Share News

మెట్రోకు మంచి తరుణం

ABN , Publish Date - May 15 , 2025 | 01:04 AM

విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టు పనులు ఊపందుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన రుణాల మంజూరు వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. తాజాగా విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి ఆసియన్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ముందుకురావడం, మరికొన్ని సంస్థలు కూడా క్యూలో ఉండటంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెట్రోకు మంచి తరుణం
ఏఐఐబీ ప్రతినిధులను సన్మానిస్తున్న ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి

రుణం ఇచ్చేందుకు ప్రపంచ సంస్థల క్యూ

రూ.5,990 కోట్ల రుణానికి ఏఐఐబీ ఓకే

తక్కువ వడ్డీ, షరతులు నామమాత్రమే

ఏపీఎంఆర్‌సీ అధికారులతో ఏఐఐబీ భేటీ

బందరురోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల పరిశీలన

రుణం ఇవ్వటానికి మరిన్ని సంస్థల ఆసక్తి

ఏఐఐబీవైపే మెట్రో అధికారుల మొగ్గు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు ఆసియన్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) రూ.5,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు రుణాన్ని ఇవ్వటానికి జైకా, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఎన్‌డీబీ, ఏఎఫ్‌డీ, కేఎఫ్‌డబ్ల్యూ వంటి సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వీటన్నింటిలో ఏఐఐబీ సంస్థ అతి తక్కువ వడ్డీకి ఇబ్బందికర షరతులు లేని రుణాలను ఇస్తామని పేర్కొంది. దీంతో ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు చైనా ప్రధాన కేంద్రం కలిగిన ఈ సంస్థకు ఆహ్వానం పలికారు. మంగళవారం చర్చలు కూడా జరిగాయి. ఏఐఐబీ ప్రతినిధులు సంతోష్‌, పాస్కల్‌ రసెల్‌.. ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు. విజయవాడ మెట్రో కారిడార్‌-1, 2 గురించి వివరించారు. సమావేశం అనంతరం ఏఐఐబీ ప్రతినిధులు మెట్రో కారిడార్‌ రోడ్లను పరిశీలించారు. రామకృష్ణారెడ్డి వారిని వెంట తీసుకెళ్లి చూపించారు. కారిడార్లను పరిశీలించిన అనంతరం విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ ప్రతినిధులు అంగీకరించారు. విజయవాడ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా ఈ రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ సంస్థ ఇచ్చే రుణాన్ని 35 ఏళ్ల వరకు తీర్చుకునే వెసులుబాటు ఉంది. జైకా సంస్థ అయితే 40 ఏళ్ల వరకు రుణం తీర్చుకునే అవకాశం కల్పించినా ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయి. అలాగే, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, ఫ్రాన్స్‌కు చెందిన ఏఎఫ్‌డీతో పాటు ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ), ప్రపంచ బ్యాంకు (డబ్ల్యూబీ) వంటి సంస్థలను కూడా ఆహ్వానించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

సీఎంపీ సర్వే పూర్తి

విజయవాడ మెట్రో ప్రాజెక్టు తొలిదశ పనులకు కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) సర్వేకు ఆదేశించిన నేపథ్యంలో కన్సల్టెంట్‌ను నియమించి సర్వే పూర్తిచేశారు. ప్రస్తుతం సంస్థ ప్రతినిధులు ఢిల్లీలో రిపోర్టులు తయారు చేస్తున్నారు. అవి రాగానే, ఏపీఎంఆర్‌సీ అధికారులు కేంద్రానికి నివేదిక పంపిస్తారు.

మెట్రో కన్సల్టెంట్‌కు టెండర్లు

మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ అధికారులు కన్సల్టెంట్‌ నియామకానికి టెండర్లు పిలిచారు. టెండర్లలో ఖరారైన కన్సల్టెన్సీ సంస్థ ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తుంది. గతంలో ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) చైర్మన్‌ శ్రీధరన్‌ను ప్రభుత్వ మెట్రో సలహాదారుగా నియమించారు. దీంతో ఆయనే కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం డీఎంఆర్‌సీ భాగస్వామ్యాన్ని తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోవటంతో కన్సల్టెన్సీని నియమించుకోవాలని ఏపీఎంఆర్‌సీ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - May 15 , 2025 | 01:04 AM