Share News

రాజధానికి ఇక హైస్పీడ్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:44 AM

రాజధాని అమరావతి మీదుగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్‌ వెళ్లనుంది. దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రతిపాదించిన హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అమరావతి మీదుగా సాగుతుంది.

రాజధానికి ఇక హైస్పీడ్‌

అమరావతి మీదుగా హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్‌

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌కు ప్రతిపాదనలు సిద్ధం

గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్న రైళ్లు

సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 147.45 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌

442.35 ఎకరాల భూములు అవసరమని ప్రతిపాదన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాజధాని అమరావతి మీదుగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్‌ వెళ్లనుంది. దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రతిపాదించిన హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ అమరావతి మీదుగా సాగుతుంది. ఈ కారిడార్‌కు సంబంధించి రైట్స్‌ సంస్థ తాజాగా దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు అందజేసింది. హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌తో పాటు హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌కు కూడా ప్రతిపాదించింది. ఇందులో హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్‌ మాత్రం అమరావతి మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టుకు రూ.3.04 లక్షల కోట్ల అంచనా వ్యయం అవుతుందని రైట్స్‌ సంస్థ నిర్దేశించింది. మన రాష్ట్రంలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతిలో రెండుచోట్ల చొప్పున మొత్తం 9 స్టేషన్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల మీదుగా ఈ రైలు వెళ్తుంది. రాజధాని అమరావతి పరిధిలో పల్నాడు, గుంటూరు జిల్లాల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ వెళ్తుంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు 504 కిలోమీటర్ల పరిధి ఉండగా, అమరావతిలో మొత్తం 147.45 కిలోమీటర్ల పరిధిలో హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్‌ సాగుతుంది. పల్నాడు జిల్లా మీదుగా 81 కిలోమీటర్లు, గుంటూరు జిల్లా మీదుగా 66.45 కిలోమీటర్లు సాగుతుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 1,873.7 హెక్టార్ల భూములను రైట్స్‌ సంస్థ ప్రతిపాదించగా, రాజధానిలో 442.35 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది.

Updated Date - Oct 23 , 2025 | 12:44 AM