రాయల్‌గా రాయనపాడు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:05 AM
రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ తొలిదశ ఆధునీకరణ, అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా శాటిలైట్ రైల్వేస్టేషన్
పూర్తయిన తొలిదశ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు
వెస్ట్ బైపాస్ మీదుగా కొద్ది నిమిషాల్లోనే రాజధాని గ్రామాలకు చేరుకునే అవకాశం
పూర్తయిన తొలిదశ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు
వెస్ట్ బైపాస్ మీదుగా కొద్ది నిమిషాల్లోనే రాజధాని గ్రామాలకు చేరుకునే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ తొలిదశ ఆధునీకరణ, అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సరికొత్త సొబగుల ద్ది ఈ రైల్వేస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆధునీకరించిన ఈ రైల్వేస్టేషన్ రాజధాని అమరావతికి గేట్ వేగా నిలవబోతోంది. భవిష్యత్తులో రాజధానిలోని గ్రామీణ ప్రజలు, నగర ప్రజలు దూర ప్రాంతాల నుంచి రాయనపాడు రైల్వేస్టేషన్‌లో దిగి విజయవాడకు రాకుండానే తమ ప్రాంతాలకు చేరుకోవచ్చు. రాయనపాడు నుంచి గొల్లపూడి బయటకు రాగానే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది. ఈ వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా వెంకటపాలెం, ఇతర రాజధాని గ్రామాలకు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. స్మార్ట్ స్టేషన్ ఫీచర్లతో రాయనపాడు రైల్వేస్టేషన్‌ను రూ.100 కోట్లతో రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. తొలి దశలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. రాయనపాడులో నూతన రైల్వేస్టేషన్ భవనం నిర్మించి, ఇందులో అత్యాధునికమైన సదుపాయాలను కల్పించింది. అద్భుతమైన ఇంటీరియర్, ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మించింది. డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, ఫ్రీ వైఫై, ఆన్‌లైన్ టికెటింగ్, సోలార్ పవర్, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఫుడ్‌కోర్టులు, రిటైల్ దుకాణాలకు కూడా అవకాశం కల్పించింది. ఆధునికమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించింది. వీటితో పాటు రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు, మెరుగైన ఎల్‌ఈడీ లైటింగ్ సదుపాయాలను కల్పించింది. ఇవి కాకుండా ప్లాట్‌ఫామ్‌లను అందంగా, విశాలంగా తీర్చిదిద్దింది. ప్లాట్‌ఫామ్‌లపైనా ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేసింది. స్టేషన్‌లో ఎలక్ర్టిఫికేషన్, సిగ్నలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. స్టేషన్ బయట కాంక్రీట్ ఫ్లోర్, చూడముచ్చటైన ల్యాండ్ స్కేపింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.