Share News

చెరువులను చెరపట్టి..

ABN , Publish Date - May 09 , 2025 | 12:48 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా సుమారు వెయ్యి ఎకరాల అసైన్డ్‌ భూములపై పెద్దల కన్ను పడింది. పక్క జిల్లాకు చెందిన పెద్దపెద్ద నాయకులు, బడాబాబులు, స్థానిక నాయకులతో ఏకమై, వాటిని లీజు రూపంలో పేదల నుంచి అతితక్కువకు తీసుకుని, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. వందకు పైగా ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లతో చకచకా పనులు చేపడుతున్నారు. పెద్దలంతా ఏకమై అక్రమ చెరువులు తవ్వేస్తుంటే, అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

చెరువులను చెరపట్టి..
నిడమర్రు చెరువుల తవ్వకాల్లో పదుల సంఖ్యలో ఎక్స్‌కవేటర్లు

కృత్తివెన్ను మండలంలో బడాబాబుల అక్రమ తవ్వకాలు

అసైన్డ్‌ భూములను రైతుల నుంచి తక్కువకు లీజుకు తీసుకుని..

వందకుపైగా ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లతో చెరువులుగా తవ్వకాలు

పక్కజిల్లా నేతలు, బడాబాబుల జోక్యంతో పట్టించుకోని అధికారులు

రెవెన్యూ సరిహద్దులను కూడా చెరిపేసి ఇష్టానుసారంగా..

కృత్తివెన్ను, మే 8 : కృత్తివెన్ను మండలం గరిశపూడి, నిడమర్రు రెవెన్యూ గ్రామాల సరిహద్దుల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటిని గతంలో ఆయా గ్రామాల్లోని పేదలు ఆక్రమించుకుని సాగులోకి తీసుకొచ్చారు. వారికి ప్రభుత్వం బీఫాం పట్టాలు ఇచ్చింది. నాటి నుంచి చిన్నచిన్న చెరువులుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. కాగా, ఇటీవల బడాబాబులు ప్రవేశించారు. ఇప్పటికే మండలవ్యాప్తంగా విచ్చలవిడిగా చెరువులను తవ్వేసిన వీరు.. ఇప్పుడు అసైన్డ్‌ భూములపై కూడా కన్నేశారు. స్థానిక నాయకుల అండతో చిన్న, సన్నకారు రైతులతో మాట్లాడి, తక్కువ లీజుకు భూములు పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములను పూర్తిస్థాయి చెరువులుగా తవ్వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా అసైన్డ్‌ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ బడాబాబులతో పాటు పక్క జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ అక్రమ చెరువుల తవ్వకాల్లో భాగస్వాములు కావడంతో పాటు స్థానిక నాయకుల అండ ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవట్లేదు.

వామ్మో.. ఎన్ని ఎక్స్‌కవేటర్లో..

ఈ చెరువుల తవ్వకాల్లో వందకు తగ్గకుండా ఎక్స్‌కవేటర్లు, అంతకుమించి ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ వాహనాలు పరుగులు పెడుతున్నాయి. అక్రమ తవ్వకాలు కావటంతో శరవేగంగా పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని వాహనాలను ఉపయోగిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పెదలంక డ్రెయిన్‌ గట్టే సరిహద్దు

ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా జరుగుతున్న ఈ చెరువుల అక్రమ తవ్వకాల్లో నిబంధనలను గాలికొదిలేశారు. పెదలంక డ్రెయిన్‌ గట్టునే సరిహద్దుగా చేసుకుని గరిశపూడి, నిడమర్రు, దోమలగొంది, పెదగొల్లపాలెం, పోడు గ్రామాల మధ్య ఉన్న వేలాది ఎకరాల భూములన్నింటినీ చెరువులుగా మార్చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా డ్రెయిన్‌ గట్టుకు కనీస దూరం పాటించకుండా, గట్టునే సరిహద్దుగా మార్చేశారు. రెవెన్యూ గ్రామ సరిహద్దులను కూడా తుడిచేస్తూ, అన్ని గ్రామాల మధ్య ఉన్న చెరువులను ఎడాపెడా వారికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రైతుల భూములకు హద్దులతో పాటు రెవెన్యూ గ్రామాల మధ్య హద్దులు కూడా చెదిరిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతుల్లేవ్‌.. అడ్డుకుంటాం..

చెరువుల తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేవు. తవ్వకాలు జరుగుతున్న భూములు కూడా అసైన్డ్‌ భూములే. కానీ తవ్వకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. వెంటనే వాటిని నిలిపివేయిస్తాం. - సోమేశ్వరరావు, కృత్తివెన్ను తహసీల్దార్‌

Updated Date - May 09 , 2025 | 12:48 AM