జిల్లాలో మొదలైన ఉచిత బస్సు ప్రయాణం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:34 AM
శ్రావణ శుక్రవారం... మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ‘సీ్త్ర’కారం చుట్టారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సిటీ బస్‌పోర్టు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సీ్త్రశక్తి పథకాన్ని ప్రారంభించగా, పలువురు మహిళలు మొదటిరోజు ఆనందంగా ప్రయాణం చేశారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లాలో 22 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.
పీఎన్‌బీఎస్ వేదికగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 22 లక్షల మందికి ప్రయోజనం
మొదటి రోజే నడిచిన ఐదు ప్రత్యేక బస్సులు
బస్సుల్లో ప్రయాణించి హర్షం వ్యక్తంచేసిన మహిళలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల నుంచి నిత్యం మహిళలు జీవనోపాధి కోసం విజయవాడ వస్తుంటారు. ఇలాంటి మహిళలకు దూరాభారాన్ని బట్టి నెలకు రవాణా ఖర్చే రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణంతో వారందరికీ కాస్త ఆర్థిక ఉపశమనం లభించనుంది. కేవలం సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సులే కాకుండా ఆల్ర్టా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్రస్థాయిలో దూరప్రాంతాలకు కూడా అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని అన్ని వయస్కుల మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరుకార్డు, మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 763 బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకానుంది. 260 పల్లెవెలుగు బస్సులు, 53 ఆల్ర్టా పల్లెవెలుగు బస్సులు, 254 సిటీ ఆర్డినరీ బస్సులు, 111 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 85 ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. దీనిద్వారా ఏటా రూ.360 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు భరించనుంది.
ఆ ఐదు బస్సుల్లో..
ఈ పథకం కోసం ఆర్టీసీ ఐదు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ఆయన టాటా.. కూడా చెప్పారు. మొదటి సిటీ ఆర్డినరీ బస్సును గుంటుపల్లి వరకు, రెండో పల్లెవెలుగు బస్సును జి.కొండూరు వరకు, మూడో ఆల్ర్టా పల్లెవెలుగు బస్సును పరిటాల వరకు, నాల్గో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను తుమ్మలపాలెం వరకు, ఐదో ఎక్స్‌ప్రెస్ సర్వీసును కంచికచర్ల వరకు నడిపారు.
మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం
- ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్
బస్టేషన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ అన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో శుక్రవారం సీ్త్రశక్తి పథక ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారన్నారు.
మహిళలకు దక్కిన గౌరవం
ప్రభుత్వం మహిళలకు గౌరవం కల్పించింది. అభినందనలు తెలుపుతున్నాను. ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు ఇది ఎంతో వెసులుబాటు. సీ్త్ర శక్తి పేరు పెట్టడం బాగా నచ్చింది. - జక్కుల మల్లీశ్వరి
ఎంతో మంచి చేశారు
మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో మంచి చేశారు. ఆటోవాలాలు అభ్యంతరాలు పెడుతుంటే ఈ పథకం ఇవ్వరేమో అనుకున్నా. కానీ, ప్రభుత్వం తన మాట ప్రకారం నడుచుకుంది. చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల సగటున కుటుంబంపై రూ.2 వేల వరకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. - ఎస్.స్రవంతి