Share News

ఐస్‌క్రీమ్‌లో సెనైడ్‌ కలిపి తిని.. తండ్రీ తనయుల బలవన్మరణం

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:57 AM

కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపించాల్సిన ఆ తండ్రి గుండెల్లో బాధను తొక్కిపెట్టి, సెనైడ్‌ కలిపిన ఐస్‌క్రీమ్‌ను తినిపించి తానూ తిన్నాడు. తన కష్టాలు తనయుడికి కలగకూడదనుకున్నాడో ఏమో తన వెంటే తనయుడ్ని కూడా తీసుకెళ్లిపోయాడు. హృదయవిదారకమైన ఈ విషాద సంఘటన యనమలకుదురులో జరిగింది.

ఐస్‌క్రీమ్‌లో సెనైడ్‌ కలిపి తిని.. తండ్రీ తనయుల బలవన్మరణం

ఐస్‌క్రీమ్‌లో సెనైడ్‌ కలిపి కుమారుడికి తినిపించిన తండ్రి

తాను కూడా తిని ఆత్మహత్య

యనమలకుదురులో విషాదం

పెనమలూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపించాల్సిన ఆ తండ్రి గుండెల్లో బాధను తొక్కిపెట్టి, సెనైడ్‌ కలిపిన ఐస్‌క్రీమ్‌ను తినిపించి తానూ తిన్నాడు. తన కష్టాలు తనయుడికి కలగకూడదనుకున్నాడో ఏమో తన వెంటే తనయుడ్ని కూడా తీసుకెళ్లిపోయాడు. హృదయవిదారకమైన ఈ విషాద సంఘటన యనమలకుదురులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వనటౌనలో బంగారం పనులు చేసే సాయిప్రకాశ్‌రెడ్డి భార్య, పిల్లలతో యనమలకుదురు వినోద్‌ పబ్లిక్‌ స్కూల్‌ రోడ్డులో ఉంటున్నాడు. భార్య లక్ష్మీభవాని గాంధీనగర్‌లోని ఓ మెడికల్‌ షాపులో పనిచేస్తోంది. వారికి 11 ఏళ్ల పాప, ఏడేళ్ల బాబు తక్షిల్‌ సంతానం. కరోనా సమయంలో సరిగ్గా వ్యాపారం, పనులు లేక రూ.10 లక్షల వరకు అప్పయ్యాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా మనస్థాపానికి గురవుతున్నాడు. భార్య సముదాయించినా లోలోపల కుమిలిపోతూనే ఉన్నాడు. కాగా, బుధవారం భార్యాభర్తలు ఎవరి పనులకు వారు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చారు. ఒంటిపూట బడులు కావడంతో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. తల్లి లక్ష్మీభవానీ తిరిగి మెడికల్‌ షాపునకు వెళ్లిపోయింది. కాగా, సాయంత్రం 4.30 గంటల సమయంలో సాయిప్రకాశ్‌రెడ్డి.. కుమారుడు తక్షిల్‌కు సెనైడ్‌ కలిపిన ఐస్‌క్రీమ్‌ తినిపించి తానూ తిన్నాడు. కాసేపటికే ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వారిద్దరినీ పటమటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. సెనైడ్‌ సేవించే ముందు సాయిప్రకాశ్‌రెడ్డి తన స్నేహితుడు విజయ్‌కు ఒక మెసేజ్‌ చేశాడు. ఇద్దరం సెనైడ్‌ తిన్నామని, క్షమించమని మెసేజ్‌ పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:57 AM