Share News

వాన.. వరద

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:40 AM

ఓవైపు జోరువాన.. మరోవైపు హోరున వరద.. కృష్ణానది క్రమక్రమంగా ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, నాగార్జున సాగర్‌, పులిచింతల, వాగులు, వంకల నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటు పునరావాస కేంద్రాలు సిద్ధంచేసేలా మార్గదర్శకాలు సూచించారు. నగరంలో భారీవర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి.

వాన.. వరద
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి

జిల్లావ్యాప్తంగా భారీవర్షం.. ప్రకాశం బ్యారేజీకి వరదపోటు

మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు

పులిచింతల నుంచి క్రమంగా పెరుగుతున్న వరద

ఇన్‌ఫ్లో 2.96 లక్షలు, అవుట్‌ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులు

5 లక్షల క్యూసెక్కుల వరకూ వచ్చే అవకాశం

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, బుడమేరు ఉధృతం

తీరప్రాంతాల్లోకి చేరుతున్న వరద.. యంత్రాంగం అప్రమత్తం

నగరాన్ని ముంచేసిన కుండపోత వర్షం.. ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వర్షపు నీరు

నేడు పాఠశాలలకు సెలవు.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా బుధవారం కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ఓ మోస్తరుగా ప్రారంభమై అర్ధరాత్రికి వేగం పుంజుకుంది. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కాగా, అల్పపీడనం మరింతగా బలపడి రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద చేరుతోంది. ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల వరకు వచ్చిన ఇన్‌ఫ్లో బుధవారం ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో జలాశయాలు నిండుకుండలా మారాయి. బ్యారేజీకి ఎగువ నుంచి 2లక్షల96వేల177 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 70 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 3లక్షల97వేల250 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 3లక్షల క్యూసెక్కులు దాటడంతో బ్యారేజీ వద్ద ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి అనుబంధంగా ఉన్న కాల్వల్లో నీటి ఉధృతి పెరిగింది. పులిచింతల నుంచి 2లక్షల58వేల223, కీసర నుంచి 24,671, పాలేరు నుంచి 13,283 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతుండగా, తూర్పుడెల్టా పరిధిలోని కాల్వలకు 3,117, పశ్చిమ డెల్టాకు 1,016 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు తొమ్మిది గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి ఇన్‌ఫ్లో దిగువకు వదులుతున్నారు. ఇదంతా ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతోంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.7 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39.5 టీసీఎంల నీరు ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు ఇలాగే కురిస్తే ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జి.కొండూరులోని పులివాగుకు వరద పోటెత్తింది. వంతెనకు ఆనుకుని ప్రవహిస్తోంది. కుంటముక్కల వద్ద కొండవాగు, మైలవరం వద్ద మరో కొండవాగు, రెడ్డిగూడెం నుంచి కోతుల వాగుకు వరద పోటెత్తడంతో బుడమేరు ప్రవాహం పెరిగింది. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 6 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీన్ని బీడీసీ ద్వారా కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారు.

నేడు పాఠశాలలకు సెలవు

జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశాల మేరకు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ సెలవు ప్రకటిస్తున్నట్టు డీఈవో ప్రకటించారు.

బుడమేరుపై వదంతులు నమ్మొద్దు

కలెక్టరేట్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ‘బుడమేరుకు వరదలు’ అంటూ సోషల్‌ మీడియా, మరెక్కడైనా వదంతులు వస్తే నమ్మొద్దని కలెక్టర్‌ లక్ష్మీశ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్‌ వద్ద బుడమేరు ప్రవాహాన్ని ఓ ప్రత్యేక బృందం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ నిలిచిన నీటికి స్థానికంగా కురిసిన వర్షాలే కారణమని, బుడమేరు వరద కాదని స్పష్టం చేశారు. రెగ్యులేటర్‌ వద్ద నీరు విడుదల చేస్తే 24 గంటల ముందే అప్రమత్తం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాకే నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. సందేహాలు ఉంటే కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 9154970454 నెంబరుకు కాల్‌ చేసి తెలుసుకోవాలని కోరారు.

నగరంలో నరకం

  • భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం

  • పొంగిపొర్లిన సైడ్‌ కాల్వలు.. నీరంతా రోడ్లపైకి..

విజయవాడ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : భారీవర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. వర్షాకాలం సమీపించినా కార్పొరేషన అధికారులు డీసిల్టింగ్‌ చేపట్టకపోవడంతో స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు పూడుకుపోయాయి. వర్షపు నీరు డ్రెయిన్లలోకి చేరలేదు. అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్ల నుంచి నగరంలోని ప్రధాన కాల్వలోకి నీరు చేరకపోవడంతో నగరమంతా వర్షపు నీటితో నిండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం 11 గంటల వరకు నీరు కదల్లేదు. పాత రాజరాజేశ్వరిపేటలో రోడ్లన్నీ మునిగిపోయాయి. వనటౌన, విద్యాధరపురం, కబేళా, కొత్తపేట, చిట్టినగర్‌, భవానీపురం, హౌసింగ్‌ బోర్డు కాలనీ, వించిపేట ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అడుగులోతున నిండిపోయాయి. గాంధీనగర్‌, సత్యనారాయణపురం, అయోధ్యనగర్‌, సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. బుడమేరు మధ్యకట్ట వెంబడి విజయదుర్గానగర్‌లో పలు ఇళ్లలోకి నీరు చేరింది. ఈ కాల్వలో తూడు పేరుకుపోవడం వల్ల నీళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. బుడమేరు నుంచి ఏలూరు కాల్వలోకి నీటిని వదిలే గేట్లను తెరవకపోవడంతో ప్రవాహం పెరిగింది. దీంతో అల్లూరి సీతారామరాజు బ్రిడ్జిపై వరద చేరింది. అప్రమత్తమైన ఇరిగేషన అధికారులు గేట్లు తెరిచారు.

అస్తవ్యస్తం

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాయకాపురం ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని ఉన్న 11 కేవీ కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డులో చెత్త రోడ్డుపైకి చేరింది. తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆయుష్‌ ఆసుపత్రి రోడ్డులో మోకాళ్ల లోతు వరకు నీరుచేరి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. నేషనల్‌ హైవేను ఆనుకుని ఉన్న నోవాటెల్‌ సర్వీస్‌ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో పాటు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైపుల రోడ్డులో కాలనీల్లో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరుతుందేమోనని స్థానికులు భయపడ్డారు.

Updated Date - Aug 14 , 2025 | 01:40 AM