Share News

ముం‘చెత్త’గా..

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:56 AM

చెత్త.. చెత్త.. చెత్త.. నగరంలో ఎక్కడచూసినా చెత్తకుప్పలే. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని పారిశుధ్య కార్మికులు ఐదు రోజులుగా సమ్మె చేస్తుండటంతో వీధుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. తొలగించేవారు లేక ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయాయి. గురువారం వర్షం కూడా తోడవటంతో దోమల వ్యాప్తి పెరిగింది. సీఐటీయూ అనుబంధ మున్సిపల్‌ కార్మికులు దాదాపు 4 వేల మంది ఇప్పటికే సమ్మెలో పాల్గొంటుండగా, ఏఐటీయూసీ అనుబంధ కార్మికులు మరో 4 వేల మంది కూడా సమ్మె చేయడానికి సిద్ధమవుతుండటంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.

ముం‘చెత్త’గా..
రాజీవ్‌గాంధీ పార్కు వద్ద రోడ్డు మీద పేరుకుపోయిన చెత్త

నగరంలో పేరుకుపోయిన చెత్త

ఐదు రోజులుగా వీఎంసీ పారిశుధ్య కార్మికుల సమ్మె

సమ్మెలో పాల్గొంటున్న సుమారు 4 వేల మంది కార్మికులు

మరో 4 వేల మంది పాల్గొనేందుకు సిద్ధం

చెత్త తొలగించేవారు లేక అస్తవ్యస్త వాతావరణం

వర్షం కూడా తోడవడంతో ఒకటే కంపు

పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

(ఆంధ్రజ్యోతి, కార్పొరేషన్‌) : తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ప్రత్యామ్నాయ సిబ్బందితో పనిచేయిస్తున్నా పూర్తిస్థాయిలో చెత్త సేకరించే వారు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. చెత్త పేరుకుపోయి కంపు కొడుతుండగా, గురువారం కురిసిన వర్షానికి ఆ వ్యర్థాలన్నీ చెల్లాచెదురయ్యాయి. సైడ్‌ డ్రెయిన్లకు అడ్డుపడటంతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు చెరువులను తలపించింది. నగరంలో సుమారు వెయ్యి టన్నుల చెత్త పేరుకుపోయిందని అంచనా. వర్షాలు కురుస్తుండటం, చెత్త పేరుకుపోవడంతో దోమల వ్యాప్తి పెరిగింది. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయి.

100 టన్నుల చెత్తతో అవస్థలు

నగరపాలక సంస్థలో సుమారు 4వేల మంది ఆప్కాస్‌ సిబ్బంది సమ్మెలో ఉన్నారు. నగర వ్యాప్తంగా రోజుకు 500 టన్నుల చెత్త వస్తుంది. రెండు రోజుల నుంచి క్లాప్‌ వాహనాలు నిలిచిపోవడంతో సుమారు 140 ప్రైవేట్‌ ట్రాక్టర్లతో డోర్‌ టు డోర్‌ చెత్త, ప్రధాన రహదారుల వెంబడి చెత్తను తరలిస్తున్నారు. రోజుకు సుమారు 400 టన్నుల మేర తరలిస్తున్నారు. వీఎంసీ పర్మినెంట్‌ సిబ్బంది 472 మంది, రోజువారీ కూలీలు 400 నుంచి 500 మంది, ఇతర సిబ్బందితో పనులు చేపడుతున్నా ఇంకా సుమారు 100 టన్నుల చెత్త మిగిలిపోతోంది.

కొండ ప్రాంతాల్లో కష్టాలు

కొండప్రాంతాల్లో చెత్త ఎక్కువగా ఉండిపోతోంది. కొత్తపేట, ఆంజనేయవాగు, చిట్టినగర్‌, పాలఫ్యాక్టరీ, చెరువు సెంటర్‌, కబేళా వద్ద కొండ ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ చెత్త కలెక్షన్‌ నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాలకు సీఎన్‌జీ ఆటోలు వెళ్లే అవకాశం లేకపోవడంతో భారీగా పేరుకుపోతోంది. అలాగే ఉండిపోయిన చెత్త కాల్వల్లోకి చేరి నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది.

మంచినీటి సమస్య బాబోయ్‌

నగరంలో మంచినీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమ్మెలో మూడు సర్కిళ్లకు చెందిన 300 మంది మంచినీటి సరఫరా కార్మికులు కూడా పాల్గొన్నారు. దీంతో ఆయా సర్కిళ్ల పరిధిలో మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సర్కిల్‌కు 60 మంది వాటర్‌ సప్లయ్‌ వాల్స్‌ తిప్పే కార్మికులున్నారు. ఐదు రోజులుగా మూడు సర్కిళ్లలో వాటర్‌ సప్లయ్‌ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో కొండప్రాంతాల్లో సమస్య తీవ్రమైంది. కొన్ని ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు నీటిని అందిస్తున్నా సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, అధికారులు కార్మికులతో మాట్లాడి సమ్మె విరమింపజేయాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:56 AM