కాల్వల మరమ్మతులు సకాలంలో చేయించండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:08 AM
రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఇబ్బంది పడకుండా పంటకాలువలు, డ్రెయినేజీలు, కాలువల నిర్వహణ (ఓ అండ్ ఎం)పనులు సకాలంలో చేయించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా విభాగం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

మచిలీపట్నం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఇబ్బంది పడకుండా పంటకాలువలు, డ్రెయినేజీలు, కాలువల నిర్వహణ (ఓ అండ్ ఎం)పనులు సకాలంలో చేయించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా విభాగం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం డీఆర్వో కె.చంద్రశేఖరరావుకు వారు వినతిపత్రం అందించారు. ఖరీ్‌ఫ సాగు నిమిత్తం సకాలంలో సాగునీటిని విడుదల చేయాలని, ఈ వేసవిలో కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, నాచు, తూడు, కిక్కిసలను తొలగించాలని, కాలువగట్లు బలహీనంగా ఉన్న చోట్ల గట్లను బలోపేతం చేయాలని వారు కోరారు. బందరు, ఏలూరు, రైవస్, కేఈబీ కాలువలు విజయవాడ నుంచి వస్తున్నాయని, కాలువగట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు వ్యర్థాలను నేరుగా ఈ కాలువల్లోకి విడుదల చేస్తున్నారని, దీంతో కలుషితమైన నీటినే జిల్లాలోని దిగువప్రాంతాల ప్రజలు తాగునీటిగా వినియోగిస్తున్నారని వారు వివరించారు. కాలువగట్లపై ఆక్రమణలను తొలగించాలని అర్జీలో పేర్కొన్నారు. భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల దుర్గామల్లేశ్వరరావు, బందరు మండల అధ్యక్షుడు దేవనబోయిన ప్రసాద్, మొవ్వ మండల అధ్యక్షుడు కొలుసు కుటుంబరావు, గూడూరు మండల అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, పామర్రు మండల అధ్యక్షుడు డి.బసవయ్య, కె.సూర్యకళ పాల్గొన్నారు.