ఉధృతంగా..
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:05 AM
ఓపక్క వానలు.. మరోపక్క వాగులు.. ఇంకోపక్క వరదలు.. జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారీ వర్షాలు పల్లపు ప్రాంతాలను నీట ముంచేస్తుండగా, ఎగువ నుంచి వస్తున్న వరదలు పరివాహక ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పరిసర గ్రామాల్లోని రహదారులపైకి నీరు చేరుతోంది. జిల్లాలో గురువారం పెద్దగా వర్షం కురవనప్పటికీ వాతావరణం మాత్రం పూర్తి మేఘావృతమై కనిపించింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి రెండో ప్రమాద హెచ్చరిక దిశగా వెళ్లింది. ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహించిన కృష్ణమ్మ సాయంత్రానికి కాస్త శాంతించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
పులిచింతల, వాగులు, బుడమేరు నుంచి చేరిన వరద
రెండో ప్రమాద హెచ్చరిక ఇవ్వాలనుకున్న అధికారులు
మధ్యాహ్నం నుంచి తగ్గిపోయిన పులిచింతల అవుట్‌ఫ్లో
బ్యారేజీ వద్ద మూడు కాల్వలకు నీటి విడుదల నిలుపుదల
జిల్లాలో ఉప్పొంగిన వాగులు, వంకలు.. రోడ్లపైకి నీరు
పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్
బుడమేరుకు 2,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మోస్తరు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి గురువారం కూడా భారీగా వరద చేరింది. పులిచింతలతో పాటు ఎగువన ఉన్న వాగులు, బుడమేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఇప్పటికే బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం నాటి పరిస్థితి రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే సూచనలను చూపించింది. ఎగువ నుంచి ఉదయం 4,50,240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 70 గేట్లను పూర్తిస్థాయిలోకి ఎత్తి ఆ మొత్తాన్ని దిగువకు పంపారు. ఈ ఇన్‌ఫ్లో మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ పెరిగింది. అక్కడి నుంచి గంటగంటకూ పెరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇన్‌ఫ్లో 5,65,807 క్యూసెక్కులకు చేరింది. ఆ మొత్తం నీటిని అధికారులు సముద్రంలోకి వదిలారు. జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం బ్యారేజీ నుంచి 3,97,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదే అవుట్‌ఫ్లో 5,66,860 క్యూసెక్కులు ఉంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. బ్యారేజీ లాక్ ఆఫీసు సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలకు తీసిన రీడింగ్ చూసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయాలేమో అనుకున్నారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గుతూ వచ్చింది. 4 గంటల నుంచి పులిచింతల నుంచి విడుదల చేసే నీటి పరిమాణం తగ్గడంతో బ్యారేజీకి ఇన్‌ఫ్లో తగ్గిపోయింది. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీకి 3,85,139 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 5,46,019 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి అనుబంధంగా ఉన్న కాల్వల పరిధిలోని గ్రామాలకు, పొలాలకు నీటి అవసరం ప్రస్తుతానికి లేకపోవడంతో నీటి విడుదలను నిలుపుదల చేశారు. ఏలూరు కాల్వకు 306, రైవస్ కాల్వకు 300 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. మిగిలిన కేఈ ప్రధాన, బందరు, కేడబ్ల్యూ, గుంటూరు చానళ్లకు నీటి విడుదలను నిలుపుదల చేశారు.
వణికిస్తున్న వాగులు
జిల్లాలోని వాగులు వణుకు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు నీటి ప్రవాహం ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వాగులపై నీటి ప్రవాహాన్ని తెలియజేసే మీటర్ గేజ్‌లు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఆ నీరంతా రహదారులపైకి చేరుతోంది. వీరుల పాడు మండలంలోని చెప్పారావుపాలెంలోని ఏనుగుగడ్డవాగు ఉధృతి కారణంగా దొనబండ - దాములూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు డైవర్షన్ కెనాల్ (బీడీసీ) నుంచి 2,600 క్యూసెక్యుల నీటిని కృష్ణానదిలోకి మళ్లిస్తున్నారు. బుడమేరుకు ఇన్‌ఫ్లో 15 వేల క్యూసెక్కులు దాటితేనే విజయవాడ నగరంలో ఉన్న కాల్వకు వరద వస్తుందని అధికారులు తెలిపారు. జి.కొండూరు మండలంలోని పులివాగు, మైలవరం మండలంలోని కొండవాగు, రెడ్డిగూడెం మండలంలోని కోతులవాగు, పలు పిల్ల వాగుల్లో రాత్రి భారీవర్షం కురిసింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌కు 2,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఈ నీటిని బుడమేరు వరద మళ్లింపు కాల్వ ద్వారా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. గంపలగూడెం మండలంలోని వినగడప-కట్టలేరు డైవర్షన్ రహదారిపైకి వరద చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. సుమారు 20 గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. వత్సవాయి మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగాల కాజ్‌వే దగ్గర మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట దగ్గర 9.2 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. నందిగామ మండలంలోని చందాపురం, అనాసాగరం దగ్గర నల్లవాగు, కూచి వాగులు పొంగడంతో ఆ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. రెడ్డిగూడెంలో నాగసానిపాటి చెరువుకు వెళ్లే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి వరద నీటిలో మునిగిపోయింది. జగ్గయ్యపేట మండల చిల్లకల్లు ఊర చెరువుకు గండి పడడంతో వరద నీరు వరి పొలాల్లోకి చేరింది.
వీడని వాన
రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లాలో 1,881 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా జగ్గయ్యపేట మండలంలో 176.6 మి.మీ, అత్యల్పంగా 51.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
11వేల ఎకరాల్లో పంటనష్టం
భారీ వర్షాలకు జిల్లాలో 11,547.5 ఎకరాల్లో వరి, పత్తి, మినుము, పెసర పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గురువారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. ఈ నెల 12వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం వరకు, 13వ తేదీ సాయంత్రం 5.30 నుంచి 14వ తేదీ గురువారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అధికారుల నివేదిక ప్రకారం.. జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 160 గ్రామాల్లో 4,252 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో 7,632.5 ఎకరాల్లో వరి, 2,427.5 ఎకరాల్లో పత్తి, 495 ఎకరాల్లో మినుము, 992.5 పెసర పంటకు నష్టం వాటిల్లింది. వరి పూర్తిగా నీటమునిగి దెబ్బతింది. మినుము, పెసర పంట పూత, పింద దశలో ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పూత, పిందెలు రాలిపోయాయి. పత్తి సైతం పూత దశలో ఉండగానే నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.