Share News

చీటీంగ్‌

ABN , Publish Date - May 30 , 2025 | 01:15 AM

కూలీల ఆర్థిక అవసరాలకు ఉపయోగపడేలా చీటీలు నడిపాడు ఓ వ్యక్తి. మన ప్రాంతానికి చెందిన వ్యక్తే కదా.. అని ఆ కూలీలంతా చీటీలు వేశారు. తీరా.. కొన్నాళ్లకు రూ.50 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. కొద్దినెలల క్రితం మధురానగర్‌లో జరిగిన ఘటన ఇది. యాడ్‌ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ వచ్చిందని నమ్మించాడు మరో వ్యక్తి. పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో రెట్టింపు అవుతుందని నమ్మించాడు. ఏ జాతీయ బ్యాంకు ఇవ్వని విధంగా ఇస్తుండటంతో ఒక్కొక్కరూ రూ.లక్షల్లో పెట్టుబడి పెట్డారు. తర్వాత చెల్లింపులు ఆపేసి నగరం విడిచిపోయాడు. అతడే యూపిక్స్‌ సంస్థ అధినేత నిడుమోలు కిరణ్‌. తాజాగా ఓపక్క బంగారం, మరోపక్క నగదు చీటీలు నిర్వహించి జనాన్ని నిలువునా ముంచేశాడు ముచ్చెర్ల శ్రీనివాసరావు. ప్రజల ఆశలను ఒక ఆయుధంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి మోసాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

చీటీంగ్‌
విదేశీ పర్యటనలో శ్రీనివాసరావు దంపతులు (ఫైల్‌)

ఆర్థిక వ్యవహారాలే టార్గెట్‌గా నగరంలో మోసాలు

చీటీలు, బంగారం పథకాలతో ప్రజలకు ఎర

ముందు నమ్మకం కలిగించి.. తర్వాత నట్టేట ముంచేసి..

రూ.కోట్లతో ఉడాయిస్తున్న నయవంచకులు

నిన్న రూ.కోట్లతో జంప్‌ అయిన యూపిక్స్‌ అధినేత

తాజాగా ముచ్చెర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి మోసం

చీటీలు, బంగారం పథకాల్లోని రూ.కోట్ల డబ్బుతో జంప్‌

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇటీవల.. నగరానికి చెందిన యూపిక్స్‌ అధినేత నిడుమోలు కిరణ్‌ ప్రజలను నమ్మించాడు. పెట్టుబడికి రెట్టింపు చెల్లింపులు చేస్తానంటూ ఆశచూపి రూ.100 కోట్ల వరకు జనానికి సున్నం రాశాడు. డబ్బుతో జంప్‌ అయిన కిరణ్‌ పోలీసులకు చిక్కకుండా ఇంకా ఖాతాదారులను నమ్మించడానికి సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు అయోధ్యనగర్‌లోని లోటస్‌ ల్యాండ్‌మార్క్‌కు చెందిన ముచ్చెర్ల శ్రీనివాసరావుది ఇదే పరిస్థితి. ఏకంగా బంగారం బిస్కట్లతోనే చీటీలు నిర్వహించి ఖాతాదారులకు ఝలక్‌ ఇచ్చాడు.

ఎవరీ శ్రీనివాసరావు?

ముచ్చెర్ల శ్రీనివాసరావుకు జనాన్ని మోసం చేయడం కొత్తేమీ కాదు. జనాన్ని నమ్మించి వారి డబ్బుతో విలాసవంతంగా గడపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎరువుల వ్యాపారం చేశాడు. అక్కడ వ్యాపారంలో పెట్టుబడికి తెలిసిన వారి నుంచి అప్పులు తీసుకుని ఐపీ పెట్టాడు. తర్వాత అక్కడి నుంచి కుటుంబం సహా విజయవాడకు మకాం మార్చాడు. అయోధ్యనగర్‌ లోటస్‌లో ఒక ఫ్లాట్‌ను కొన్నాడు. 16 సంవత్సరాలుగా లోటస్‌లోనే ఉంటున్నాడు. విజయవాడలో ఒక మాజీమంత్రికి ఉన్న ముఖ్య అనుచరుల్లో శ్రీనివాసరావు ఒకడు. ఆయన ప్రారంభించే బంగారం, నగదు చీటీలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్రముఖ జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన అగ్ర నటుడితో ఫొటో దిగాడు. దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుని, ఆ సంస్థ పేరును వాడుకుని ఖాతాదారులను ఆకర్షించాడు. శ్రీనివాసరావు కుమారుడు జపాన్‌లో ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం కుమార్తెకు విజయవాడలో అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. అనధికారికంగా నిర్వహించిన స్కీమ్‌ల ద్వారా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆస్తులను సంపాదించించాడు. కాగా, శ్రీనివాసరావు భార్యను అజితసింగ్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. అతడి కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో పారిపోయిన శ్రీనివాసరావు న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిసింది.

ఎస్‌వోపీని రూపొందిస్తున్నాం : ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు కమిషనర్‌

అనధికారికంగా నిర్వహిస్తున్న చీటీలు, బంగారం స్కీమ్‌ల్లోకి దిగి ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఇద్దరు.. ప్రజలను మోసం చేశారు. నగరంలో అనధికారికంగా చీటీలు, ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తున్న 40 మందిని గుర్తించాం. వారందరినీ త్వరలో పిలిపిస్తాం. ఆ సంస్థల్లో ఉన్న ఖాతాదారులను పిలిపించి సమావేశం నిర్వహిస్తాం. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన సొమ్ముకు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ముకు లెక్కలు సరిపోయాయో లేదో చూస్తాం. స్కీమ్‌లు, చిట్టీలకు సంబంధించి ఒక ఎస్‌వోపీని రూపొందిస్తున్నాం.

ప్రభుత్వం న్యాయం చేయాలి.. విలేకరుల సమావేశంలో ముచ్చర్ల శ్రీనివాసరావు బాధితులు

అజితసింగ్‌నగర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : గోల్డ్‌ చీటీల పేరుతో ముచ్చర్ల శ్రీనివాసరావు నమ్మించి నట్టేట ముంచాడని, ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని గోల్డ్‌ చీటీల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు గురువారం అజితసింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల నిమిత్తం చీటీలు వేసి మోసపోయామని, కోట్లాది రూపాయలు సొమ్మును దోచిన శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ కల్పించుకుని శ్రీనివాసరావు నుంచి సొమ్ము రికవరీ చేసి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - May 30 , 2025 | 01:15 AM