Share News

మొంథా ముప్పు

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:41 AM

మొంథా తుఫాను ముంచుకొస్తోంది. దీని ప్రభావానికి ఈనెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని, 28న మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో పాటు వసతి గృహాల్లోని పిల్లలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. తుఫానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ శనివారం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సూచనలు చేశారు.

మొంథా ముప్పు
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ, చిత్రంలో జేసీ నవీన్‌ తదితరులు

జిల్లాపై తుఫాను ప్రభావం

27, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు

28న మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

వసతి గృహాల్లోని విద్యార్థులను ఇళ్లకు పంపే ఏర్పాట్లు

కలెక్టరేట్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

మచిలీపట్నంలో అధికారులతో సమావేశం, కీలక సూచనలు

ఆంధ్ర జ్యోతి-మచిలీపట్నం : మొంథా తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా మారింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి తీవ్రంగా మారుతుందని, 27వ తేదీ నాటికి తుఫానుగా, ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో కోస్తాతీరం వెంబడి 27, 28, 29 తేదీల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. 27న గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, 28న గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 28న మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసిన ఈ తుఫానుకు మొంథాగా నామకరణం చేశారు.

విద్యాసంస్థలకు సెలవులు

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు కలెక్టర్‌ బాలాజీ సెలవు ప్రకటించారు. 26వ తేదీ సాయంత్రం నుంచి సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లలను వారి స్వగృహాలకు పంపాలని కూడా ఆదేశించారు. డీఈవో, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు పిల్లలను ఇంటికి పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సమష్టిగా ఎదుర్కొందాం..

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయన్నారు. వర్షంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా విద్యుత స్థంభాలు, చెట్లు పడిపోయే అవకాశం ఉంటుందన్నారు. గాలుల ప్రభావానికి చెట్లు పడిపోతే వెంటనే పునరుద్ధరించేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన యంత్ర సామాగ్రి, క్రేన్లను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. డివిజన్‌ స్థాయిలోని ఆర్డీవోలు, మండలస్థాయిలోని తహసీల్దార్లు.. ఇన్సిడెంట్‌ కమాండర్లుగా వ్యవహరించి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక అధికారులు మండలాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. తుఫాను కార ణంగా ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేలా, ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో చేపలవేట కొనసాగించే వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలన్నారు. కాల్వగట్లు, కరకట్టలు బలహీనంగా ఉన్నచోట పటిష్టపరిచేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సెల్‌ఫోన్‌ టవర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి, వైద్యశిబిరాలు నిర్వహించాలని చెప్పారు. వాట్సాప్‌ గ్రూపుల్లో అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతామని, క్షేత్రస్థాయిలో సచివాలయ, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది వారు పనిచేసే కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో 08672-252572 నెంబరుతో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేసి త్వరగా సమాచారం తెలుసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వారంలో ప్రసవించే గర్భవతులు గ్రామాల్లో ఉంటే, వారిని ముందే ఆసుపత్రులలో చేర్పించాలన్నారు. డయాలసిస్‌ పేషెంట్లను కూడా ఆసుపత్రులకు తరలించాలని చెప్పారు.

నిత్యావసరాలు అందుబాటులో ఉంచండి

జేసీ నవీన్‌ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రంలోగా అన్ని రేషన్‌ షాపుల్లో సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ పనిని ఆర్డీవోలు, తహసీల్దార్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్‌ ఫర్హీన్‌ జాహిద్‌, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఏఏస్పీలు వీవీ నాయుడు, సత్యనారాయణ, గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం ఆర్డీవోలు బాలసుబ్రహ్మణ్యం, హేలాషారోన్‌, కె.స్వాతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.శివరాంప్రసాద్‌, డీఎస్‌వో మోహన్‌బాబు, డీపీవో జె.అరుణ, వ్యవసాయశాఖ జేడీ పద్మావతి, ఆర్‌అండ్‌బీ, విద్యుత, ఆర్‌డబ్ల్యూఎస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా వర్షపాతం ఇలా..

జిల్లాలో శనివారం ఉదయం 8.30 గంటల వరకు మోపిదేవిలో అత్యధికంగా 50.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరంలో 3.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటు 20.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. మచిలీపట్నంలో 48.2, అవనిగడ్డలో 45.2, పెనమలూరులో 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 26 , 2025 | 12:41 AM