Share News

డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌పై ఆశలు

ABN , Publish Date - May 25 , 2025 | 01:29 AM

జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో డిఫెన్స్‌ మాన్యు ఫాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్య మంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ను కలిసి డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు గురించి చర్చించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో వేలాది ఎక రాల భూమి అందుబాటులో ఉందని చెప్పారు. క్షిపణులు, మందుగుండు పరిరక్షణ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చి దిద్దాల్సిందిగా సీఎం కోరగా, రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించారు.

డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌పై ఆశలు

ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రికి సీఎం చంద్రబాబు వివరణ

కంచికచర్ల, మే 24 (ఆంధ్రజ్యోతి) : రాజధాని అమరావతికి గేట్‌వే (ముఖద్వారం)గా ఉన్న జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈనెల 13న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇండస్ట్రియల్‌ సెక్టార్‌తో పాటు ఐటీ, డిఫెన్స్‌ హబ్‌గా ఈ ప్రాంతాలను తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, కలెక్టర్‌ లక్ష్మీశ, ఇతర ఉన్నతాధికారులు భూములను పరిశీలించారు. 65వ నెంబరు జాతీయ రహదారికి, ప్రతిపాదిత ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు, రాజధాని అమరావతికి దగ్గరగా ఉండటం, కృష్ణానది వల్ల నీటికి కొరత లేకపోవటం, సిమెంట్‌, ఇసుక, మెటల్‌ కూడా అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

అందుబాటులో ప్రభుత్వ భూములు

జగ్గయ్యపేట మండలం జయంతిపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 94లో 498.56 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబర్‌ 65లో 365 ఎకరాలు, వేదాద్రి వద్ద మరో 700 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. చుట్టుపక్కల ఉన్న మరో 300 ఎకరాల ప్రైవేట్‌ భూములు సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నందిగామ మండలం పెద్దవరం గ్రామ రెవెన్యూ పరిధిలో 1,120 ఎకరాలు ఉన్నాయి. ఈ భూమిలో 515 ఎకరాలను దశాబ్దం కిందటే ఏపీఐసీసీకి కేటాయించగా, రూ.కోట్ల వ్యయంతో గుట్టలు, కొండలను చదునుచేసి, రోడ్లు, నీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. రామన్నపేట (గుడిమెట్ల) పరిధిలో 250 నుంచి 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. అక్కడే ఉన్న మరో 300 ఎకరాల అటవీ భూమిని తీసుకునేందుకు డీనోటిఫై చేయాల్సి ఉంది.

ఎంపీ కేశినేని చిన్ని హర్షం

కంచికచర్ల: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో డిఫెన్స్‌ క్లస్టర్‌ హబ్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు 2 వేల ఎకరాలు కేటాయించటంపై ఎంపీ కేశినేని చిన్ని ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ హబ్‌ ఏర్పాటు కావడం వల్ల నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల అభివృద్ధే కాకుండా ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పించటం కోసం.. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్‌ రంగంలోకి ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అడుగుపెట్టేందుకు ఇది చక్కని అవకాశమని ఆయన తెలిపారు.

డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపు

టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, మే 24 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట-నందిగామ మధ్య 2 వేల ఎకరాల్లో డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడం రాష్ట్ర అభివృద్ధికి కీలకమలుపు అవుతుందని టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్‌ వల్ల యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పడి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజల తరఫున సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మారనున్న జగ్గయ్యపేట రూపురేఖలు

డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుపై తాతయ్య సంతోషం

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట-నందిగామ మధ్య డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సంతోషం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని 2015లో తొలిసారిగా ప్రతిపాదించడంతో ప్రభుత్వ భూ ములు సర్వే చేశారని తెలిపారు. శనివారం తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జగ్గయ్యపేటలో గతంలో ఇండస్ట్రియల్‌ హబ్‌ కోసం కేటాయించిన జయంతిపురం భూములపై వచ్చిన కోర్టు వివాదాన్ని రెండోసారి చంద్రబాబు ప్రభు త్వం రాగానే తాను, ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి ఏపీఐఐసీ చైర్మన్‌తో మాట్లాడి కోర్టు వివాదం ముగిసేలా చొరవ తీసుకున్నామని, ఆ భూములకు విముక్తి కల్పించామని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశంలోనూ జయంతిపురం భూముల అం శాన్ని ప్రస్తావించానని తెలిపారు. భూములకు క్లియరెన్స్‌ రాగానే ఎంపీ కేశినేని శివనాథ్‌ మళ్లీ సర్వే చేయించారని తెలిపారు. డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుతో జగ్గయ్యపేట ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. జగ్గయ్యపేట ప్రజల తరపున ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌, ఎంపీ కేశినేనికి తాతయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 01:31 AM