Share News

రింగ్‌ రింగా..!

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:39 AM

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌).. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌).. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లు.. కేంద్రంగా గ్రేటర్‌ విజయవాడకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న గ్రామాలను ఎంపిక చేయడమే కాకుండా, విజయవాడను ఆనుకుని ఉన్న ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలను లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రతినిధులు, యంత్రాంగం సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో విలీన ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో పాటు విజయవాడ విస్తరణకు మార్గం ఏర్పడుతుంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

రింగ్‌ రింగా..!

ఓఆర్‌ఆర్‌, ఐఆర్‌ఆర్‌, వెస్ట్‌ బైపాస్‌ చుట్టూ గ్రేటర్‌ ప్రతిపాదనలు

ర్యాపిడ్‌ గ్రోత ఏరియాలను దృష్టిలో ఉంచుకుని కూర్పు

ఈ మూడు కీలక రహదారుల మధ్య గ్రామాలన్నీ గ్రేటర్‌లోకి..

మారనున్న విజయవాడ రూపురేఖలు.. రాజధానికి దగ్గరి దారి

ఓఆర్‌ఆర్‌ వెంబడి విలీన ప్రాంతాలు

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)తో పట్టణీకరణకు అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ విలీన ప్రాంతాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ తిప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలో కొత్తగా రెండు గ్రామాలను ప్రతిపాదించారు. కడియం పోతవరం, కవులూరును ఎంపిక చేశారు ఇబ్రహీంపట్నం మండలంలో కేతనకొండ, మూలపాడు, నవీపోతవరం, త్రిలోచనాపురం, జమీ మాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండల పరిధిలో కొత్తగా దావులూరు, గొడవర్రు, కోలవెన్ను, కొణతనపాడు, ప్రొద్దుటూరు గ్రామాలను ప్రతిపాదించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మొత్తం 12 గ్రామాలను గ్రేటర్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ప్రాంతాలు ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉండటం వల్ల భవిష్యత్తులో ఓఆర్‌ఆర్‌ను కూడా దాటుకుని విజయవాడ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది.

వెస్ట్‌ బైపాస్‌ను ఆధారంగా చేసుకుని..

గన్నవరం నియోజకవర్గంలో చిన్న అవుటపల్లి నుంచి ఎన్‌హెచ్‌-16తో అనుసంధానంగా విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ప్రారంభమవుతుంది. ఈ వెస్ట్‌ బైపాస్‌ వెంబడి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గన్నవరం మండలంలో కొత్తగా సూరంపల్లి, తెంపల్లి, వీరపనేనిగూడెం గ్రామాలను, ఉంగుటూరు మండలంలో ఆత్కూరు, పెద్ద అవుటపల్లి గ్రామాలను నిర్దేశించారు. ఇవన్నీ కూడా పశ్చిమ బైపాస్‌ దాటి ఉన్నాయి. పశ్చిమ బైపాస్‌ను ఆనుకుని ఉన్న గ్రామాలను పెద్దసంఖ్యలో ప్రతిపాదించారు. వీటిలో గన్నవరం మండలంలో కొండపావులూరు, వెదురుపావులూరు, చిన్న అవుటపల్లి, గన్నవరం, పురుషోత్తపట్నం, రామచంద్రాపురం, సావారిగూడెం, నున్న, అంబాపురం, ఫిర్యాది నైనవరం, పాతపాడు గ్రామాలను గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. మైలవరం నియోజకవర్గానికి వస్తే గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, షాబాద, వేమవరం ప్రాంతాలను గ్రేటర్‌ విలీన పరిధిలోకి తీసుకొచ్చారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఆధారంగా..

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ఉమ్మడి కృష్ణాజిల్లాకు కీలకమైన రహదారి. ఈ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని జూపూడి, కొండపల్లి, తుమ్మలపాలెం, మాల్కాపురం, పెనమలూరు, జక్కుల నెక్కలం, కేసరపల్లి, నున్న, నిడమానూరు గ్రామాలను గ్రేటర్‌ విజయవాడ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ గ్రామాల మీదుగా ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ వెళ్తుంది.

Updated Date - Dec 27 , 2025 | 12:39 AM