పునః సంకల్పం
ABN , Publish Date - May 02 , 2025 | 01:12 AM
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చరిత్రలో మరో సువర్ణాధ్యాయానికి నేడు తెరలేవనుంది. ఐదేళ్ల బానిస సంకెళ్లను తెంచుకుని సంకల్ప బలంతో ముందుకుసాగే సమయం వచ్చేసింది. చిట్టడవి నుంచి చరిత్రలో లిఖించే స్థాయికి చేరుకునే శుభ ముహూర్తం కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ‘అమరావతి 2.0’కు శ్రీకారం చుట్టనుండటంతో సర్వత్రా పండుగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల జనాభా తరలివస్తుండగా, రాజధాని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏర్పాట్లు కూడా భారీస్థాయిలో ఉండటం, అమరావతితో పాటు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండటంతో అంతటా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమరావతి అడ్డంకులకు చెల్లు.. అక్రమాలకు చెల్లు.. ఇకపై అన్నీ మంచి శకునములే.. శుభసూచకములే.. అంటూ హర్షిస్తున్నారు.
నేటి మధ్యాహ్నం రాజధాని రానున్న ప్రధాని నరేంద్రమోదీ
అందంగా ముస్తాబైన రాజధాని ప్రాంతాలు, రహదారులు
ఇప్పటికే పూర్తయిన భారీ సభా వేదికలు, పైలాన్
కూటమి జెండాలతో కళకళలాడుతున్న ప్రధాన రోడ్లు
కేంద్ర బలగాల పర్యవేక్షణలో సభా ప్రాంగణం
రాజధాని రైతులకు ప్రాధాన్యం.. సింహభాగం గ్యాలరీలు
రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
మొత్తం 3 వేల బస్సుల్లో తరలిరానున్న ప్రజలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేక గ్యాలరీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ గురువారం మధ్యాహ్నానికే కొలిక్కి వచ్చాయి. సభా ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. మూడు పొడవాటి వాటర్ ప్రూఫ్ టెంట్లతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. మధ్యలో ఉన్న టెంట్‌కు అభిముఖంగా ప్రధాన వేదిక ఉంటుంది. ఒకవైపు ప్రత్యేక ఆహ్వానితులకు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలకు చోటు కల్పించారు. మధ్యలో ఉన్న ప్రధాన వేదిక వద్ద డీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్ దాటి లోపలికి ఎవరూ ప్రవేశించలేనంతగా ఏర్పాట్లు జరిగాయి. డీ సర్కిల్‌కు ముందుగా వీవీఐపీలకు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియాకు మరోవైపు గ్యాలరీలు ఇచ్చారు. ఈ గ్యాలరీల వెనుక వైపు ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రింట్ మీడియా, సీనియర్ ఆఫీసర్లకు గ్యాలరీలు ఇచ్చారు. రెండో వరుస గ్యాలరీ తర్వాత రాజధాని రైతుల గ్యాలరీలు ఇచ్చారు. మొదటి వేదికలో కూడా రాజధాని రైతులకు గ్యాలరీలు ఉన్నాయి. మూడో వేదికలో సాంస్కృతిక బృందానికి, పారిశ్రామికవేత్తలకు, ఇతర వీఐపీలకు మొదటి, రెండు గ్యాలరీలు కేటాయించారు. మిగిలిన గ్యాలరీలన్నీ ప్రజలకు కేటాయించారు. సభలో సగభాగం అమరావతి రైతులకే సీట్లు ఇచ్చారు. వేదిక వెనుక వైపు ప్రధానమంత్రి కాన్వాయ్ ఆగటానికి పార్కింగ్ ప్లేస్ సిద్ధం చేశారు. అమరావతి పైలాన్ వెనుక హెచ్‌పీఎం రోడ్డును ఆనుకుని పీఎం కార్ల పార్కింగ్ ఉంటుంది. దీనికి కూతవేటు దూరంలో సీఎం గ్రీన్‌రూమ్, మంత్రుల గ్రీన్‌రూమ్స్, సీఎంవో రూమ్, డిప్యూటీ సీఎం రూమ్, ప్రభుత్వ అధికారుల రూమ్, ప్యాంట్రీ ఉంటాయి. వేదిక వెనుకభాగంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది.
భారీగా బారికేడ్లు
రాష్ట్ర నలుమూలల నుంచి కూటమి కార్యకర్తలు, ప్రజలు, అమరావతి రైతులు భారీ సంఖ్యలో అమరావతికి వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను సభా ప్రాంగణంలోకి ఓ పద్ధతి ప్రకారం పంపించేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలు తరలివస్తారన్న అంచనాలు ఉండటంతో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు బారికేడ్లతో ప్రజలను మళ్లిస్తారు. ఏ గ్యాలరీలోకి వెళ్లాల్సిన వారు ఆ గ్యాలరీలోకి వెళ్లేలా చూస్తారు. ఎండల నేపథ్యంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. సభాస్థలికి వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పారిశ్రామిక ప్రముఖులు, ఇతర అతిథులు, అధికారులు విశాంత్రి తీసుకోవడానికి ప్రత్యేక గదులు సిద్ధం చేశారు.
భోజనాలకు పక్కా ఏర్పాట్లు
సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు, రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, తాగునీరు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ-టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంచారు.
ప్రత్యామ్నాయ రోడ్లు.. పార్కింగ్ ప్రాంతాలు
వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారికి చేరుకునే ముందు వరకు రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించారు. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణానికి, పార్కింగ్ స్థలానికి మధ్య సుమారు 300 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలు పార్కింగ్ చేసి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యలో అక్కడక్కడ టెంట్లు వేశారు. మంచినీటి సదుపాయం కల్పించారు. పార్కింగ్ నుంచి సభకు రావడానికి మధ్యలో ఏ చిన్న పొరపాటు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా అధికారులు, పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
సందడే సందడి
30కి పైగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు గురువారం రాజధాని వచ్చారు. అలాగే, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వారితో అమరావతి కళకళలాడుతోంది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే దారులన్నీ స్వాగత ఫ్లెక్సీలు, కూటమి జెండాలతో దర్శనమిస్తున్నాయి.
నిఘా నీడలో రాజధాని
రాజధానికి ప్రధానమంత్రి వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. పార్కింగ్ స్థలం మొదలు సభా ప్రాంగణానికి చేరుకునే వరకు అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎప్పటికప్పుడు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించేందుకు పోలీసులతో పాటు ప్రత్యేక సాంకేతిక బృంద సభ్యులను కేటాయించారు. ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఓఎల్‌ఈడీ స్ర్కీన్లపై నిరంతరం డేగకన్నుతో నిఘా బృందాలు పరిశీలిస్తాయి. సభా ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయి.
అందంగా రహదారులు
రాజధానికి చేరుకునే రోడ్లు పచ్చదనంతో అందంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీరందేలా డ్రిప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు సేదతీరడానికి ప్రతి 500 మీటర్లకు ఒక టెంట్ వేశారు.