Share News

చాటింగ్‌.. డేటింగ్‌.. జంపింగ్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:56 AM

జల్సాలకు అలవాటు పడ్డాడు.. క్రికెట్‌ బెట్టింగులకు బానిసయ్యాడు.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు.. డేటింగ్‌ యాప్‌లో రిజస్టర్‌ అయ్యాడు.. యువతులకు వల విసిరేవాడు.. హాయ్‌.. అంటూ మాట కలిపేవాడు.. తొలుత కొంత నగదు వారికి పంపించేవాడు.. యువతులకు నమ్మకం కుదిరాక వారితో సన్నిహితంగా ఉండేందుకు కొంత మొత్తంలో ఆఫర్‌ చేసేవాడు.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఉండగా బంగారం, నగదుతో ఉడాయించేవాడు. చిన్న వయస్సులోనే ఘరానా దొంగత నాలకు పాల్పడుతున్న ఓ యువకు డిని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

చాటింగ్‌.. డేటింగ్‌.. జంపింగ్‌

పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు

నగర యువతితో చాటింగ్‌.. డేటింగ్‌ ప్రపోజల్‌

ఏకాంత సమయంలో చేతులు, కాళ్లు కట్టేసి బంగారంతో జంప్‌

గతంలోనూ ఇద్దరిని మోసంచేసిన హైదరాబాద్‌ యువకుడు

దొంగిలించిన డబ్బుతో క్రికెట్‌ బెట్టింగ్‌లు

విజయవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌కు చెందిన కిలారు నాగతేజ (23) బీటెక్‌ మూడో సంవత్సరం మధ్యలోనే మానేశాడు. తల్లిదండ్రులు వంట పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరి స్వగ్రామం బాపట్ల కాగా, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగతేజ అడ్డదారులు తొక్కాడు. డేటింగ్‌ యాప్‌లు, ఇన్‌స్టాలోనూ యువతులతో చాటింగ్‌ చేసి మోసానికి తెరతీసేవాడు. అలాగే, ఈనెల 22న మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌కు నగరానికి చెందిన యువతితో వెళ్లాడు. ఏకాంత సమయంలో ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు. అనంతరం ఆ యువతికి చెందిన 20 గ్రాముల బంగారాన్ని, కొంత నగదు తీసుకుని ఉడాయించాడు. అనంతరం ఆ బంగారాన్ని నగరానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించి గుంటూరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరబాద్‌కు రైల్లో వెళ్లిపోయాడు. బంగారం అమ్మగా వచ్చిన నగదుతో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడాడు. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న మాచవరం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో పాటు మెయిల్‌ ఐడీ ద్వారా జల్లెడ పట్టారు. చివరికీ నాగతేజ ఆచూకీ హైదరాబాద్‌లో ఉందని తెలిసింది. శుక్రవారం నాగతేజను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువతులను మోసంచేసి నగదుతో పారిపోయిన ఇతను చర్లపల్లి జైల్లో శిక్ష కూడా అనుభవించాడు.

Updated Date - Apr 26 , 2025 | 12:56 AM