలికల పాఠశాల ఎంపికైంది.