రూ.10 కోసం ప్రాణం తీశాడు!
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:07 AM
తన జేబులో ఉన్న డబ్బుతో మద్యం షాపు కనిపించిన ప్రతిచోట ఆగి, తాగాడు. అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాగాలనిపించింది. అయితే ఈసారి మద్యం కొనేందుకు రూ.10 తగ్గాయి. ఆ డబ్బు ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతను ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేశాడు. నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ మద్యం మత్తులోనే ఉండడం గమనార్హం.
మద్యం కొనుక్కొనేందుకు తగ్గిన డబ్బులు
ఇవ్వలేదని దారుణం.. నగరంలో ఘటన
విజయవాడ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): తన జేబులో ఉన్న డబ్బుతో మద్యం షాపు కనిపించిన ప్రతిచోట ఆగి, తాగాడు. అర్ధరాత్రి అవుతున్నా ఇంకా తాగాలనిపించింది. అయితే ఈసారి మద్యం కొనేందుకు రూ.10 తగ్గాయి. ఆ డబ్బు ఇవ్వమని ఓ వ్యక్తిని అడగ్గా.. అతను ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేశాడు. నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ మద్యం మత్తులోనే ఉండడం గమనార్హం. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నులకపేట గ్రామానికి చెందిన పలకా తాతాజీ (48)కి భార్య, పిల్లలు ఉన్నారు. తాతాజీ మద్యానికి బానిస అవడంతో ఆయన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడు చిట్టినగర్‌లోని సొరంగం మార్గం ప్రాంతంలో ఉంటూ, అక్కడే షాపుల ముందు నిద్రపోతుండేవాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగి, ఓ మగ్గం దుకాణం ముందు నిద్రపోయాడు. మరోవైపు చిట్టినగర్‌లోని కొండ మీద ఉన్న భీమవరపుపేటకు చెందిన తెన్నేరు దుర్గాప్రసాద్ (18) ఎలకి్ట్రకల్ పనులు చేస్తుంటాడు. తన అన్న నానితో కలిసి పనికి వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చాడు. తర్వాత కొండ మీద నుంచి కిందికి వచ్చి టీ తాగి, సిగరెట్ కాల్చాడు. ఇంటికెళ్లిన తర్వాత సిగరెట్ వాసన రావడంతో అన్నయ్య పసిగట్టి, చెంపపై కొట్టాడు. దీంతో దుర్గాప్రసాద్ మళ్లీ కొండ మీద నుంచి కిందకు వచ్చాడు. స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని, వాటితో రాత్రి 11 గంటల వరకు మూడు బార్‌లలో కలిపి అర సీసా మద్యం తాగుతూ తిరిగాడు. తర్వాత ఇంకా మద్యం తాగాలనిపించగా.. జేబు చూసుకోగా, మద్యం కొనుగోలుకు రూ.10 తగ్గాయి. ఆ సమయంలో దుర్గాప్రసాద్ అరుగుపై నిద్రపోతున్న తాతాజీ వద్దకు వెళ్లి, అతడిని నిద్రలేపి రూ.10 ఇవ్వాలని అడిగాడు. అప్పుడు తాతాజీ కూడా మద్యం మత్తులో ఉండడంతో దుర్గాప్రసాద్‌పై చేయి చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ కోపంతో ఇంటికెళ్లి, కూరగాయలు కోసే చాకు తీసుకొచ్చి, నిద్రపోతున్న తాతాజీ ఛాతీలో ఐదు పోట్లు, దాని కింద భాగంలో రెండు పోట్లు పొడిచాడు. ఈ ఘటనలో తాతాజీ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పశ్చిమ ఏసీపీ దుర్గారావు, కొత్తపేట ఇన్‌స్పెక్టర్ కొండలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. హత్య అనంతరం పారిపోయిన దుర్గాప్రసాద్.. ఇంటికెళ్లి నిద్రపోవడం గమనార్హం.