Share News

సౌకర్యాలేవి సార్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:58 AM

వైసీపీ హయాంలో ఏర్పాటుచేసిన జగనన్న లే అవుట్లలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెరక పనులు కూడా జరగకపోవడంతో ఇళ్లు నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటున్నవారు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో రోడ్లయినా నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సౌకర్యాలేవి సార్‌

జగనన్న లే అవుట్లలో సదుపాయాలు లేక ఇబ్బందులు

ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరం

అర్ధంతరంగా వదిలేసిన నాటి వైసీపీ ప్రభుత్వం

నాడు బిల్లులు మంజూరు కాక కాంట్రాక్టర్ల కేసులు

ఐదు నియోజకవర్గాల్లోని లే అవుట్లను పరిశీలించిన కలెక్టర్‌

రోడ్లు, మంచినీరు, విద్యుత కల్పించాలని స్థానికుల వినతి

దయనీయంగా జిల్లాలోని 665 లే అవుట్ల పరిస్థితి

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 665 జగనన్న లే అవుట్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో సెంటుభూమి, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి చొప్పున లబ్ధిదారులకు కేటాయించారు. వీటిలో అధిక శాతం మందికి నేటికీ తమకు కేటాయించిన స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి. కొందరు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. కానీ, ఈ లే అవుట్లలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. గృహ నిర్మాణ పురోగతిపై నెలలో రెండు విడతలుగా కలెక్టర్‌ బాలాజీ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించకపోవడానికి లే అవుట్లలో కనీస వసతులు లేకపోవడమే కారణమని గృహనిర్మాణ సంస్థ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇటీవల కలెక్టర్‌ జిల్లాలోని పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోని లే అవుట్లను పరిశీలించారు. ఈ సమయంలో లే అవుట్లలో ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నవారు తాము పడుతున్న ఇబ్బందులకు కలెక్టర్‌ ఎదుట ఏకరువు పెట్టారు. నూతనంగా నిర్మించిన కాలనీల్లో రహదారులు, విద్యుత, తాగునీటి వసతులు కల్పించాలని కోరారు.

జిల్లాలోని లే అవుట్లలో పరిస్థితి ఇదీ..

జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన లే అవుట్లలో అంతర్గత రహదారులు నిర్మించకపోవడంతో అక్కడ నివాసం ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు.

  • మచిలీపట్నం మండలం రుద్రవరంలో ఏర్పాటుచేసిన రెండు లే అవుట్లలో సగానికి పైగా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఈ లే అవుట్లలో రూ.1.50 కోట్లతో మెరక పనులు చేసినట్లుగా చూపి గతంలో బిల్లులు చేసుకున్నారు. కానీ, పనులు సక్రమంగా చేయలేదు. ఇళ్ల మధ్య అంతర్గత రహదారులకు సంబంధించి పనులు చేయకపోవడంతో వర్షాకాలంలో ద్విచక్రవాహనం ఇంటి వరకు వెళ్లే అవకాశం కూడా లేకుండాపోయింది. ఇటీవల కలెక్టర్‌ ఈ కాలనీని పరిశీలించిన సమయంలో స్థానికులు తమ సమస్యలు చెప్పుకొన్నారు.

  • గుండుపాలెం పంచాయతీ శివారు పల్లెపాలెంలో స్థలాలుగా ఇచ్చిన భూమి పల్లపు ప్రాంతంలో ఉంది. ఈ లే అవుట్‌లో మెరక పనులు సక్రమంగా చేయకుండానే వైసీపీ నాయకులు బిల్లులు చేసుకున్నారు.

  • కరగ్రహారంలోని లే అవుట్‌లో 16 వేల మందికి సెంటు భూమి చొప్పున స్థలాలు ఇచ్చారు. ఇక్కడ కూడా అంతర్గత రహదారులకు సంబంధించిన పని ఒక్కటీ జరగలేదు.

  • గన్నవరం మండలం కేసరపల్లి లే అవుట్‌కు వెళ్లేందుకు రూ.3 కోట్ల అంచనాతో వంతెన నిర్మిస్తామని రెండేళ్ల కిందట అధికారులు ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఈ వంతెన పనులు ప్రారంభమే కాలేదు. ఇక్కడ ఎకరానికి రూ.70 లక్షలు చెల్లించి 60 ఎకరాలను కొని లే అవుట్‌ వేశారు. 3,400 మందికి స్థలాలు ఇచ్చారు. ఈ లే అవుట్‌కు వెళ్లేందుకు వంతెన నిర్మాణాన్ని మాత్రం పక్కన పెట్టేశారు. దీంతో ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు సరైన దారిలేక ఇబ్బందులు పడుతున్నారు.

వివిధ దశల్లో ఉన్న 32,354 ఇళ్లు

665 లే అవుట్లలో 86,084 ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు ఇచ్చారు. ఇందులో 62,187 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా, 29,833 పూర్తి చేశారు. మరో 32,354 నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి. 5,033 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు. నూతన కాలనీల్లో ఇళ్ల మధ్య రహదారులకు మెరక కూడా చేయలేదు. దీంతో నివాసం ఉంటున్నవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే ఇళ్ల మధ్య నీరు నిలిచిపోతోంది. దీంతో కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు ఇటుకలు, ఇసుక, ఇనుము వంటి మెటీరియల్‌ను తెచ్చుకునేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ కాలనీల్లోని అంతర్గత రహదారుల పనులు చేయించే బాధ్యతను గతంలో పంచాయతీరాజ్‌ విభాగానికి అప్పగించారు. గన్నవరం, తదితర మండలాల్లోని లే అవుట్లలో రహదారుల నిర్మాణ పనులు చేసినా బిల్లులు మంజూరు కాకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు మంజూరు కావడం లేదనే కారణంతో కాంట్రాక్టర్లు టెండర్లు కూడా వేయకపోవడంతో లే అవుట్లలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదు.

ప్రతిపాదనలు తయారుచేసేనా..?

జిల్లాలోని లే అవుట్లలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు తయారు చేయలేదని పంచాయతీరాజ్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అంతర్గత రహదారులను మెరక చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ గతంలో అధికారులకు సూచించారు. నవంబరు చివరి నాటికి వర్షాలు తగ్గుముఖం పడితే ఉపాధి హామీ పథకం, ఇతరత్రా నిధులతో కొంతమేర అయినా పనులు చేయాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:58 AM