Share News

ఆ‘వాహనం’

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:59 AM

రాజధాని నగరంగా రూపాంతరం చెందిన విజయవాడకు ప్రయాణాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెరుగుతున్న రాకపోకలు నగర ట్రాఫిక్‌పై ప్రభావం చూపిస్తున్నాయని ‘శిస్ర్టా’ అధ్యయనంలో తేలింది. ఈ సంకేతాలు సత్వర రవాణా వ్యవస్థల అవసరాన్ని చాటి చెబుతున్నాయని పేర్కొంది.

ఆ‘వాహనం’

బెజవాడకు పెరిగిన వాహనాల రాకపోకలు

వివిధ వాహనశ్రేణి ద్వారా రోజుకు 43.6 లక్షల ట్రిప్పుల ప్రయాణాలు

కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు నుంచి ఎక్కువగా..

ఆర్టీసీ బస్సుల్లో దారుణంగా పడిపోయిన ప్రయాణాలు

నడిచే వారి సంఖ్య కూడా దారుణంగా దిగువకు..

ద్విచక్రవాహనాలు, ఆటోలకే గిరాకీ

ఉద్యోగం, ఉపాధి కోసం 54 శాతం ప్రయాణాలు

విద్య కోసం 28 శాతం మంది రాకపోకలు

శిస్ర్టా అధ్యయనంలో తేలిన గణాంకాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాకు విజయవాడ నగరం కీలకంగా మారింది. మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గుడివాడ, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం వంటి ప్రాంతాల ప్రజలు నగరానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాదు కృష్ణాజిల్లా నుంచే కాకుండా గుంటూరు, ఏలూరు, పల్నాడు జిల్లాలతో పాటు విజయవాడతో వ్యాపార సంబంధాలు కలిగిన ప్రాంతాలు, వివిధ రాష్ర్టాల నుంచి కూడా వస్తున్న వారితో ప్రయాణాలు పెరిగాయన్నది అధ్యయనంలో తేలింది. వాహనశ్రేణి ఏదైనా నగరానికి రోజుకు సగటున 43.6 లక్షల ట్రిప్పులు వేస్తున్నాయన్నది శిస్ర్టా అధ్యయనంలో తేలింది. నడక, సైక్లింగ్‌ మినహాయిస్తే రోజుకు 37.3 లక్షల ట్రిప్పులు నడుస్తున్నాయి. సగటు ట్రిప్‌ రేటు 6.6 కిలోమీటర్ల దూరం ఉంది.

తొమ్మిదేళ్లలో పెరిగిన ప్రయాణాలు

తొమ్మిదేళ్లలో నగరంలో వాహన వినియోగం అనూహ్యంగా పెరిగింది. ద్విచక్రవాహనాల వినియోగం 2016 నాటికి 40.3 శాతం ఉండగా, 2025 నాటికి 47.8 శాతం ఉన్నట్టు శిస్ర్టా అధ్యయనంలో తేలింది. ద్విచక్రవాహనాల ద్వారా నగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య 7.5 శాతం మేర పెరుగుదల నమోదు కావటం గమనార్హం. ఇక బస్సుల్లో ప్రయాణాలు ఘోరంగా పడిపోయాయి. 2016 నాటికి ఆర్టీసీ బస్సుల్లో 22.2 శాతం మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. 2025కు అది 12.1 శాతానికి పడిపోయింది. సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా పడిపోవడమూ ఇందుకు కారణమే. ఇక కార్లలో ప్రయాణాలు గణనీయంగా పెరిగాయి. 2016 నాటికి 1.6 శాతంగా ఉన్న కార్ల ప్రయాణాలు 2025 నాటికి 4.0 శాతానికి పెరిగాయి. సైకిల్‌పై ప్రయాణాలు తగ్గాయి. ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారు ఇప్పటికీ సైకిళ్లపై వస్తున్నారంటే విశేషమే. అయితే, 2016 నాటికి 7.7 శాతంగా ఉన్న సైకిళ్ల వినియోగం 2025 నాటికి 3.3 శాతానికి పడిపోయింది. ఆటోలు, మాక్సీ క్యాబ్‌ల్లో ప్రయాణాలు భారీగా పెరిగాయి. 2016 నాటికి 10.7 శాతంగా ఉన్న ప్రయాణాలు ఈ ఏడాదికి 21.8 శాతం పెరిగాయి. బస్సుల్లో ప్రయాణించటానికి ఇష్టపడని వారు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైళ్లలో విజయవాడకు వచ్చే వారిలో పెద్దగా పెరుగుదల లేదు. కేవలం 0.02 శాతమే పెరిగారని శిస్ర్టా తేల్చింది. నగరంలో గతంలో నడకమార్గంలో కూడా ఎక్కువ సంఖ్యలో ప్రయాణించేవారు. 2016 నాటికి 17.5 శాతంగా ఉన్న నడక ప్రయాణాలు ఈ ఏడాదికి 11 శాతం మేర పడిపోయాయి. దీనిని బట్టి చూస్తే 6.5 శాతం మేర నడక తగ్గిపోయింది.

ఏయే అవసరాలకు వస్తున్నారు?

నగరంలో పనిచేయటానికి వచ్చేవారు నూటికి 54 శాతం మంది ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధి, ఇతర జీవనోపాధి మార్గాల కోసం భారీగా ప్రయాణాలు సాగిస్తున్నారు. రెండో స్థానంలో చదువుకోవటానికి వచ్చేవారూ ఉన్నారు. విద్య కోసం 29 శాతం మంది నగరానికి ప్రయాణిస్తున్నారని తేలింది. నగరానికి ఏడుశాతం మంది వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వస్తున్నారు. కేవలం షాపింగ్‌ నిర్వహించటం కోసం ఐదుశాతం మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. వైద్యసేవల కోసం రెండుశాతం మంది వస్తున్నారు. ఆలయాలు, ప్రార్థనాలయాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా విజయవాడకు భారీగా వస్తున్నారు.

వాహనాల యాజమాన్య శాతం ఇలా..

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో వాహనాల యాజమాన్య శాతం ఇలా ఉంది. నూటికి 85 శాతం మంది ద్విచక్రవాహనాలను వినియోగిస్తుండగా, కార్ల వాటా 8 శాతం, ఆటోలు 4 శాతం, సైకిళ్ల వాటా 3 శాతంగా ఉన్నట్టు శిసా్ట్ర అధ్యయనంలో తేలింది.

Updated Date - Jun 21 , 2025 | 12:59 AM