మచిలీపట్నాన్ని సీఆర్‌డీఏలో చేర్చండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:58 AM
మచిలీపట్నం నగరాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలని మునిసిపల్ శాఖా మంత్రి నారాయణను కోరానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 100 పుష్‌కార్టులను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు అందించారు.

మునిసిపల్ మంత్రిని కోరానన్న మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు
100 పుష్‌కార్టుల అందజేత
మచిలీపట్నం టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం నగరాన్ని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలని మునిసిపల్ శాఖా మంత్రి నారాయణను కోరానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 100 పుష్‌కార్టులను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా సరైన పుష్‌కార్టులు లేక పారిశుధ్య కార్మికులు ఇబ్బందులకు గురయ్యారన్నారు. పారిశుధ్య పనులపై వైసీపీ పాలకులు దృష్టి సారించలేదన్నారు. చెత్తపై పన్ను వేసేందుకు మక్కువ చూపిన వైసీపీ నాయకులు పారిశుధ్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కొన్న తోపుడుబండ్లు ఇప్పటి వరకు పనిచేస్తున్నాయని, ఆ బండ్లు శిథిలం కావడంతో కొత్త బండ్లు కొనుగోలు చేశామన్నారు. తడి, పొడిచెత్తను వేరు చేసేందుకు ఈ తోపుడుబండ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. లక్ష టన్నుల చెత్తను వైసీపీ పాలకులు ఇచ్చారని, డంపింగ్ యార్డులోని ఆ చెత్తను గుంటూరుకు తరలిస్తున్నామన్నారు.
కాల్వగట్లపై ఆక్రమణలు తొలగిస్తున్నాం..
రాజకీయాలకు అతీతంగా కాల్వగట్లపై ఉన్న ఆక్రమణలు తొలగించి పూడికతీత పనులు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మచిలీపట్నం మునిసిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించి అందరి మన్ననలు పొందారన్నారు. కమిషనర్ బాపిరాజు చొరవ తీసుకుని ఆక్రమణలు తొలగించారన్నారు. 13 రోజులుగా ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఇందుకు నగర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే, కొందరు చిరువ్యాపారులు నష్టపోయినట్టు చెబుతున్నారని, వారికి సరైన న్యాయం చేస్తామన్నారు. ముద్ర రుణాలు ఇప్పించి చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము, మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.