Share News

అమ్మ సొమ్మంటే అలుసా!

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:10 AM

అమ్మ సొమ్మంటే అందరికీ అలుసే. ఉన్న దానికి, లేనిదానికి ఇబ్బడిముబ్బడిగా, ఇష్టానుసారంగా ఇండెంట్లు పెట్టడం చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఇంద్రకీలాద్రిపై 10 రోజుల పాటు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రస్థాయి పండుగ. దీనికి ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా ఉచితంగా విధులు నిర్వహించాలి. దుర్గమ్మకు చేసుకునే సేవాభాగ్యంగా భావించాలి. అలాకాకుండా.. తాము విధులు నిర్వహిస్తున్నందుకు రూ.కోట్లలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఇండెంట్లు పెట్డడం ఏమిటో విడ్డూరంగా ఉంది. ఈ ఏడాది ఉత్సవాలకు ఏకంగా రూ.4 కోట్ల దేవస్థాన నిధులు ఖర్చు చేయించేందుకు ఇండెంట్లు రావడం విమర్శలకు తావిస్తోంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

అమ్మ సొమ్మంటే అలుసా!

దసరాకు ప్రభుత్వ శాఖల ఇండెంట్‌ ఖర్చు రూ.4 కోట్లు

కార్పొరేషన్‌, పోలీసు, మత్స్యశాఖ, ఇరిగేషన్‌, విద్యుత శాఖలవే..

రాష్ట్ర పండుగగా నిర్వహించే ఉత్సవాలకు దేవస్థానం డబ్బెందుకు?

4,500 మంది పోలీసులే ఎక్కువ.. వారికి రూ.కోటి ఖర్చా..?

తిరుమల బ్రహ్మోత్సవాల్లోనూ ఈ పద్ధతి లేదు.. ఏటా దుర్గమ్మ ఆదాయానికి కోత

మునిసిపల్‌ కార్పొరేషన్‌కు రూ.అరకోటి

ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతాలు, రోడ్లు, స్నానఘాట్లు, పార్కింగ్‌ ఏరియాలు, టికెట్‌, ప్రసాద కౌంటర్ల దగ్గర పారిశుధ్య పనులను విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది. ఈ పనులు చేయటం కార్పొరేషన్‌ బాధ్యత. ఇందుకోసం శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానం రూ.55 లక్షలు చెల్లించాలని ఇండెంట్‌ పెట్టడం ఎంతవరకు సబబు? కార్పొరేషన్‌ శానిటేషన్‌ విభాగంలో పనిచేయని పర్మినెంట్‌ శానిటరీ వర్కర్లు భారీగా ఉన్నారు. మస్తర్లు వేయించుకుంటూ తమ స్థానంలో జీతాలకు వేరేవారిని పెట్టుకుని పనిచేయిస్తుంటారు. అలాంటి వారితో కనీసం దసరా ఉత్సవాల్లో అయినా పనిచేయించాల్సింది పోయి దేవస్థానాన్ని డబ్బు అడగడం ఎంతవరకు కరెక్ట్‌ అనే వాదన వినిపిస్తోంది.

4,500 మంది పోలీసు బందోబస్తుకు రూ.కోటి

ఈ దసరా ఉత్సవాల్లో 4,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు దేవస్థానానికి సమాచారం ఇచ్చారు. కిందటి ఏడాది పోలీసు శాఖకు దేవస్థానం రూ.85 లక్షలు చెల్లించింది. ఈ ఏడాది వారి ఇండెంట్‌ బడ్జెట్‌ రూ.కోటికి పెరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా వందల సంఖ్యలో తప్ప వేలసంఖ్యలో పోలీసులు ఉండరు. అలాంటిది 4,500 మంది ఎందుకో తెలియని పరిస్థితి. దీనికోసం రాష్ట్ర నలుమూలల నుంచి ఆయా స్టేషన్ల నుంచి పోలీసులను రప్పిస్తున్నారు. తెలంగా ణాలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే పోలీసులు విధులు నిర్వహిస్తారు. కానీ, అక్కడి కమిటీ వారికి నయాపైసా చెల్లించదు.

మత్స్యశాఖ ఇండెంట్‌ రూ.35 లక్షలట..!

మత్స్యశాఖ రూ.35 లక్షలకు ఇండెంట్‌ పెట్టింది. ఫెర్రిఘాట్‌ దగ్గర బోట్లు, జాలర్లు, గజ ఈతగాళ్లను పెట్టడంతో పాటు లైఫ్‌ జాకెట్లు, రేడియం స్టిక్కర్లు, ఇతర స్టేషనరీ కొనుగోలు కోసం ఈ ఇండెంట్‌ పెట్టడం గమనార్హం. దసరా ఉత్సవాలకు, ఫెర్రిఘాట్‌కు సంబంఽధమేమిటో అర్థంకాని పరిస్థితి. ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలేవీ అక్కడ జరగవు. కిందటి ఉత్సవాల్లోనూ రూ.35 లక్షలు తీసుకున్నారు. అప్పుడు కొన్న లైఫ్‌ జాకెట్లు, రేడియం స్టిక్కర్లు ఏమయ్యాయోతెలియని పరిస్థితి ఏర్పడింది. కనీసం దేవస్థానానికి కూడా అప్పగించకుండా మళ్లీ కొత్తగా ఇండెంట్‌ పెట్టడం విడ్డూరమే. ఫీడర్లు పెడుతున్నామని విద్యుత శాఖ, తెప్పోత్సవం, ప్రకాశం బ్యారేజీపై లైటింగ్‌ కోసమని ఇరిగేషన్‌ శాఖ, బారికేడింగ్‌ ఏర్పాట్ల కోసం ఆర్‌అండ్‌బీ.. ఇలా ఏదో ఒక శాఖ అవసరం ఉన్నా, లేకపోయినా దేవస్థానం సొమ్మును ఖర్చు చేసేందుకు ఇండెంట్లు పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:10 AM