Share News

‘మడ’త పెట్టేశారు..!

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:17 AM

సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉండే మడచెట్లను నరికేస్తున్నారు. పెడన, బంటుమిల్లి, బందరు, కృత్తివెన్ను మండలాల పరిధిలోని 15 వేల ఎకరాల మడ అటవీ విస్తీర్ణం నేడు 10 వేల ఎకరాలకు పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రకృతి ప్రసాదించిన చెట్లను నరికేస్తూ, భూములను ఆక్రమిస్తూ, రొయ్యల చెరువులను తవ్వేస్తూ, ఆనక అమ్మేస్తున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు.

‘మడ’త పెట్టేశారు..!
మడ అడవుల్లో అక్రమ రొయ్యల చెరువులు

మడ అడవులపై అక్రమార్కుల కన్ను

15 వేల ఎకరాల్లో 5 వేల ఎకరాలు హాంఫట్‌

పెడన, బంటుమిల్లి, బందరు, కృత్తివెన్ను మండలాల్లో కొనసాగుతున్న ఆక్రమణలు

చెట్లను నరికేసి.. రొయ్యల చెరువులుగా మార్చేసి..

గత పదేళ్లలో ఆక్రమణలు.. శాటిలైట్‌ చిత్రాలే సాక్ష్యం

రాజకీయ నేతలు, గ్రామాల్లోని కొందరి స్వార్థం వల్లే..

తుఫాన్లు, సునామీల నుంచి కాపాడే మడ అడవులు

అంతరించిపోతే ప్రమాదమంటున్న పర్యావరణవేత్తలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం) : కృష్ణాజిల్లాలోని పెడన, బంటుమిల్లి, బందరు, కృత్తివెన్ను మండలాల పరిధిలో బంగాళాఖాతం వెంబడి 15 వేల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. బంటుమిల్లి మండలం నారాయణపురం, మణిమేశ్వరం, పెడన మండలం లజ్జబండ కాల్వ రెండువైపులా, జింజేరు, బందరు మండలంలోని గిలకలదిండి, పెదపట్నం, కానూరు, సత్రవపాలెం గ్రామాలు, కృత్తివెన్ను మండలం ఇంతేరు, పీతలావ, కృత్తివెన్ను, పల్లెపాలెం, నిడమర్రు, ఓర్లగొందితిప్ప గ్రామాల్లో మడ అడవులు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో అక్ర మార్కులు, ఆక్రమణదారులు ఏకమై చెట్లను నరికేస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రేరేపిత ఆక్రమణలు, అధికారుల అవినీతి, తీరప్రాంతాల్లోని కొందరి స్వార్థం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పంచాయతీల్లో చీకటి తీర్మానాలు చేసుకుని 5 నుంచి 10 ఎకరాల వరకు పెగ్‌ మార్కింగ్‌ చేసుకుని రాత్రికి రాత్రే నరికివేస్తున్నారు. ఆ తర్వాత రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. రొయ్యలు, పీతలు సాగు చేస్తున్నారు.

వైసీపీ హయాం నుంచి..

వైసీపీ హయాంలో 2 వేల ఎకరాల వరకు మడచెట్లను నరికేశారు. రాజకీయ ప్రేరేపిత ఆక్రమణలను చూసి తీరప్రాంత గ్రామాల్లోని కొందరి కన్ను కూడా పడింది. మడచెట్ల నరికివేతను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొద్దికాలం రొయ్యల సాగు చేశాక రెవెన్యూ అధికారుల వద్ద పట్టాలు తెచ్చుకుంటున్నారు. ఈ పట్టాలను ఆధారంగా చేసుకుని ఇతరులకు లీజులకు ఇస్తున్నారు. ఎకరం రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారు. అలాగే, రొయ్యల సాగులో నీటిని దిగువకు వదిలినప్పుడు అందులోని రసాయన క్రిమిసంహారక మందులు అటవీ ప్రాంతంలోకి చేరి మొక్కలు ఎండిపోతున్నాయి. చెట్ల ఎదుగుదల గణనీయంగా తగ్గిపోతోంది.

గూగుల్‌ ఎర్త్‌లో సాక్ష్యాలు

గూగుల్‌ ఎర్త్‌లో శాటిలైట్‌ చిత్రాలను పరిశీలిస్తే.. గత పదేళ్లలో మడచెట్ల నరకివేత ఎంత భారీగా జరిగిందో తెలుస్తుంది. 2000, 2020, 2025 శాటిలైట్‌ చిత్రాలను పరిశీలిస్తే తేడా అర్థమవుతుంది. 1995-2000 వరకు పచ్చగా ఉన్న చెట్ల స్థానంలో 2020 నాటికి రొయ్యల చెరువులు కనిపిస్తున్నాయి. 2025 చిత్రాలను పరిశీలిస్తే.. రొయ్యల చెరువులే కనిపిస్తాయి.

అందరి బాధ్యత

సముద్ర తీర ప్రాంతాలకు ప్రకృతి ప్రసాదించిన వరం మడ అడవులు. వీటిని సంరక్షించుకోవటం అధికార యంత్రాంగంతో పాటు ప్రజలది కూడా. ఈ అడ వులు తుఫాన్లు, సునామీల నుంచి తీరప్రాంత గ్రామాలను కాపాడతాయి. మడ చెట్లు నీటిని శుభ్రపరుస్తాయి. ఎగువ ప్రాంతాల డ్రెయిన్ల ద్వారా సముద్రంలో కలిసే నీటిని శుభ్రపరుస్తాయి.

Updated Date - Aug 23 , 2025 | 12:17 AM