మల్లయ్యగట్టు.. కొల్లగొట్టు..!
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:06 AM
‘పేట’లో సవాల్.. ప్రభుత్వమేదైనా మేమే తవ్వుకుంటాం.. దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం.. అంటూ జగ్గయ్యపేటలోని కొంగర మల్లయ్యగట్టు వద్ద అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గట్టును గుల్లచేసింది చాలక.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగిస్తున్నారు. 500 క్యూబిక్ మీటర్ల నుంచి ఏకంగా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుకోవడంతో మల్లయ్య గట్టు ప్రాంతం ప్రస్తుతం చెరువుల్లా మారిపోయింది. వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు కలిసి సాగిస్తున్న ఈ అక్రమాలకు కొండపై మల్లయ్య దేవరే కాదు.. కొండ కింద రైతులు కూడా బాధితులుగా మారిపోయారు.

జగ్గయ్యపేటలోని కొంగర మల్లయ్యగట్టులో అక్రమ క్వారీయింగ్
వైసీపీ హయాంలోనే అనుమతులు
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగని అక్రమాలు
సమీపంలోని 100 ఎకరాల్లోనూ తవ్వకాలు
భూములు లీజుకు తీసుకుని, అసైన్డ్ భూములు కొనేసి..
కొండచుట్టూ తాటిచెట్ల లోతున తవ్వకాలు
వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు మిలాఖత
కలెక్టర్ లక్ష్మీశకు బాధిత రైతు ఫిర్యాదుతో వెలుగులోకి..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జగ్గయ్యపేటలోని కొంగర మల్లయ్యగట్టు పరిసరాల్లోని 100 ఎకరాల అసైన్డ్, ప్రైవేట్ పట్టా భూములను కొనుగోలు చేసి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. వీటిలో చాలావరకు నామమాత్రపు లీజుకు తీసుకుని అక్రమంగా తవ్వేసినవే. కౌలు పేరుతో ఈ మైనింగ్ జరుగుతోంది. కొందరి భూములైతే, బలవ ంతంగా తమ స్వాధీనంలోకి తీసుకుని తాటిచెట్టంత లోతున తవ్వేశారు. ఈ అక్రమ మైనింగ్‌ను గుర్తించిన స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. విసుగెత్తిన కొందరు రైతులు ధైర్యంచేసి కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయి సందర్శనకు వస్తానని కలెక్టర్ చెప్పటంతో అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఎక్స్‌కవేటర్లను పొలాల్లో దాచి ఉంచారు. కలెక్టర్ తనిఖీలకు రాకపోవటంతో మళ్లీ ఎక్స్‌కవేటర్లను బయటకు తీసి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దారి పొడవునా వేగులను ఏర్పాటుచేసుకుని ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కొంగ ర మల్లయ్యగట్టుతో పాటు సమీప 100 ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఈ మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అక్రమాలు
ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన ఓ అధికారి చిన్నమామ కొంగరమల్లయ్య గట్టు వెనుక ప్రాంతాన్ని కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారికంగా లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న చోట నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా తవ్వేశారు. ఇప్పుడు తవ్వుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. కానీ, పదేపదే తవ్వుకోవటానికి రెన్యువల్స్ చేయించుకుంటున్నారు. ఇక్కడ తవ్వేదేమీ లేకపోవడంతో గట్టు చుట్టూ విచ్చలవిడిగా తవ్వేశారు. రెండు తాటిచెట్ల లోతున తవ్వేశారు. తీసుకున్న అనుమతులు 500 క్యూబిక్ మీటర్లకు అయితే, లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిగాయి. వైసీపీ హయాంలో జరిగిన ఈ అక్రమ తవ్వకాల కారణంగా కొంగర మల్లయ్యగట్టు చుట్టూ భారీ గోతులు, అందులో చెరువులను తలపించేలా నీరు నిల్వ ఉండిపోయింది. కొండపై కొంగర మల్లయ్యను దర్శించుకోవటానికి వచ్చే భక్తులకు ఈ గోతులు ప్రాణాంతకంగా మారాయి. ఈ నీటిని రైతులు మోటార్లు వేసుకుని తోడుకుంటున్నారంటే.. ఎంత భారీస్థాయిలో నిల్వ ఉన్నాయో అర్థమవుతుంది.
కూటమి నాయకులతో జతకట్టి..
ఈసారి అక్రమార్కులు రూటు మార్చారు. కూటమి నేతలను కూడా తమ వ్యాపారంలో కలుపుకొని అక్రమ మైనింగ్‌కు తెరతీశారు. రాష్ట్ర టీడీపీలో ముఖ్యమైన నాయకుడి మేనమామ వరస అయిన ఓ నాయకుడిని భాగస్వామిగా చేసుకున్నారు. దీంతో పాటు కూటమిలోనే మరో జనసేన నాయకుడిని కూడా కలుపుకొన్నారు. ఈ ముగ్గురికి బంధుత్వం కూడా ఉండటంతో అక్రమ మైనింగ్‌లో కలిసిపోయారు. మూడు పార్టీల నేతల భాగస్వామ్యం ఉండటంతో వ్యవస్థలు కూడా వారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. దీంతో స్థానిక రైతులు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. కాగా, కడుపు మండిన రైతు గద్దె హరిబాబు స్థానిక పోలీసులు, తహసీల్దార్, ఆర్‌డీవోలతో పాటు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ దృష్టిసారించారు. ఆకస్మిక తనిఖీలకు నిర్ణయించినా ఇప్పటివరకు వెళ్లలేదు. పరిశీలనల అనంతరం వైసీపీ, కూటమి నేతలు కలిసి సాగిస్తున్న అక్రమ మైనింగ్ బాగోతాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కూటమి ప్రభుత ్వం రాగానే మూడు నెలలు బంద్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కులు మూడు నెలలు తమ కార్యకలాపాలను నిలుపుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించటంతో జాగ్రత్త పడ్డారు. గ్రావెల్ రుచి మరిగిన మాఫియాకు ఖాళీగా ఉండటం ఇష్టంలేక తిరిగి మళ్లీ అక్రమ మైనింగ్ చేపట్టారు.