Share News

తండాల్లో జ్వరాలు

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:54 AM

ఉత్తర ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఏ.కొండూరులోని గిరిజన తండాలు జ్వరాలతో అల్లాడిపోతున్నాయి. విషజ్వరాలతో గిరిజనులు వణికిపోతున్నారు. ఉచిత వైద్య శిబిరాలతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో జ్వరపీడితులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అక్కడ భారీగా డబ్బు వసూలు చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు.. .కొండూరు మండలం రేపూడి తండాలో పరిస్థితి ఘోరంగా ఉంది.

తండాల్లో జ్వరాలు
ఇళ్ల మధ్య నిల్వ ఉన్న మురుగు నీరు

ప్రతి ఇంట్లో జ్వరపీడితులు

ఒకరి తర్వాత ఒకరికి.. ఇంటిల్లిపాదికీ..

నిరుపయోగంగా ఉచిత వైద్య శిబిరాలు

ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్న గిరిజనులు

రూ.వేలల్లో ఖర్చు చేయలేక అవస్థలు

రేపూడి తండాలో పారిశుధ్యం అధ్వానం

ఏ.కొండూరు/జి.కొండూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఏ.కొండూరు మండలం రేపూడి తండా విషజ్వరాలతో వణికిపోతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో చాలామంది మంచాలకే పరిమితమయ్యారు. పారిశుధ్యలోపం, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఎక్కడ మురుగు అక్కడే నిల్వ ఉండి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముందుగా ఒంటినొప్పులు, జలుబు, గొంతునొప్పితో ప్రారంభమై విషజ్వరంగా మారుతోందని బాధితులు చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరికి.. అలా ఇంటిల్లిపాదీ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన భరోతు లశ్యాకు మొదట జ్వరం రాగా, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ సోకింది. కంభంపాడులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చూపించుకుంటున్నామని, రూ.50 వేలు ఖర్చు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జరబల కృష్ణ ఇంట్లో ఐదుగురికి జ్వరం సోకగా, రూ.40 వేల వరకు ఖర్చు చేశారు. వ్యవసాయ పనులు కూడా నిలిచిపోయి.. కడుపునిండా అన్నం తినే పరిస్థితి కూడా చాలా కుటుంబాల్లో లేకుండాపోయింది. ఏడాది మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బంతా వైద్యఖర్చులకే సరిపోతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. పారిశుధ్య చర్యలు సక్రమంగా తీసుకోకపోవడం, కనీసం బ్లీచింగ్‌ కూడా చల్లకపోవడంపై సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ప్రభుత్వ వైద్యురాలు దివ్యను వివరణ కోరగా, ప్రస్తుతం జ్వరాలు లేవని, తాను రామచంద్రాపురం క్యాంపులో ఉన్నానన్నారు.

పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారు?

విషజ్వరాలతో గిరిజన తండా వణుకుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన రేపూడి తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి కోటిరెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆయన్ను వివరణ కోరగా, ‘ఎంతమంది నాకు ఫోన్లు చేస్తారు? మండలంలో 16 మంది కార్యదర్శులు ఉండగా నాకు, రామచంద్రాపురం కార్యదర్శి కృష్ణారెడ్డికి మాత్రమే ఎందుకు ఫోన్‌ చేస్తున్నారు? ముందు నాకు సమాధానం చెప్పండి.’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం

‘రేపూడి తండాలో వైద్య శిబిరం నిర్వహిస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఇంటికీ వెళ్లి నీటినిల్వ వద్ద లార్వాను గుర్తించి, ప్రజల్లో అవగహన కలిగిస్తున్నాం.’ అని మలేరియా నివారణ అధికారి బాబావలి తెలిపారు. గ్రామ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఏఎన్‌ఎం కల్యాణి మాట్లాడుతూ గ్రామాల్లో జూలై 29 నుంచి ఇప్పటి వరకు 12 జ్వరాల కేసులు నమోదయ్యాయని, మా వద్దకు జ్వర బాధితులకు రక్త పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:54 AM