Share News

భూ వేదన

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:04 AM

‘విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి కోసం భూసమీకరణకు భూములివ్వండి.. రాజధాని అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తాం’ అంటూ సీఆర్‌డీఏ మాటలు నమ్మి రైతుల వద్ద భూములు కొన్న ప్రైవేట్‌ వ్యక్తులు నిండా మునిగిపోయారు. గన్నవరం మండలం అజ్జంపూడి గ్రామంలో రైతుల నుంచి 52.74 ఎకరాలు కొన్న ప్రైవేట్‌ వ్యక్తులు అటు రాజధానిలో ప్యాకేజీ అందక, కౌలు లభించక పదేళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు.

భూ వేదన
అజ్జంపూడిలో ప్రైవేట్‌ వ్యక్తులు కొన్న భూములివే..

అజ్జంపూడి భూముల కొనుగోలుదారుల ఆవేదన

ఎయిర్‌పోర్టు విస్తరణ బాధితుల కోసం 59.18 ఎకరాల సేకరణ

ఆ భూములను రైతులు అమ్ముకునే అవకాశం ఇచ్చిన సీఆర్‌డీఏ

భూములు కొన్నవారికి అమరావతిలో ప్యాకేజీ ఇస్తామని హామీ

కొనుగోలుదారులకు ఎన్‌వోసీలు జారీ, ఉచిత రిజిసే్ట్రషన్లు కూడా..

పదేళ్లుగా ప్యాకేజీ, కౌలు ఇవ్వకుండా మీనమేషాలు

ఇటు భూములు లేక.. అటు ప్లాట్లు రాక కొనుగోలుదారుల ఆక్రందన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం) : గన్నవరంలోని విజయవాడ విమానాశ్రయం విస్తరణకు మొత్తం 837.69 ఎకరాలు సమీకరించాలని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. ఇందుకోసం అల్లాపురంలో 106.13, అజ్జంపూడిలో 110, బుద్దవరంలో 353.01, చిన్న అవుటపల్లిలో 143.50, కేసరపల్లిలో 125.05 ఎకరాల చొప్పున సమీకరణకు నిర్ణయించారు. సమీకరణ కింద ఇచ్చిన రైతులకు అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తామని, కౌలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మొత్తం భూముల సమీకరణ ప్రక్రియలో భాగంగా ఎంజీ బ్రదర్స్‌, ఆదిత్య వెంచర్స్‌, విజయసాయి వెంచర్స్‌లోని 552 ప్లాట్లను తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో దాదాపు 32.81 ఎకరాల మేర అవసరం కాగా, ప్లాట్లదారులతో మాట్లాడి స్థానికంగానే మరోచోట ప్లాట్‌ టు ప్లాట్‌ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం అజ్జంపూడిలో 59.18 ఎకరాలు అదనంగా సమీకరించాలని నిర్ణయించారు. ఈ భూములు ఇచ్చే రైతులకు కూడా అమరావతిలో ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ భూములను రైతులు వేరేవాళ్లకు అమ్ముకోవచ్చని ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, రాజధానిలో ప్యాకేజీ కావాలని కోరుకునే వారికే విక్రయించి రిజిస్ర్టేషన్‌ కూడా చేశారు. ఇలా రైతుల నుంచి 52.74 ఎకరాలను కొన్నవారు ఇప్పుడు బాధితులుగా మారారు.

సీఆర్‌డీఏలో అంతులేని జాప్యం

ప్రైవేట్‌ వెంచర్లలో ప్లాట్లు కోల్పోయిన వారికి ప్లాట్‌ టు ప్లాట్‌ ఇవ్వటానికి తీసుకోవాలనుకున్న 59.18 ఎకరాలను పూలింగ్‌ కింద తీసుకోవాలని అప్పటి కలెక్టర్‌ రాజబాబు సీఆర్‌డీఏ కమిషనర్‌కు లేఖ రాశారు. వీరికి రాజధానిలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఎక్కడ కల్పించాలన్న దానిపై సీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులు చర్చించుకున్నారు. మొత్తం 10 గ్రామాల పరిధిలోని లే అవుట్లలో ప్లాట్లను ఇచ్చేందుకు వీలుగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల ఊసు లేకపోవటంతో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాజధానిలో రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించాలని, కౌలు కూడా ఇప్పించాలని వేడుకున్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారమవుతుంది అనుకున్నారు. కానీ, ప్రస్తుతం సీఆర్‌డీఏ ఈ భూములతో తమకేమీ సంంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్లాట్లు కేటాయించి, కౌలు వంటివి ఇస్తారని ఆశించిన కొనుగోలుదారులకు ఇప్పటికీ ఆ ప్రయోజనాలు అందలేదు. కొనుగోలుదారులంతా చాలా చిన్నవారే. 15, 20 సెంట్లు కొన్నవారే. రాజధానిలో ప్యాకేజీ వస్తే లాభపడతామని, అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మి ఇక్కడ కొన్నారు. వీరంతా సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోగా, తాజాగా సమస్యలున్నాయని చెప్పడంతో బాధితులంతా ఆందోళన చెందుతున్నారు.

సీఆర్‌డీఏ నిర్లక్ష్యం

విమానాశ్రయం విస్తరణ కోసం మొదటి విడతగా 595 మంది రైతుల నుంచి తీసుకోవాలనుకున్న 547.34 ఎకరాలకు సంబంధించి మొదటి లాటరీ తీశారు. రెండో లాటరీని 67 మంది రైతులకు సంబంధించి 34 ఎకరాలకు తీశారు. మొత్తంగా ఇప్పటి వరకు 581.34 ఎకరాలకే లాటరీ తీశారు. 12.53 ఎకరాలకు సంబంధించి ఇంకో లాటరీ తీయాల్సి ఉంది. వెంచర్ల ప్లాట్లు కోల్పోయిన వారికి అజ్జంపూడిలో తీసుకున్న 57.18 ఎకరాలకు (మిగతా రెండెకరాలు రైతుల వద్దే ఉన్నాయి) సంబంధించి సీఆర్‌డీఏ పదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ భూములు కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో కూడా లేవు. తమ భూములకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులకు అంగీకారపత్రాలు ఇచ్చి ఊరుకున్నారు. భూములను అమ్మిన రైతులు వ్యవసాయం చే సే ప్రయత్నం చేసినా కొనుగోలుదారులు అడ్డుకున్నారు.

పదేళ్లుగా.. దయనీయంగా.. - వి.శ్రీధర్‌, బాధితుడు

అజ్జంపూడిలో 59.18 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ కింద తీసుకోవటానికి నిర్ణయించారు. ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు మాకు రాజధానిలో ప్యాకేజీ కల్పిస్తారని నమ్మాం. ఇప్పటి వరకు ప్లాట్లు కానీ, కౌలు కానీ ఇవ్వలేదు. పదేళ్లుగా జరుగుతున్న ఆలస్యం వల్ల మా కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మా కష్టార్జితంతో భూములు కొన్నాం. అప్పులు చేశాం. కొంతమంది వారి ఫ్లాట్లను కూడా అమ్ముకుని భూములు కొన్నారు. ఇప్పుడు వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరుగుతుందని ఆశించాం. సమస్య పరిష్కారానికి చొరవ చూపించట్లేదు.

Updated Date - Dec 20 , 2025 | 01:04 AM