వరద దుర్భేద్యం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:51 AM
అమరావతికి శాశ్వతంగా వరద ముంపు తలెత్తకుండా అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీఎల్) నేతృత్వంలో భారీ ఎత్తున రాజధానిలో వరద ముంపు నివారణ పనులు జరుగుతున్నాయి.

అమరావతిలో శరవేగంగా ముంపు నివారణ పనులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమరావతికి శాశ్వతంగా వరద ముంపు తలెత్తకుండా అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీఎల్) నేతృత్వంలో భారీ ఎత్తున రాజధానిలో వరద ముంపు నివారణ పనులు జరుగుతున్నాయి. దుర్భేద్యమైన వరదనీటి కాలువలు, రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా ఎంత భారీ వర్షం కురిసినా నీరు అమరావతి నగరాన్ని ముంచెత్తకుండా విస్తరా ణాభివృద్ధి పనులు చేస్తున్నారు. నీరుకొండ, పాలవాగు, గ్రావిటీ కాలువల విస్తరణాభివృద్ధి పనులతో పాటు ఏకకాలంలో 3 ప్రధాన రిజర్వాయర్ల పనులు మొదలయ్యాయి. కొండవీడు వా గు విస్తరాణాభివృద్ధి పనులు ముందుగా ప్రారంభమయ్యాయి. 20 ఎక్స్‌కవేటర్లతో శరవేగంగా ఈ పనులు సాగుతున్నాయి. 80 లారీలు ఇక్కడి నుంచి తవ్విన మట్టిన తరలిస్తున్నాయి. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు వచ్చే కొండవీడువాగు ప్రస్తుతం కొన్ని చోట్ల 10 అడుగులు మరికొన్ని చోట్ల 4 అడుగుల లోతున ఉందని ఇటీవల ఏడీసీ సీఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొండవీడు వాగు లో 75 మీటర్ల లోతు, 115 మీటర్ల వెడల్పుతో విస్తరణాభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం శాఖమూరు నుంచి ఈ పనులు జరుగుతున్నాయి. ఐనవోలు గ్రామం పరిధిలో కూడా కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ కాలువను నీరుకొండ దగ్గర అభివృద్ధి పరిచే రిజర్వాయర్‌కు అనుసంధానం చేస్తారు. కొండవీడు కాలువ నీరుకొండ రిజర్వాయర్‌కు అనుసంధానమయ్యేలా ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. నీరుకొండలోనూ రిజర్వాయర్ పనులు ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నా రు. పాలవాగు విస్తరణాభివృద్ధి పనులు కూడా సమాంతరంగా మొదలయ్యాయి. పాలవాగు దొండపాడు నుంచి కృష్ణాయపా లెం మీదుగా కొండవీడు వాగులో కలుస్తుంది. పాలవాగు పను లు ప్రస్తుతం ఎన్-9 రోడ్డు బ్రిడ్జి ఎడమ వైపున జరుగుతున్నాయి. ఇక్కడ 8 ఎక్స్‌కవేటర్లు మట్టిని తవ్వుతుండగా..మొత్తం 30 లారీలు తవ్విన మట్టిని తరలిస్తున్నాయి. గ్రావిటీ కెనాల్ పనులను కూడా కాంట్రాక్టు సంస్థ చేపట్టింది. గ్రావిటీ కెనాల్ వైకుంఠపురం వెంబడి వెళుతుంది. భారీ సంఖ్యలో ఎక్స్‌కవేటర్లు, లారీలను దించి కాంట్రాక్టు సంస్థ చకచకా కాలువ విస్తరణాభివృద్ధి పనులు చేపడుతోంది.
నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీల సామర్థ్యం రిజర్వాయర్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్, వైకుంఠపురం దగ్గర 0.03 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్, రాజధాని బయట కూడా మరో 0.03, 0.2 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు.