Share News

అయ్యో స్వామీ..!

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:27 AM

మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. వివిధ కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం గొల్లపూడిలోని 40 ఎకరాలను ప్రభుత్వం తీసుకోనుండటంతో స్వామివారి దూపదీప నైవేద్యాలకు ఆదాయం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం.. అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ భూములు తీసుకుంటున్నా.. దాని విలువ ప్రకారం దేవస్థానం అకౌంట్‌లో డబ్బు జమ చేయాలని భక్తులు కోరుతున్నారు.

అయ్యో స్వామీ..!
గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయం

గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ భూములు ప్రభుత్వం స్వాధీనం

గొల్లపూడిలోని రూ.400 కోట్ల ఆస్తి ఇతర ప్రయోజనాలకు మళ్లింపు

ఏటా ఆ భూముల ఆదాయంపైనే స్వామివారి దూపదీప నైవేద్యాలు

భూములు ప్రభుత్వం తీసుకోవడంతో ఆలయ నిర్వహణకు ఇబ్బందులు

విలువ ప్రకారం ఆలయ అకౌంట్‌లో డబ్బు జమచేయాలని భక్తుల వినతి

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన రూ.కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆలయానికి 71 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 39 ఎకరాల 99 సెంట్లు గొల్లపూడిలో ఉంది. ఈ భూమిని కొందరు కౌలుదారులు సాగు చేసుకుంటున్నారు. వేలంలో పాడుకున్న విధంగా దేవస్థానానికి కౌలు చెల్లిస్తున్నారు. గొల్లపూడిలోని ఈ భూమిని రెండుదశల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. మొదటి దశలో ఐదు ఎకరాల భూమిని గోల్ఫ్‌ రేంజ్‌కు ఇచ్చింది. క్రీడలు, టూరిజం, ఇతర కార్యక్రమాలకు దీనిని వినియోగించనున్నారు. ఇందుకు జీవో జారీ చేయనున్నారు. రెండోదశలో మరో 35 ఎకరాలను ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు వినియోగించనున్నారు. ఇందుకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి లేఖ రాశారు.

నాటి ధర్మకర్త దాతృత్వం

వేంకటేశ్వరస్వామి ఆలయానికి నాటి న్యాయవాది ఏసీ ఉడయవర్లు వంశపారంపర్య ధర్మకర్తగా ఉండేవారు. నాడు ఒక్క ఉడయవర్లు మాత్రమే 71 ఎకరాల ఆస్తులను పరిరక్షించారు. ఆయన మృతిచెందాక ఈ ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. కార్యక్రమాల నిర్వహణ సన్నగిల్లింది.

ఒకసారి చెర వీడినా..

గతంలో ఈ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం దత్తత తీసుకుంది. ఆ సమయంలో దుర్గగుడి అధికారులు గొల్లపూడిలోని 40 ఎకరాల్లో క్వార్టర్లు, కార్యాలయాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ సమయంలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి భక్తుల గోడును ‘ఆంధ్రజ్యోతి’ వినిపించింది. ఆ కథనంతో వేంకటేశ్వరస్వామి దేవాలయం.. దుర్గగుడి నుంచి దేవదాయశాఖకు రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గొల్లపూడిలోని భూములను సాగు చేసుకుంటున్న కౌలురైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఐదు ఎకరాల భూమిని మెరక చేస్తున్న నేపథ్యంలో కొందరు ఎస్టీ కౌలు రైతులు ఆందోళనకు దిగుతున్నారు.

ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆదాయం ఎలా?

గొల్లపూడిలోని అత్యంత విలువైన ఆ 40 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆలయ ఆదాయానికి గండి పడనుంది. 71 ఎకరాలకు ఇప్పటికే నామమాత్రంగా సంవత్సరానికి రూ.10 లక్షల ఆదాయం వస్తోంది. గొల్లపూడిలోని 40 ఎకరాల నుంచి రూ.ఐదారు లక్షల కంటే ఎక్కువ ఆదాయం రావట్లేదు. ఇక్కడ ఎకరం రూ.10 కోట్లు ఉండగా, 40 ఎకరాల విలువ రూ.400 కోట్ల వరకూ ఉంటుంది. దేవాలయ అభివృద్ధికి దాతలు ఇచ్చిన భూములను ఆలయ ప్రయోజనాల కోసం వినియోగించాలి. అలాకాకుండా ప్రభుత్వం భూమి తీసుకుంటే ఆలయ నిర్వహణ ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇలా చేస్తే మంచిది

నిమ్మలూరులోని బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూములను గతంలో బెల్‌ కంపెనీ తీసుకుంది. దీనిపై ఆ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ముత్తేవి రవికాంత కోర్టును ఆశ్రయించారు. ఆ భూములను కొనుగోలు చేసిన ప్రతిఫలాన్ని ఆలయానికి అందజేయడంతో కేసు వెనక్కి తీసుకున్నారు. బెల్‌ కంపెనీ భూములు తీసుకున్నప్పటికీ బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.12 కోట్ల డిపాజిట్లు చేకూరాయి. గొడుగుపేట ఆలయ భూములకు కూడా మార్కెట్‌ రేటుకు కొని దేవాలయ అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలని భక్తులు కోరుతున్నారు. కాగా, దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావును వివరణ కోరగా, తనకు ఇప్పుడే ఈ సంగతి తెలిసిందన్నారు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తాం.. : ధర్మకర్తల మండలి

దీనిపై మూడు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్‌ వడ్లమూడి లక్ష్మీనరసింహారావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించింది. సమస్యను మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:27 AM