Share News

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:01 AM

రైతులు సుస్థిర, అధిక ఆదాయనిచ్చే పంటల సాగుకు మొగ్గు చూపాలని ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు సూచించారు.

ఉద్యాన పంటలతో అధిక ఆదాయం
జి.కొండూరులో టమాటా తోటను పరిశీలిస్తున్న ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు

ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు

జి.కొండూరు/రెడ్డిగూడెం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రైతులు సుస్థిర, అధిక ఆదాయనిచ్చే పంటల సాగుకు మొగ్గు చూపాలని ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు సూచించారు. జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లోని టమాటా, మల్లె, మామిడి తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. మామిడికి తామర పురుగులు, తేనే మంచు పురుగుల వల్ల కలిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. 13 నుంచి 15 సార్లు పురుగు మందులు పిచికారీ చేసినా మామిడి ఫలాలు ఆశాజనకంగా రాలేదని రైతులు తెలిపారు. నాణ్యమైన మామిడి కాయలు దిగుబడి చేసుకునేందుకు ఉద్యానశాఖ నుంచి రైతులకు ఫ్రూట్‌ కవర్లకు రూ.వెయ్యి వరకు రాయితీ ఇస్తుందన్నారు. సేకరణ కేంద్రాలకు, శీతల గదులకు రాయితీలు ఉన్నాయన్నారు. ఇలా ఉత్పత్తి చేసిన నాణ్యమైన పండ్లను మార్కెట్‌లో సాధారణ ధర కంటే రెండు రెట్లు అధికంగా అమ్ముకోవచ్చన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి పి.బాలాజీకుమార్‌, హెచ్‌వో నరేంద్ర కుమార్‌, కె.విజయబాబు, వీహెచ్‌ఏ సుబ్బారావు, పరమేశ్వరరావు, చేబ్రోలు కృపారాజు, రైతులు పాల్గొన్నారు.

మల్లెసాగుకు రైతులు ముందుకు రావాలి

మైలవరంరూరల్‌: రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంపొందించే పంటల్లో మల్లెసాగు ఒకటని, రైతులు సాగుకు ముందుకు రావాలని ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు సూచించారు. పుల్లూరులో సోమవారం డ్రిప్‌ పద్ధతిలో సాగుచేస్తున్న మల్లెతోటలను ఆయన పరిశీలించారు. మల్లెసాగుకు సూక్ష్మసేద్యంపథకంలోని రాయితీలందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సూక్ష్మసేద్య అధికారి పీఎం సుభాని, ఉద్యాన అధికారి సొహైల్‌ అహ్మద్‌, నరేంద్ర, చిట్టిబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 01:01 AM