కాలయాప్..న
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:56 AM
పత్తి రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట దిగుబడిపై అధిక వర్షాలు, మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చిన కొద్దోగొప్పో పంటను అమ్ముకునే తరుణంలో రైతులను యాప్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. కాస్త పత్తిని అమ్ముకుని, పెట్టుబడి ఖర్చులైనా దక్కించుకుందామనుకుంటే ఈ యాప్స్ ఇబ్బందులు మరింత తలనొప్పిగా పరిణమించాయి. పోనీ బయట అమ్ముకుందామంటే.. దళారులు కష్టాన్ని దోచుకునేందుకు చూస్తున్నారని, తక్కువకు అడుగుతున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి అమ్మకాల్లో రైతులకు యాప్‌ల కష్టాలు
ఈ-క్రాప్ అనంతరం సీఎం, కపాస్ కిసాన్ యాప్‌ల్లో ఎంట్రీ
స్మార్ట్‌ఫోన్లు ఉంటేనే నమోదు పూర్తి.. ఆలస్యంగా ఓటీపీలు
90 శాతం మంది రైతులకు లేని స్మార్ట్‌ఫోన్లు.. అవస్థలు
పంటను అమ్ముకోడానికి ఇన్ని కష్టాలా.. అంటున్న రైతులు
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : పత్తి రైతులపై ప్రకృతి పగబట్టింది. పంట దిగుబడిపై అధిక వర్షాలు, మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చిన కొద్దోగొప్పో పంటను అమ్ముకునే తరుణంలో రైతులను యాప్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. కాస్త పత్తిని అమ్ముకుని, పెట్టుబడి ఖర్చులైనా దక్కించుకుందామనుకుంటే ఈ యాప్స్ ఇబ్బందులు మరింత తలనొప్పిగా పరిణమించాయి. పోనీ బయట అమ్ముకుందామంటే.. దళారులు కష్టాన్ని దోచుకునేందుకు చూస్తున్నారని, తక్కువకు అడుగుతున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాప్ కష్టాలు ఇలా..
దళారులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీఎం యాప్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రెండు యాప్‌లలో పంట వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు సమయంలో ఓటీపీలు ఆలస్యం కావడం, సర్వర్లు పనిచేయకపోవడంతో రైతుల సమయం వృథా అవుతోంది. పత్తిని సీసీఐలో అమ్ముకోవాలనుకుంటే ప్రతి రైతు.. రైతుసేవా కేంద్రాలకు వెళ్లాలి. ఈ-క్రాప్‌లో నమోదైన పంటను అక్కడి సిబ్బంది సీఎం యాప్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం రైతులు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి చెందిన కపాస్ కిసాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో పంట నమోదు చేయాలి. ఈ రెండు యాప్‌లలో పంట నమోదు చేయాలంటే రైతులకు స్మార్ట్‌ఫోన్ ఉండాలి. వాటికి వచ్చే ఓటీపీలు చెప్పి నమోదు చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి పడిపోయి చేతికొచ్చిన కాస్తాకూస్తో పత్తిని అమ్ముకునేందుకు ఇన్ని ఇబ్బందులు పడాలా..? అని రైతులు ఆవేదన చెందుతున్నారు.