రూ.5వేలకు కన్నకూతుర్ని అమ్మేశాడు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:50 AM
కన్నకూతుర్ని రూ.5 వేలకు అమ్మేశాడు ఓ తండ్రి. అంతేకాకుండా తన కూతుర్ని ఎవరో అపహరించారని ఒకసారి, తప్పిపోయిందని మరోసారి రైల్వే పోలీసులకు తెలిపాడు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైనశైలిలో విచారణ చేశారు. చివరకు భిక్షాటన కోసం ఇద్దరు వ్యక్తులు పాపను బస్సులో తీసుకెళ్తుండగా గుర్తించి, రక్షించారు.
రాజమండ్రిలో భిక్షాటన చేయించడానికే..
రూ.5 వేలకు కొనుక్కున్న ఇద్దరు వ్యక్తులు
చాకచక్యంగా పట్టుకున్న జీఆర్పీ పోలీసులు
తల్లిని పిలిపించి పాప అప్పగింత
తండ్రి సహా ముగ్గురు అరెస్టు
రైల్వేస్టేషన్, ఆగ స్టు 8 (ఆంధ్రజ్యోతి) : కన్నకూతుర్ని రూ.5 వేలకు అమ్మేశాడు ఓ తండ్రి. అంతేకాకుండా తన కూతుర్ని ఎవరో అపహరించారని ఒకసారి, తప్పిపోయిందని మరోసారి రైల్వే పోలీసులకు తెలిపాడు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైనశైలిలో విచారణ చేశారు. చివరకు భిక్షాటన కోసం ఇద్దరు వ్యక్తులు పాపను బస్సులో తీసుకెళ్తుండగా గుర్తించి, రక్షించారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లాలోని వేటపాలేనికి చెందిన సైకం మస్తాన్ గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో తన మూడేళ్ల కుమార్తె శ్రావణిని విజయవాడ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం నెంబర్ 1లోని రిజర్వేషన్ కౌంటర్ నుంచి ఎవరో అపహరించారని జీఆర్పీ పోలీసులకు తెలిపాడు. దీంతో జీఆర్పీ సీఐ రమణ తన సిబ్బందితో వెతుకులాట ప్రారంభించారు. రైల్వేస్టేషన్ బయట, పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు పాపను ఓ ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. విశాఖపట్నం వైపునకు వెళ్తున్న ఏపీ 40జడ్ 0021 బస్సులో పాప, ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించి బస్సు డ్రైవర్ ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. రాజమండ్రి జీఆర్పీ పోలీసుల సహకారంతో శుక్రవారం పాపను రక్షించి ప్రకాశం జిల్లా వేమవరానికి చెందిన బొల్లా శ్రీనివాసులు, అల్లూరి సీతారామరాజు జిల్లా వేమవరానికి చెందిన సడేల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ తరలించారు. కాగా, పాపను రూ.5 వేలకు విక్రయించానని మస్తాన్ ఒప్పుకొన్నాడు. రాజమండ్రిలో భిక్షాటన చేయించడానికి తీసుకెళ్తున్నామని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురినీ అరెస్టు చేశారు. కాగా, పాప తల్లి వెంకటేశ్వరమ్మను విజయవాడకు రప్పించి విచారణ చేయగా, మస్తాన్ తన నుంచి నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నానని, రెండు రోజుల క్రితం తన చిన్న కుమార్తె శ్రావణిని అపహరించుకుని వెళ్లాడని తెలిపింది. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన మూడో కుమార్తెను కూడా మస్తానే అమ్మేశాడని వెంకటేశ్వరమ్మ తెలిపింది.