29న కనకదుర్గమ్మకు బంగారు బోనాలు
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:24 AM
సప్తమాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ పేరుతో ఈనెల 29వ తేదీన భాగ్యనగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు బోనం, పట్టువస్ర్తాలను సమర్పించనుంది.
ఇంద్రకీలాద్రి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): సప్తమాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ పేరుతో ఈనెల 29వ తేదీన భాగ్యనగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు బోనం, పట్టువస్ర్తాలను సమర్పించనుంది. ఈమేరకు బుధవారం దుర్గామల్లేశ్వర దేవస్థానం ఈవో శీనానాయక్‌కు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్, ఎంపీ గౌడ్ తదితర ప్రతినిధులు లేఖ ఇచ్చారు. బంగారు బోనాల సమర్పణకు హైదరాబా ద్ నుంచి సాంస్కృతిక బృందాలతో సహా 500 మంది భక్తులు ఈనెల 28న విజయవాడకు చేరుకుంటారని ఆయన తెలిపారు. 29వ తేదీన ఉదయం బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డి నుంచి బంగారు బోనాల ఊరేగింపు సాగుతుందని వివరించారు. వసతి, కనకదుర్గమ్మ దర్శనం, బోనం సమర్పణ, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. బోనాల కమిటీ కోరిన అన్ని ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేయాలని అధికారులకు ఈవో సూచించారు.