Share News

వాగులు, వంకలకు వరద

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:39 AM

తెలంగాణా నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మునేరు మహోధృతం కాగా, వైరాయేరు, కట్టలేరు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరద చేరుతుండటంతో తెలంగాణా నుంచి రాకపోకలు దాదాపు బంద్‌ అయ్యాయి.

వాగులు, వంకలకు వరద
పెనుగంచిప్రోలు వద్ద మునేరు ఉధృతి

తెలంగాణాలో వర్షాలు.. భారీగా చేరుతున్న నీరు

మునేరు ఉధృతం.. 45 వేల క్యూసెక్కులకు వరద

ఒక్కరోజులో 8 రెట్లు పెరిగిన ప్రవాహం

లక్ష క్యూసెక్కులు దాటుతుందన్న నిపుణులు

చిల్లకల్లు-వైరా మార్గంలో లింగాల కాజ్‌వే మూసివేత

ప్రమాదకరంగా కట్టలేరు, వైరాయేరు

పల్లెంపల్లి గ్రామం వద్ద కాజ్‌వే క్లోజ్‌

పాలేరుకు 4 లక్షల క్యూసెక్కుల నీరు రాక

జగ్గయ్యపేట-బలుసుపాడులో రాకపోకలు బంద్‌

ఏపీ-తెలంగాణా మధ్య నిలిచిన రాకపోకలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల/జగ్గయ్యపేట రూరల్‌) : మునేరు మహోధృతమై ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 8 గంటలకు రికార్డు స్థాయిలో 45 వేల క్యూసెక్కుల వరద మునేరుకు చేరింది. సాయంత్రం 5.30 గంటలకు వరద 28 వేల క్యూసెక్కులు ఉండగా, రాత్రి 8 గంటలకు 45 వేల క్యూసెక్కులకు చేరింది. చిల్లకల్లు నుంచి వైరా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో వత్సవాయి మండలం లింగాల వద్ద కాజ్‌వేపైకి వరద చేరింది. దీంతో ఏపీ, తెలంగాణా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, కృష్ణానదిలో ప్రమాదకర స్థాయిలో నీరు లేనందున వరద లక్ష క్యూసెక్కుల వరకు వచ్చినా ఇబ్బంది లేదు. ఆపైన దాటితే మాత్రం కంచికచర్ల, వత్సవాయి, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల పరిధిలో పంటలు తీవ్రంగా దెబ్బతినటమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 గ్రామాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వరద అంతకంతకూ పెరుగుతుండటంతో మునేటి పరిధిలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆర్‌డీవో కె.బాలకృష్ణ.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వరద ఉధృతంగా వస్తున్నందున తీర గ్రామాల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాలేరుకు 4 లక్షల క్యూసెక్కుల వరద

జగ్గయ్యపేట రూరల్‌ మండలంలోని పాలేరుకు భారీ వరద చేరింది. మొత్తం 4 లక్షల కూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి దగ్గర పాలేరు రిజర్వాయర్‌ ఉంది. ఇది ఫుల్‌ అవడంతో దిగువకు విడుదల చేశారు. జగ్గయ్యపేటలో ఇది రావిరాల గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. భారీస్థాయిలో వరద వస్తున్నా ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. పులిచింతల నుంచి వరద వస్తే తప్ప ఇబ్బంది లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రావిరాల, బూదవాడ, అన్నవరం గ్రామాలపై ప్రభావం ఉంటుంది. పాలేరు వరదను దృష్టిలో ఉంచుకుని జగ్గయ్యపేట-బలుసుపాడు రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రమాద హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేసి బారికేడ్లు పెట్టారు.

ప్రమాదకరంగా వైరా, కట్లేరు

వైరాయేరు, కట్లేరు ప్రమాదస్థాయి దాటి ప్రహిస్తున్నాయి. నందిగామ మండలం దాములూరు కూడలి, వీరులపాడు మండలం పల్లెంపల్లి మధ్య కాజ్‌వేపై నాలుగైదు అడుగుల ఎత్తున వైరాయేరు ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైరాయేరు వరద కూడా ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నందిగామ దగ్గర నల్లవాగు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో యేనుగుగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లవాగు ఉధృతి వల్ల నందిగామ నుంచి చందాపురం మీదుగా చందర్లపాడు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యేనుగుగడ్డ వాగు ఉధృతికి రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి.

Updated Date - Oct 30 , 2025 | 12:39 AM