Share News

అదిగదిగో.. ఆశల వారధి

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:44 AM

ఆశల వారధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. దశాబ్దాల కల త్వరలో నిజం కాబోతోంది. దివిసీమలోని ఎన్నో దీవులకు వెలుగుదారి పరిచే ఏటిమొగ్గ-ఎదురుమొండి వారధి నిర్మాణం అతి త్వరలో ప్రారంభం కానుంది. నిధులున్నా ఇన్నాళ్లూ నీటి మీద రాతలుగానే మారిన వారధి నిర్మాణ ప్రతిపాదనలు టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో పునరుత్తేజం తెచ్చుకుని టెండర్ల దశను దాటడంపై దివిసీమవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అదిగదిగో.. ఆశల వారధి
ఎదురుమొండి దీవులకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రయాణికులు

ఏటిమొగ్గ-ఎదురుమొండి వంతెన నిర్మాణానికి తొలి అడుగు

రూ.109 కోట్లతో త్వరలో ప్రారంభంకానున్న పనులు

టెండర్‌ దక్కించుకున్న వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌

త్వరలోనే పనులు చేపట్టే అవకాశం

నిధులున్నా వైసీపీ హయాంలో మూలనపడిన ప్రాజెక్టు

టీడీపీ కూటమి రాకతో మళ్లీ టెండర్లు.. ఖరారు

ఆనందం వ్యక్తం చేస్తున్న దివిసీమవాసులు

అవనిగడ్డ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో దశాబ్దాలుగా ఎదురుమొండి దీవుల వాసులు ఎదురుచూస్తున్న కల త్వరలో సాకారం కానుంది. రూ.109 కోట్లతో త్వరలో వారధి నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. ఈ దీవుల్లోని దాదాపు 10 వేల మంది బాహ్య ప్రపంచానికి వెళ్లాలంటే పడవలు, పంటు మాత్రమే దిక్కు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆ వెసులుబాటు కూడా లేక ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుమొండి నుంచి ఏటిమొగ్గ వరకు వంతెన నిర్మిస్తే తమ కష్టాలు తీరతాయని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇంతకాలం ఈ వారధి అంశం ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోతూ వచ్చింది. 2023లో వారధి నిర్మాణానికి నాబార్డు రూ.109 కోట్లు కేటాయించగా, రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు. తాజాగా ఆర్‌అండ్‌బీ మూడోసారి గ్లోబల్‌ టెండర్లు పిలవగా, వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. ఇప్పటికే అగ్రిమెంట్‌ పనులు పూర్తికావటంతో త్వరలోనే ఎదురుమొండి దీవులవాసులు వారధి కోసం కంటున్న కలలు సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పడవ ప్రమాదాలతో భయంభయంగా..

ఎదురుమొండి దీవుల్లోని మూడు పంచాయతీల్లో ఉన్న ప్రజలు ఏ కొద్దిపాటి అవసరం ఏర్పడినా ప్రమాదకరమైన పడవ ప్రయాణం చేయాల్సిందే. ఇలా పడవ దాటుతున్న సమయంలో 2002వ సంవత్సరంలో గొల్లమంద వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు 28 మంది మృతిచెందగా, అంతకు రెండు ద శాబ్దాల ముందు 30 మంది నదిలో మునిగి చనిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన నాటి టీడీపీ ప్రభుత్వం ఏటిమొగ్గ నుంచి ఎదురుమొండి వెళ్లేందుకు ప్రజా భాగస్వామ్యంతో పంటును ఏర్పాటు చేయగా, అప్పటి నుంచి దానిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, రాత్రి 7 గంటల తర్వాత పంటు సౌకర్యం లేకపోవటంతో ఏ అనారోగ్య సమస్య వచ్చినా విధిలేని పరిస్థితిలో నాటు పడవలపైనే నది దాటాల్సి వచ్చేది. ఈ పరిస్థితి నుంచి తాము గట్టెక్కాలంటే ఎదురుమొండి-ఏటిమొగ గ్రామాల నడుమ నదిపై వంతెన నిర్మించడం ఒక్కటే మార్గమని ప్రజల నుంచి బలమైన డిమాండ్‌ రావడంతో రాజకీయ నేతలు రెండు దశాబ్దాలుగా హామీలు ఇస్తూనే వస్తున్నారు.

వైసీపీ హయాంలో..

2023వ సంవత్సరంలో నాటి ఎంపీ బాలశౌరి నాబార్డు అధికారులతో మాట్లాడి రూ.109 కోట్లు కేటాయించేలా చేశారు. నాడు ఉన్న పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎవరు ఈ పనులు చేయటానికి ముందుకు రాలేదు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో వారధి నిర్మాణం చేపడతామని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ రావటం, నాటి ప్రభుత్వ తీరు కారణంగా ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ తన కార్యకలాపాలు నిర్వహించలేమంటూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసి, వైదొలగింది.

టీడీపీ కూటమి వచ్చాక..

టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం నాబార్డు మంజూరు చేసిన రూ.109 కోట్లతో వారధి నిర్మాణానికి టెండర్లు పిలవటంతో పాటు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఒప్పించింది. దీంతో ఇటీవల పిలిచిన గ్లోబల్‌ టెండర్లలో పలువురు ఈ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చారు. వారిలో నుంచి వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఈ పనులు దక్కించుకోవటంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వారధి నిర్మాణానికి టెండర్లు ఖరారు కావటంతో పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌.. ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ నయీమూల్లాను కలసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 12:44 AM