ఎంత పనిచేశావ్ నాన్నా..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:01 AM
అప్పులు చేసిన తండ్రి ఆ బాధను పిల్లలపై చూపించాడు. హాస్టల్ నుంచి తల్లిదండ్రుల ఆప్యాయత కోసం వచ్చిన వారి ఆయుష్షు అంతలోనే తీసేశాడు. నిద్రలో ఉన్నవారిని శాశ్వతంగా నిద్రపోయేలా చేశాడు. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయాడు. రెండు రోజుల్లో ఫాదర్స్ డే ఉండగా, మైలవరంలో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను కన్నతండ్రే కడతేర్చడం వెనుక కథ ప్రతి ఒక్కరి కంట నీరు తెప్పిస్తోంది.
మైలవరంలో ఇద్దరు చిన్నారులను కడతేర్చిన తండ్రి
అప్పుల బాధలు తాళలేక గడ్డి మందు పెట్టి హత్య
తాను కూడా చనిపోతున్నానని సూసైడ్ నోట్
ఆనక కనిపించకుండా పోయిన తండ్రి
ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
విజయవాడ/మైలవరం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : వేములవాడ రవిశంకర్.. మైలవరంలోని తిరువూరు రోడ్డులో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య చంద్రిక ఉపాధి నిమిత్తం ఇటీవల బెహ్రాన్ వెళ్లింది. వీరికి లీలాసాయి (7), లక్ష్మీ హిరణ్య (9) పిల్లలు. జి.కొండూరులోని మిషనరీ హాస్టల్‌లో ఉంటూ ఐదు, మూడు తరగతులు చదువుతున్నారు. ఈ కుటుంబం తిరువూరు రోడ్డులో అద్దెకు ఉంటోంది. రెండు నెలల క్రితం చంద్రిక పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి ఉపాధి కోసం బెహ్రాన్ వెళ్లింది. అప్పటి నుంచి రవిశంకర్ పిల్లలతో కలిసి ఉంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరూ హాస్టల్ నుంచి తండ్రి వద్దకు వచ్చారు. రవిశంకర్ కొద్దిరోజుల కిందటి వరకు తన తల్లిదండ్రులు అనిత, లక్ష్మీపతి కలిసి ఉండేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిదండ్రులు దేవుని చెరువు వద్దకు అద్దెకు వెళ్లిపోయారు. లక్ష్మీపతి రోజూ తన కుమారుడి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈనెల 8వ తేదీన లక్ష్మీపతి యథావిధిగా కుమారుడు ఇంటికి వచ్చాడు. తాళాలు వేసి ఉండటంతో తిరిగి వెళ్లిపోయాడు. ఇలా వచ్చిన ప్రతిసారీ ఇంటికి తాళాలు వేసి ఉంటున్నాయి. గురువారం మళ్లీ కుమారుడి ఇంటికి వచ్చాడు. రవిశంకర్ ఉపయోగించే సైకిల్ ఆరు బయట ఉండటంతో ఎండ, వానకు పాడైపోతుందని వరండాల్లో పెట్టాడు. వరండాలోకి వెళ్లగానే, దుర్వాసన వచ్చింది. ఏదో జంతువు చనిపోయి ఉంటుందని భావించిన లక్ష్మీపతి కిటికీకి అడ్డుగా కట్టిన కర్టెన్ తీసి చూడగా లక్ష్మీహిరణ్య, లీలాసాయి మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. లక్ష్మీపతి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా, వరండాలో స్టూల్‌పై గడ్డి మందు సీసా కనిపించింది. దీన్నిబట్టి రవిశంకర్ పిల్లలిద్దరికీ డ్రింక్‌లో గానీ, భోజనంలో గానీ గడ్డి మందు కలిపి ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు. రవిశంకర్ ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తోంది.
అప్పులే కారణమా?
రవిశంకర్‌కు అప్పులు ఉన్నాయని తండ్రి లక్ష్మీపతి చెబుతున్నాడు. అతను పనిచేసే హోటల్ వద్ద విచారణ చేయగా, వారం రోజులుగా రావట్లేదని చెప్పారు. క్లూస్ టీం ఇంట్లో పరిశీలించగా, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రవిశంకర్ రాసిన లేఖ లభించింది. ‘నాతోపాటు అందరినీ తీసుకెళ్తాను. నాకు చాలా అప్పులు ఉన్నాయి’ అని అందులో రాశాడు. దీన్నిబట్టి ముందుగా పిల్లలిద్దరినీ చంపేసి, ఆ తర్వాత అతడూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రవిశంకర్ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు పదేపదే అప్పుల గురించి ప్రస్తావించేవాడు. ఆ అప్పులు ఎందుకు చేశాడో, అప్పు చేసిన డబ్బు ఎక్కడ ఉపయోగించాడో చెప్పేవాడు కాదు. అసలు అప్పులెంత ఉన్నాయో ఏనాడూ చెప్పలేదని తండ్రి లక్ష్మీపతి చెబుతున్నాడు. ఉపాధి కోసం భార్య చంద్రికను బెహ్రాన్ పంపడానికి ఈ అప్పులు చేశాడా.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు రవిశంకర్‌కు ఎవరెవరు అప్పులు ఇచ్చారన్న దానిపై కూపీ లాగుతున్నారు. అలాగే, రవిశంకర్ తల్లి అనితకు, భార్య చంద్రికకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. అత్తాకోడళ్లకు ఏ విషయంలోనూ పడేది కాదని లక్ష్మీపతి మాటల ద్వారా తెలుస్తోంది. అలాగే, భార్య అనిత పోరు భరించలేక కొద్దిరోజుల క్రితం లక్ష్మీపతి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్టు స్థానికులు చెబుతున్నారు.
నాన్నమ్మ, తాతయ్య ఉండి ఉంటే..
ఏడాదిలో సగానికిపైగా జి.కొండూరులోని మిషనరీ హాస్టల్‌లో ఉండే లీలాసాయి, లక్ష్మీ హిరణ్యను తాతయ్య లక్ష్మీపతి, నానమ్మ అనిత గారాబంగా చూసేవారు. వారు ఉండి ఉంటే.. ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలతో ఉండేవారని చుట్టుపక్కల వారు చెప్పారు. కిటికీలో నుంచి లక్ష్మీపతి చూడగా, పిల్లలిద్దరూ మంచంపై పురుగులు పట్టి కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న మనవడు, మనవరాలిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఇప్పటి వరకు రవిశంకర్ ఆచూకీ లభించలేదు. దీనిపై మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.