‘లెక్క’లేకుండా..
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:51 AM
దశాబ్దకాలంగా సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇచ్చిన నిధులు దుర్వినియోగానికి గురైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. డీఎంఈ కార్యాలయంలోని ఓ అధికారి అండతో సిద్ధార్థ మెడికల్ కాలేజీలోని ఉద్యోగులు కొందరు భారీగా ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాదాపు దశాబ్దకాలంగా ఖర్చులకు సంబంధించిన వివరాలు ఇవ్వట్లేదని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు.. సిద్ధార్థ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వటంతో ఈ వ్యవహారం బయటపడింది.
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో నిధుల గోల్‌మాల్
ఎన్టీఆర్ యూనివర్శిటీ నుంచి ఇచ్చిన డబ్బుకు లెక్కల్లేవ్..!
2013-2020 వరకు గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపణలు
2020-2025 వరకు ఇచ్చిన నిధుల్లోనూ అవకతవకలు
లెక్కలు అప్పగించాలంటూ ఎన్టీఆర్ వర్శిటీ నోటీసులు
డీఎంఈ కార్యాలయంలోని అధికారి అండతోనేనా?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోని ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి కాలేజీకి నిధులు కేటాయిస్తారు. ఇలా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇన్విజిలేటర్లకు ఇచ్చే సొమ్ములో భారీగా అవకతవకలు జరిగినట్టు వెలుగుచూసింది. దాదాపు రూ.అరకోటి మేర గోల్‌మాల్ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ తతంగం 2013 నుంచి ఇప్పటివరకు జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ అధికారి లెక్కలు అప్పగించటంతో ఈ బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి.
గోల్‌మాల్ ఎలా..?
2013 నుంచి 2020 వరకు సుమారు రూ.కోటి నిధులు అందించామని, ఇప్పటి వరకు వాటికి లెక్కలు చెప్పలేదని ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజీ యాజమాన్యానికి తాఖీదులు అందాయి. ఈ నేపథ్యంలో నెలలో అకౌంట్ల లావాదేవీలు తేల్చాలని సిద్ధార్థ మెడికల్ కాలేజీ యాజమాన్యం సంబంధిత ఉద్యోగిని ఆదేశించింది. ఆ ఉద్యోగి లెక్కలు అప్పగించి వెళ్లిపోయారు. ఈ నివేదిక ద్వారా పదేళ్లుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఇచ్చిన డబ్బుకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యయ నివేదికలను సమర్పించలేదని తెలిసింది.
ఆ సీనియర్ అసిస్టెంట్ ఎవరు?
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గతంలో ఒక సీనియర్ అసిస్టెంట్ యూనివర్శిటీ నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నిధుల ఖర్చుకు సంబంధించి ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వకపోవటంతో ఆ సీనియర్ అసిస్టెంట్‌కు చార్జిమెమో ఇచ్చారు. ఆ ఉద్యోగిపై మే నెలలో విచారణ కూడా జరిపారు. ఆ తర్వాత ఇన్‌చార్జిగా వచ్చిన వ్యక్తి కూడా నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు అప్పగించనట్టు తెలుస్తోంది. కాలేజీ ఎగ్జామినేషన్ అకౌంట్‌కు తన సొంత అకౌంట్ నుంచి చలానా రూపంలో ఓ ఉద్యోగి డబ్బు కట్టిన ఉందంతం తాజాగా వెలుగుచూసింది. అలాగే, దారి మళ్లించిన కొంత డబ్బును కూడా ఇటీవల తిరిగి చెల్లించినట్టుగా తెలుస్తోంది. వైద్యులు, సిబ్బందికి పేమెంట్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు వారి పాత సంతకాలను ఫోర్జరీ చేయటంతో పాటు రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
2020-2025 చెల్లింపుల్లోనూ అవకతవకలు
2020-2025 వరకు జరిగిన చెల్లింపుల్లో కూడా భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులకు సంబంధించి కూడా పేమెంట్లు ఇచ్చినట్టుగా దొంగ సంతకాలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి స్టేట్‌మెంట్లు పంపినట్టు తెలుస్తోంది. ఈ నిధుల దుర్వినియోగం వెనుక డీఎంఈ కార్యాలయంలో ఉన్న ఓ అధికారి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, సిద్దార్థ మెడికల్ కాలేజీ అధికారుల పాత్రపైనా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది.