దొంగ పెళ్లిళ్లు బాబోయ్..!
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:02 AM
తెలంగాణలోని చిట్యాలలో ఓ వ్యక్తి వయస్సు 45 ఏళ్లు. తరగని ఆస్తి ఉన్నా ఇంట్లో తిరిగే ఇల్లాలు లేదు. ఎట్టకేలకు బంధువుల వివాహ కార్యక్రమంలో ఓ పెళ్లిళ్ల పేరయ్య పరిచయమయ్యాడు. అతనికి విషయం చెప్పి మంచి అమ్మాయిని చూడమని అడిగారు. చెప్పినట్టుగా ఆ పెళ్లిళ్ల పేరయ్య ఓ అమ్మాయిని చూశాడు. సంబంధం కుదిర్చాడు. ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా వచ్చిందని ఆ అమ్మాయిని ఆహ్వానించారు. ఇంతలో ఒకరోజు ఆమె తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పి చిట్యాల నుంచి వెళ్లిపోయింది. నాటి నుంచి అత్తింటికి వచ్చింది లేదు. చివరికి ఆమె విజయవాడలో తేలింది. సెల్‌ఫోన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్న చిట్యాల పోలీసులు కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. అజితసింగ్‌నగర్‌లో ఉంటున్న ఆమెను పట్టుకున్నాక అసలు విషయాలు తెలిశాయి. దొంగ పెళ్లిళ్ల గ్యాంగ్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.
నగరంలో వెలుగులోకి వస్తున్న ఫేక్ పెళ్లిళ్లు
నిన్న రాయచూర్.. నేడు తెలంగాణలోని చిట్యాల
పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న బాధితులు
నగరంలో మొత్తం మూడు గ్యాంగ్‌ల హల్‌చల్
దాదాపు 25 మంది దొంగ పెళ్లికూతుళ్ల గుర్తింపు
పెళ్లిచూపులకు అద్దె గదులు తీసుకుని వ్యవహారాలు
భారీగా ఎదురుకట్నం డిమాండ్.. ఆనక మోసం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న దొంగ పెళ్లిళ్ల గ్యాంగ్‌లు కుదిర్చిన సంబంధాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని రాయచూర్ నుంచి వచ్చిన ఓ బాధితుడు విజయవాడ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిందితుల కోసం తెలంగాణ పోలీసులు ఇక్కడికి వస్తున్నారు. దొంగ పెళ్లిళ్లకు సంబంధించి మొత్తం విజయవాడలో మూడు గ్యాంగ్‌లు ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మూడు గ్యాంగ్‌ల్లో 20-25 మంది వరకు మహిళలు ఉన్నట్టు భావిస్తున్నారు. వారిలో కొంతమంది భర్త నుంచి విడిపోయిన వారని, మరికొంతమంది భర్త చనిపోయిన వితంతువులని తెలుస్తోంది.
అద్దె ఇళ్లల్లో పెళ్లిచూపులు
వయస్సు మీద పడినా వివాహం కాని వ్యక్తులకు దొంగ పెళ్లి కుమార్తెలను చూపించడానికి ఈ గ్యాంగ్‌లు గదులను అద్దెకు తీసుకుంటున్నాయి. విజయవాడలో వీధివీధి తిరుగుతూ ఖాళీగా ఉన్న గదులను అద్దెకు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కుమార్తెను చూసుకోవడానికి వస్తున్నామని సమాచారం రాగానే, 15-20 రోజుల పాటు ఉండేలా గ్యాంగ్‌లీడర్లు గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కృష్ణలంక, రాణిగారితోట, దర్శిపేట, రామలింగేశ్వరనగర్, అజితసింగ్‌నగర్, వాంబేకాలనీ, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈ గదులు అద్దెకు తీసుకుంటున్నారు. అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధం కుదిరే వరకు ఆ గదులను ఉపయోగించుకుంటున్నారు. ఆ తర్వాత వెంటనే గదులను ఖాళీ చేస్తున్నారు.
భారీగా కన్యాశుల్కం
సాధారణంగా పెళ్లి సంబంధాలు కుదిరితే అమ్మాయి తరఫు నుంచి అబ్బాయికి కట్నకానుకలు అందుతాయి. యవ్వనం దాటిపోతున్నా వివాహాలు కాకపోవడంతో వయస్సు మీద పడుతున్న వారు ఎవరో ఒకరిని జీవిత భాగస్వామిగా తెచ్చుకోవాలనుకుంటారు. ఇందుకోసం పెళ్లి కుమార్తెలకు కన్యాశుల్కం ఇస్తున్నారు. ఇటువంటి సంబంధాలను దొంగ పెళ్లిళ్ల గ్యాంగ్‌లు అవకాశంగా మార్చుకుంటున్నాయి. అవివాహతుల ఆస్తిపాస్తులను తెలుసుకుని దాన్ని బట్టి కన్యాశుల్కం డిమాండ్ చేస్తున్నారు. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పెళ్లి కుమార్తెగా పీటలెక్కిన మహిళకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు చేతిలో పెడుతున్నారు. మిగిలిన మొత్తాన్ని గ్యాంగ్ లీడర్లు, మధ్యవర్తులు పంచుకుంటున్నారు.