Share News

ఎ.కొండూరు రైస్‌మిల్లులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:07 AM

తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకట శ్రీసాయి రైస్‌ ఇండ్రస్టీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో రబీలో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం సేకరించిన 32 వేల క్వింటాళ్ల ధాన్యం, 80 వేల (ప్రభుత్వానికి చెందినవి 43 వేలు, యజమానులవి 37 వేలు) గోనె సంచులు, 718 క్వింటాళ్ల నూకలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఎ.కొండూరు రైస్‌మిల్లులో అగ్ని ప్రమాదం
ప్రమాదంలో బూడిదైన ధాన్యం, గన్నీ బ్యాగ్‌లు

విద్యుత షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే..

రూ.90 లక్షల వరకు ఆస్తినష్టం

32 వేల క్వింటాళ్ల ధాన్యం, 80 వేల గోనె సంచులు బూడిద

ఎ.కొండూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకట శ్రీసాయి రైస్‌ ఇండ్రస్టీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో రబీలో రైతుల వద్ద నుంచి ప్రభుత్వం సేకరించిన 32 వేల క్వింటాళ్ల ధాన్యం, 80 వేల (ప్రభుత్వానికి చెందినవి 43 వేలు, యజమానులవి 37 వేలు) గోనె సంచులు, 718 క్వింటాళ్ల నూకలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం నష్టం రూ.90 లక్షల వరకు ఉంటుందని మిల్లు యజమాన్యం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వీఆర్వో జి.గోపాలకృష్ణ తెలిపారు. కాగా, మిల్లు యజమాన్యం సమాచారంతో విస్సన్నపేట, తిరువూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని, తీవ్రంగా శ్రమించి, మంటలను అదుపు చేశారు. గన్నవరం అగ్నిమాపకాధికారి షేక్‌ జాన్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడంతో నష్టం కొంతమేర తగ్గింది.

గుణ‘పాఠాలు’ నేర్వరా?

ఈ రైస్‌మిల్లులో జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో జిల్లావ్యాప్తంగా ఉన్న బ్రాయిలర్‌ రైస్‌ మిల్లుల్లోని భద్రతా లోపాలపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షే ధ్యేయంగా పనిచేసే మిల్లుల యజమానులు తేమశాతం, ఇతర విషయాల్లో రైతులను పీడించుకుతినడమే కానీ అగ్ని ప్రమాదాల నివారణకు కనీస భద్రతా చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ఉన్నతాఽధికారులు రైస్‌ మిల్లులపై దాడులు చేసి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

గోనె సంచుల కొరత

రైతుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం గన్నీ బ్యాగ్‌లు సమకూర్చలేక ఇబ్బందులు పడుతుంటే, కొందరు మిల్లుల యజమానుల తీరుతో ఈ బ్యాగులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ రైస్‌ మిల్లులో సుమారు 80 వేల గోనె సంచులు బూడిద కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:07 AM